13
1 నేను సముద్ర తీరాన నిలబడి ఉన్నాను. అప్పుడు సముద్రంలో నుంచి క్రూర మృగం ఒకటి పైకి రావడం నాకు కనిపించింది. దానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. దాని కొమ్ములమీద పది కిరీటాలు ఉన్నాయి. దాని తలలమీద దేవదూషణతో కూడిన పేరు ఉంది. 2 నేను చూచిన ఆ మృగం చిరుతపులిని పోలింది. దాని పాదాలు ఎలుగుబంటి పాదాలలాంటివి. దాని నోరు సింహం నోరులాంటిది. దాని శక్తి, దాని సింహాసనం, గొప్ప అధికారం రెక్కలున్న సర్పం దానికిచ్చినవి.
3  దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లుంది. అయితే ఆ చావు దెబ్బ పూర్తిగా నయమయింది. లోకమంతా ఆశ్చర్యపడిపోతూ ఆ మృగాన్ని అనుసరించింది. 4 ఆ మృగానికి అధికారమిచ్చిన ఆ రెక్కలున్న సర్పాన్ని వారు పూజించారు. మృగాన్ని కూడా పూజిస్తూ “ఈ మృగానికి ఎవరు సాటి? దీనితో ఎవరు యుద్ధం చేయగలరు?” అన్నారు.
5 డంబాలూ దేవదూషణలూ పలికే నోరు ఆ మృగానికి ఇవ్వబడింది, నలభై రెండు నెలలు ఉండిపోవడానికి అధికారం వాడికి ఏర్పాటైంది. 6 దేవుణ్ణి దూషించడానికి, ఆయన పేరునూ ఆయన గుడారాన్నీ పరలోక నివాసులనూ దూషించడానికి వాడు నోరు తెరిచాడు. 7 వాడికి పవిత్రుల మీద యుద్ధం జరిగించి వారిని ఓడించడానికి అధికారం ఇవ్వడం జరిగింది. అంతే గాక, వాడికి ప్రతి గోత్రంమీదా ప్రతి భాష మాట్లాడేవారి మీదా ప్రతి దేశం మీదా అధికారం ఇవ్వబడింది. 8 భూమిమీద నివసించేవారంతా ఆ మృగాన్ని పూజిస్తారు – అంటే ప్రపంచానికి పునాది కుదిరిన నాటినుంచి వధ అయిన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారే ఆ మృగాన్ని పూజిస్తారు.
9 చెవిగలవాడు ఎవడైనా వింటారు గాక! 10  ఎవడైతే చెరపట్టాలని ఉంటే అతడు చెరలోకి పోతాడు. ఎవడైతే కత్తితో హతమారుస్తాడో అతడు కత్తితో హతం కావాలి. ఇందులో పవిత్రుల ఓర్పు, నమ్మకం ఉన్నాయి.
11 అప్పుడు వేరొక మృగం భూమిలోనుంచి పైకి రావడం నాకు కనబడింది. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల్లాంటి రెండు కొమ్ములున్నాయి, గానీ వాడురెక్కలున్న సర్పంలాగా మాట్లాడాడు. 12 వాడు ఆ మొదటి మృగానికున్న అధికారమంతా వాడి ముందర ప్రయోగిస్తూ ఉన్నాడు, లోకమూ దాని నివాసులూ చావు దెబ్బ తగిలి పూర్తిగా నయమయిన ఆ మొదటి మృగానికి మ్రొక్కేలా చేస్తూ ఉన్నాడు. 13 వాడు సూచనకోసమైన గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మనుషులు చూస్తూ ఉండగానే ఆకాశంనుంచి మంటలు భూమిమీదికి పడేలా సహా చేస్తున్నాడు. 14 వాడు ఆ మృగం దృష్టిలో చేయడానికి ఇవ్వబడ్డ సూచన కోసమైన అద్భుతాలవల్ల భూనివాసులను మోసగిస్తూ ఉన్నాడు. ఖడ్గంచేత గాయపడి బ్రతికిన మృగానికి భూమి మీద నివసించేవారు విగ్రహం చేయాలని చెప్పాడు. 15 అంతే కాదు, ఆ మృగ విగ్రహానికి ఊపిరి పోసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగ విగ్రహాన్ని పూజించని వారందరినీ చంపించడానికీ వాడికి అధికారం ఇవ్వబడింది.
16 అంతే కాకుండా, ఘనులేమీ అల్పులేమీ ధనికులేమీ దరిద్రులేమీ స్వతంత్రులేమీ దాసులేమీ అందరినీ వారి కుడి చేతిమీదో నొసటిమీదో ముద్రపడేలా వాడు బలవంతం చేస్తూ ఉన్నాడు. 17 ఆ ముద్ర గానీ మృగం పేరు గానీ వాడి పేరు సంఖ్య గానీ ఉన్నవారు తప్ప మరెవ్వరూ కొనడం, అమ్మడం జరిగించకుండా వాడు చేస్తూ ఉన్నాడు.
18 ఇందులో జ్ఞానం ఉంది – బుద్ధిగలవ్యక్తి ఆ మృగానికి ఉన్న సంఖ్య లెక్కించాలి. అది మనిషి సంఖ్య. వాడి సంఖ్య 666.