15
1 పరలోకంలో మరో గొప్ప అద్భుతమైన సూచన నాకు కనిపించింది. అదేమంటే, ఏడు ఈతిబాధలు చేతపట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలు. ఇవి చివరివి ఎందుకంటే వీటితో దేవుని కోపం తీరిపోతుంది.
2 నిప్పుతో కలిసిన గాజు సరస్సులాంటిది కూడా నాకు కనిపించింది. మృగంమీదా వాడి విగ్రహంమీదా వాడి ముద్రమీద వాడి పేరుకున్న సంఖ్యమీదా గెలుపొందినవారు ఆ గాజు సముద్రంమీద నిలుచున్నారు. వారికి దేవుని తంతి వాద్యాలు ఉన్నాయి. 3 వారు దేవుని దాసుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ, “ప్రభువైన దేవా! అమిత శక్తిగలవాడా! నీ పనులు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి. పవిత్రులకు రాజా! నీ త్రోవలు న్యాయమైనవి, యథార్థమైనవి. 4 ప్రభూ! నీవు మాత్రమే పవిత్రుడవు గనుక నీకు ఎవరు భయపడకుండా ఉంటారు? నీ పేరును ఎవరు మహిమపరచకుండా ఉంటారు? నీ తీర్పులు వెల్లడి అయ్యాయి, గనుక జనాలన్నీ వచ్చి నీ సన్నిధిలో ఆరాధిస్తారు” అన్నారు.
5 ఈ సంగతుల తరువాత నేను చూస్తూ ఉంటే పరలోకంలో సాక్ష్యంకోసమైన ఆరాధన గుడారం గర్భాలయం తెరచి ఉండడం నాకు కనిపించింది. 6 ఆ ఏడు ఈతిబాధలు చేతపట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దేవదూతలు ఆ గర్భాలయంలోనుంచి వచ్చారు. వారు శుభ్రమైన, ప్రకాశమానమైన శ్రేష్ఠమైన దుస్తులు తొడుక్కొన్నవారు. వారి ఛాతీమీద బంగారు దట్టి కట్టి ఉంది. 7 నాలుగు ప్రాణులలో ఒక ప్రాణి శాశ్వతంగా జీవిస్తూ ఉన్న దేవుని కోపంతో నిండిన ఏడు బంగారు పాత్రలు ఈ ఏడుగురు దేవదూతలకిచ్చింది. 8 అప్పుడు దేవుని మహిమా ప్రకాశంవల్ల, ఆయన ప్రభావంవల్ల కలిగిన పొగతో గర్భాలయం నిండిపోయింది. అందువల్ల ఏడు దేవదూతల ఏడు ఈతిబాధలు నెరవేరేంతవరకు గర్భాలయంలో ఎవరూ ప్రవేశించలేకపోయారు.