16
1 “మీరు వెళ్ళి దేవుని ఏడు కోప పాత్రలు భూమిమీద కుమ్మరించండి” అని గర్భాలయంనుంచి గొప్ప స్వరం ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా విన్నాను.
2 అప్పుడు మొదటి దేవదూత వెళ్ళి భూమిమీద తన పాత్ర కుమ్మరించాడు. అప్పుడు మృగం ముద్ర ఉన్నవారిమీదా వాడి విగ్రహాన్ని పూజించేవారిమీదా అసహ్యమైన చెడ్డ కురుపు పుట్టింది.
3 రెండో దేవదూత సముద్రంమీద తన పాత్ర కుమ్మరించాడు. అప్పుడు సముద్రం చనిపోయినవాని రక్తంలాగా మారింది, సముద్రంలో ప్రతి ప్రాణీ చచ్చింది.
4 మూడో దేవదూత నదులమీదా నీళ్ళ ఊటల మీదా తన పాత్ర కుమ్మరించాడు. అవి రక్తం అయ్యాయి. 5 అప్పుడు జలాల దేవదూత ఇలా చెప్పడం విన్నాను:
“ప్రస్తుతముంటూ, పూర్వముండి, తరువాత ఉండబోయే వాడా! ప్రభూ! ఈ విధంగా తీర్పు తీర్చడంలో నీవు న్యాయవంతుడవే. 6 వారు ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం ఒలికించారు, వారికి తాగడానికి నీవు రక్తం ఇచ్చావు. దీనికి వారు తగినవారే.”
7 అందుకు “అవును, ప్రభువైన దేవా, అమిత శక్తి గలవాడా, నీ తీర్పులు యథార్థమైనవి, న్యాయమైనవి” అని మరొకరి స్వరం వేదికనుంచి నాకు వినబడింది.
8 నాలుగో దేవదూత సూర్యమండలం మీద తన పాత్ర కుమ్మరించాడు. అప్పుడు దానికి మనుషులను మాడ్చడానికి ఇవ్వబడింది. 9 మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు, ఈ ఈతిబాధల మీద అధికారమున్న దేవుని పేరును దూషించారు గాని పశ్చాత్తాపపడి దేవునికి మహిమ చేకూర్చలేదు.
10 అయిదో దేవదూత ఆ మృగం సింహాసనం మీద తన పాత్ర కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం చీకటి మయమైంది. మనుషులు వేదనకు తట్టుకోలేక నాలుకలు కొరుక్కొన్నారు, 11 తమకు కలిగిన వేదనలను బట్టీ కురుపులను బట్టీ పరలోక దేవుణ్ణి దూషించారు. అయితే తమ క్రియలను గురించి పశ్చాత్తాపపడలేదు.
12 ఆరో దేవదూత యూఫ్రటీసు అనే మహా నదిమీద తన పాత్ర కుమ్మరించాడు. తూర్పు రాజులకు దారి సిద్ధం అయ్యేలా దాని నీళ్ళు ఎండిపోయాయి. 13 అప్పుడు రెక్కలున్న సర్పం నోట్లోనుంచీ మృగం నోట్లోనుంచీ కపట ప్రవక్త నోట్లోనుంచీ కప్పలలాంటి మూడు మలినాత్మలు బయలు దేరడం నాకు కనిపించింది. 14 అవి సూచనకోసం అద్భుతాలు చేసే పిశాచాలు, అమిత శక్తిగల దేవుని మహా దినాన జరిగే యుద్ధానికి సర్వలోక రాజులను పోగు చేయడానికి వారిదగ్గరికి పోయే ఆత్మలు.
15 “ఇదిగో వినండి, దొంగ వచ్చినట్టు నేను వస్తున్నాను. దిగంబరంగా నడుచుకోకుండా, నలుగురిలో సిగ్గుపాలు కాకుండా మెళకువగా ఉండి తన దుస్తులు కాపాడుకొనే వ్యక్తి ధన్యజీవి.”
16 అవి వారిని హీబ్రూ భాషలో “హర్‌మెగిద్దోన్” అనే స్థలానికి పోగు చేశాయి.
17 ఏడో దేవదూత గాలిలో తన పాత్ర కుమ్మరించాడు. అప్పుడు పరలోక గర్భాలయంలోనుంచి సింహాసనంనుంచి గొప్ప స్వరం వస్తూ “సమాప్తం అయింది” అన్నది. 18 అప్పుడు ధ్వనులూ ఉరుములూ మెరుపులూ పుట్టాయి. బ్రహ్మాండమైన భూకంపం కూడా కలిగింది. భూమి మీద మనుషులు ఉన్న మొదటి నాటినుంచి అలాంటి బ్రహ్మాండమైన గొప్ప భూకంపం కలగలేదు. 19 మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. జనాల నగరాలు కుప్పకూలాయి. దేవుడు తన కోప తీవ్రత మద్యంతో నిండిన గిన్నె మహా బబులోనుకు ఇవ్వడానికి అది తన సన్నిధానంలో జ్ఞప్తికి వచ్చింది. 20 అప్పుడు ప్రతి ద్వీపమూ పారిపోయింది. పర్వతాలు కనబడకుండా పోయాయి. 21 ఆకాశంనుంచి మనుషులమీద బ్రహ్మాండమైన వడగండ్లు పడ్డాయి. ఒక్కొక్కదాని బరువు సుమారు నలభై అయిదు కిలోలు. ఈ వడగండ్ల దెబ్బ ఎంతో గొప్పది గనుక ఆ దెబ్బను బట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు.