20
1 ✽అప్పుడు ఒక దేవదూత పరలోకంనుంచి దిగిరావడం నాకు కనిపించింది. అతని చేతిలో అగాధానికి✽ తాళంచెవి, పెద్ద గొలుసు ఉన్నాయి. 2 అతడు రెక్కలున్న సర్పాన్ని✽ – అపనింద పిశాచమూ సైతానూ✽ అయి ఉన్న ఆ ఆది సర్పాన్ని పట్టుకొని వెయ్యేళ్ళకు✽ బంధించి✽ 3 వాణ్ణి అగాధంలో పడవేశాడు. ఆ వెయ్యేళ్ళు గడిచేంతవరకూ వాడు ఇక జనాలను మోసగించకుండా✽ ఆ దేవదూత అగాధం మూసివేసి వాడిపైగా ముద్ర వేశాడు✽. ఆ తరువాత వాణ్ణి కొద్ది కాలానికి✽ విడుదల చేయడం జరిగితీరాలి.4 అప్పుడు సింహాసనాలనూ✽ వాటిమీద కూర్చుని ఉన్నవారినీ చూశాను. తీర్పు తీర్చడానికి✽ అధికారం వారికివ్వబడింది. యేసును గురించిన సాక్ష్యం చెప్పినందుకూ దేవుని వాక్కును బట్టీ శిరచ్ఛేదం పాలైనవారి ఆత్మలను✽ కూడా చూశాను. వారు ఆ మృగాన్నయినా✽ వాడి విగ్రహాన్నయినా పూజ చేయకుండా వాడి ముద్ర తమ నొసట గానీ చేతిమీద గానీ పడనివ్వకుండా ఉన్నవారు. వారు బ్రతికి✽ క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు✽ రాజ్యపరిపాలన చేసారు✽. 5 ✽చనిపోయిన వారిలో తక్కినవారు✽ ఆ వెయ్యి సంవత్సరాలు గడిచేంతవరకూ మళ్ళీ బ్రతకలేదు. ఇది మొదటి పునర్జీవితం. 6 ఈ మొదటి పునర్జీవితంలో పాల్గొన్నవారు ధన్యులూ పవిత్రులూ✽. అలాంటివారిమీద రెండో చావు✽కు అధికారం ఉండదు. వారు దేవునికీ క్రీస్తుకూ యాజులై✽ ఆయనతోకూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యపరిపాలన చేస్తారు✽.
7 ✽ఆ వెయ్యి సంవత్సరాలు గడిచిన తరువాత సైతానుకు తన ఖైదులోనుంచి విడుదల కలుగుతుంది. 8 భూమి నలుదిక్కులా ఉన్న జనాలను – గోగు, మాగోగులను✽ – మోసపుచ్చి✽ యుద్ధానికి పోగు చేయడానికి వాడు బయలుదేరిపోతాడు. లెక్కకు వారు సముద్రం ఇసుక రేణువులలాంటివారు. 9 వారు భూమి విశాలంమీద✽ సాగిపోయి పవిత్రుల శిబిరమైన ఆ ప్రియ నగరం✽ చుట్టుముట్టారు. అప్పుడు దేవుని దగ్గర నుంచి పరలోకంలోనుంచి మంటలు✽ దిగివచ్చి వారిని మ్రింగివేస్తాయి. 10 వారిని మోసపుచ్చిన అపనింద పిశాచాన్ని మృగమూ కపట ప్రవక్తా ఉన్న అగ్నిగంధకాల సరస్సులో పడవేయడం జరిగింది. వారు✽ యుగయుగాలకు✽ రాత్రింబగళ్లు వేదనపాలై ఉంటారు.
11 ✽అప్పుడు తెల్లని మహా సింహాసనాన్నీ దానిమీద కూర్చుని ఉన్న వ్యక్తినీ✽ చూశాను. ఆయన సముఖంనుంచి భూమి, ఆకాశం పారిపోయాయి. వాటికి నిలువ చోటు ఎక్కడా దొరకలేదు✽. 12 అప్పుడు దేవుని ముందర చనిపోయినవారు✽ – ఘనులైనా అల్పులైనా నిలుచుండడం చూశాను. అప్పుడు గ్రంథాలు✽ విప్పబడ్డాయి. మరో గ్రంథం కూడా విప్పబడింది – అదే జీవ గ్రంథం✽. ఆ గ్రంథాలలో రాసి ఉన్న విషయాల ప్రకారం, వారి పనులనుబట్టి, చనిపోయినవారు తీర్పుకు గురి అయ్యారు✽. 13 సముద్రం✽ తనలో ఉన్న చనిపోయినవారిని అప్పగించింది. మృత్యువు✽, పాతాళం✽ తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి. ప్రతి ఒక్కరూ తమ పనుల ప్రకారమే తీర్పుకు గురి అయ్యారు. 14 ✽అప్పుడు మృత్యువూ పాతాళమూ అగ్ని సరస్సులో పడవేయబడ్డాయి. ఇది రెండో చావు✽. 15 ✽ఏ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాసి ఉన్నట్టు కనబడలేదో ఆ వ్యక్తి అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది.