18
1 ఈ సంగతుల తరువాత వేరొక దేవదూత✽ పరలోకంనుంచి దిగిరావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతని మహిమా ప్రకాశంచేత భూమి ప్రకాశించింది. 2 అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా చెప్పాడు:“మహా బబులోను కూలిపోయింది✽! కూలిపోయింది! అది దయ్యాల కొంప✽ అయింది, ప్రతి మలినాత్మకూ ఉనికిపట్టయింది, మలినమైన అసహ్యమైన ప్రతి పక్షికీ పంజరమయింది. 3 ఎందుకంటే జనాలన్నీ దాని వ్యభిచార ఆగ్రహ ద్రాక్షమద్యం✽ తాగాయి. భూరాజులు దానితో వ్యభిచరించారు, భూవర్తకులు✽ దాని అధిక సుఖభోగాల✽ మూలంగా ధనికులయ్యారు.”
4 అప్పుడు పరలోకంనుంచి మరో స్వరం✽ ఇలా చెప్పగా విన్నాను:
“నా ప్రజలారా! మీరు దాని అపరాధాలలో పాలివారు✽ కాకుండా, దాని ఈతిబాధలు అనుభవించకుండా దానిలోనుంచి బయటికి రండి✽. 5 ఎందుకంటే, దాని పాపాలు ఆకాశంవరకూ✽ అందుకొన్నాయి. దాని అక్రమ కార్యాలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు✽. 6 అది మీకు చేసినట్టు దానికి చెయ్యండి✽! దాని పనుల ప్రకారం దానికి రెట్టింపు చెయ్యండి! అది కలిపిన పాత్ర✽లో దానికోసం రెండంతలు కలపండి! 7 ✽అది తనను ఎంతగా ఘనపరచుకొంటూ సుఖభోగాలలో బ్రతికిందో అంతగా దానికి వేదన, దుఃఖం కలిగించండి! ఎందుకంటే, అది లోలోపల ఇలా అనుకొంటూ ఉంది – ‘నేను రాణిగా✽ కూర్చుని ఉన్నాను. విధవరాలిని కాను. దుఃఖాన్ని చూడనే చూడను.’ 8 అందుచేత ఒక్క రోజులోనే✽ దానిమీదికి రావలసిన దెబ్బలు – మరణం, దుఃఖం, కరవు వచ్చిపడతాయి. దానికి తీర్పు తీర్చే ప్రభువైన దేవుడు✽ బలాఢ్యుడు, గనుక అది నిప్పంటుకుని పూర్తిగా కాలిపోతుంది.
9 “దానితో వ్యభిచరిస్తూ సుఖభోగాలలో బతికిన భూరాజులు✽, కాలిపోతున్న దాని పొగను చూచినప్పుడు దానికోసం గుండెలు బాదుకొంటూ ఏడుస్తారు✽, 10 దాని బాధల విషయమైన భయంతో✽ దూరంగా నిలుచుండి ఇలా అంటారు: ‘అయ్యో! అయ్యో! మహా నగరమైన బబులోనూ! బలమైన నగరమా✽! ఒక్క ఘడియలోనే నీమీదికి తీర్పు వచ్చింది!’
11 “భూలోక వర్తకులు✽ కూడా బబులోను గురించి ఏడుస్తూ రోదనం చేస్తూ✽ ఉంటారు. ఎందుకంటే అప్పటినుంచి వారి సరకులు కొనేవారెవరూ ఉండరు. 12 వారి సరకులేవంటే, బంగారం, వెండి, విలువైన రాళ్ళు, ముత్యాలు, సున్నితమైన నారబట్ట, ఊదా బట్ట, పట్టు బట్ట, ఎర్రని బట్ట, అన్ని రకాల దబ్బ మ్రాను, దంతంతో చేసిన అన్ని రకాల వస్తువులు, చాలా విలువైన కొయ్యలతో, కంచు ఇనుము చలువరాళ్ళతో చేసిన అన్ని రకాల వస్తువులు, 13 దాల్చిన చెక్క, ధూపద్రవ్యాలు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసం, ఆలీవ్‌నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు, గుర్రాలు, రథాలు, మనుషుల శరీరాలూ ప్రాణాలూ✽.
14 “నీవు ఆశించే ఫలం నీకు దూరమయింది. విలాసవంతమైనవీ, ధగధగలాడేవీ అన్నీ నీకు దూరమయ్యాయి. అవి ఇకెన్నడూ నీకు కనిపించవు.
15 “ఆ నగరం ద్వారా ధనికులుగా అయిన ఆ సరకుల వర్తకులు దాని బాధల విషయమైన భయంతో దూరంగా నిలుచుండి ఏడుస్తూ రోదనం చేస్తూ ఇలా అంటారు: 16 ‘అయ్యో! అయ్యో! ఆ మహా నగరం! అది సున్నితమైన బట్ట, ఊదా బట్ట, ఎర్రని బట్ట తొడుక్కొని బంగారంతో విలువైన రాళ్ళతో ముత్యాలతో తనను అలంకరించుకొన్నదే! ఒక్క ఘడియలోనే ఇంత గొప్ప కలిమి పాడైపోయిందే!’
17 ✽“ప్రతి నౌకాధిపతీ, ఓడ ప్రయాణం చేసేవారంతా, నావికులంతా, సముద్ర వ్యాపారం చేసేవారంతా దూరంగా నిలుచుండి 18 కాలిపోతున్న ఆ నగరం పొగను చూచి ‘ఈ మహా నగరంలాంటి మరో నగరం ఏది?✽’ అని బిగ్గరగా చెప్పుకొంటారు. 19 తమ నెత్తిమీద దుమ్ము ఎత్తి పోసుకొని ఏడుస్తూ రోదనం చేస్తూ ‘అయ్యో! అయ్యో! ఆ మహా నగరం! దాని ధన సమృద్ధి✽ వల్ల సముద్రంమీద ఓడలున్న వారంతా ధనికులయ్యారు గాని ఒక్క ఘడియలోనే అది పాడైపోయిందే!’ అని బిగ్గరగా చెప్పుకొంటారు.
20 ✽“పరలోకమా! పవిత్రులైన క్రీస్తు రాయబారులారా! ప్రవక్తలారా! ఆ నగరం గురించి ఆనందించండి! ఎందుకంటే, దేవుడు మీ విషయం✽ దానికి తీర్పు తీర్చాడు.”
21 అప్పుడు బలిష్ఠుడైన ఒక దేవదూత పెద్ద తిరుగటిరాయలాంటి ఒక రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు: “ఇలాగే మహా నగరమైన బబులోనును బలాత్కారంగా పడవేయడం జరుగుతుంది. అది మరెన్నటికీ కనబడకుండా పోతుంది. 22 ✽తంతి వాద్యాలు వాయించేవారి సంగీత నాదం, గాయకులూ, పిల్లనగ్రోవి ఊదేవారూ, బూరలు ఊదేవారూ చేసే సంగీతనాదం ఇకెన్నటికీ✽ నీలో వినిపించదు. ఏ చేతిపని అయినా చేసే ఏ చేతిపనివాడూ ఇకెన్నటికీ నీలో కనిపించడు. తిరుగటి ధ్వని ఇకెన్నటికీ నీలో వినిపించదు. 23 దీపం వెలుగు ఇంకెన్నటికి నీలో ప్రకాశించదు. పెళ్ళి కొడుకు స్వరం, పెళ్ళి కూతురు స్వరం ఇకెన్నటికీ నీలో వినబడవు. ఎందుకంటే, నీ మాయమంత్రాల✽ చేత జనాలన్నీ మోసపోయాయి.✽ భూమిమీద గొప్పవారు✽ నీ వర్తకులే.
24 ✽“ఆ నగరంలో ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం, భూమిమీద హతమైనవారందరి రక్తమూ✽ కనిపించింది.”