12
1 అప్పుడు ఆకాశ మండలంలో అద్భుతమైన గొప్ప సూచన కనిపించింది: సూర్యమండలం ధరించుకొన్న ఒక స్త్రీ. ఆమె పాదాలక్రింద చంద్రబింబం ఉంది. ఆమె తల మీద పన్నెండు నక్షత్రాల కిరీటం ఉంది. 2 ఆమె గర్భవతి. ప్రసవవేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేస్తూ ఉంది.
3 అప్పుడు ఆకాశ మండలంలో మరో సూచన కనిపించింది. అది రెక్కలున్న ఎర్రని మహా సర్పం. దానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. దాని తలలమీద ఏడు కిరీటాలు ఉన్నాయి. 4 దాని తోక ఆకాశ నక్షత్రాలలో మూడో భాగాన్ని లాగివేసి భూమిమీదికి పడవేసింది. కనబోతున్న ఆ స్త్రీ ప్రసవించగానే ఆమె శిశువును మింగివేసేందుకు రెక్కలున్న ఆ సర్పం ఆమె ఎదుట నిలుచుంది.
5 ఆమె మగ శిశువును కన్నది. జనాలన్నిటినీ ఇనుప దండంతో పరిపాలించబోయే వ్యక్తి ఆయనే. ఆమె సంతతివాణ్ణి దేవుని దగ్గరకూ ఆయన సింహాసనం దగ్గరకూ కొనిపోవడం జరిగింది. 6 ఆ స్త్రీ ఎడారిలోకి, ఆమెకోసం దేవుడు సిద్ధం చేసిన స్థలానికి పారిపోయింది. అక్కడ వెయ్యిన్ని రెండు వందల అరవై రోజులు వారు ఆమెను పోషించాలని దేవుని ఏర్పాటు.
7 పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేల్, అతని దూతలు రెక్కలున్న సర్పంమీద యుద్ధం జరిగించారు. రెక్కలున్న సర్పం, దాని దూతలు ఎదురు పోరాటం జరిపారు గాని 8 గెలవలేకపోయారు గనుక అప్పటినుంచి పరలోకంలో వారికి చోటు లేకుండా పోయింది. 9 రెక్కలున్న ఆ మహా సర్పం పడద్రోయబడింది. అది ఆదిసర్పం. దానికి అపనింద పిశాచం, సైతాను అని పేరు. అది సర్వ లోకాన్ని మోసగిస్తూ ఉంది. వాణ్ణి వాడితోపాటు వాడి దూతలనూ భూమిమీదికి పడద్రోయడం జరిగింది.
10 అప్పుడు పరలోకంలో గొప్ప స్వరం ఇలా చెప్పడం విన్నాను: “ఇప్పుడు దేవుని రక్షణ, ప్రభావం, రాజ్యం, ఆయన అభిషిక్తుని అధికారం వచ్చాయి! ఎందుకంటే, మన సోదరుల మీద నేరాలు మోపేవాడు పడద్రోయబడ్డాడు. రాత్రింబగళ్ళు వాడు మన దేవుని ఎదుట వారిమీద నేరాలు మోపుతూ వచ్చాడు. 11 అయితే వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టీ తాము చెపుతున్న సాక్ష్యాన్ని బట్టీ వాణ్ణి ఓడించారు. మరణంవరకూ తమ ప్రాణాలమీద వారికి ప్రీతి లేకపోయింది. 12 ఇందుకు, ఆకాశాల్లారా, వాటిలో నివసించేవారలారా, ఆనందించండి! అయితే భూమి, సముద్రం నివాసులకు అయ్యో, విపత్తు! ఎందుకంటే, అపవాద పిశాచం తనకు కొద్ది కాలమే మిగిలిందని తెలిసి తీవ్ర కోపంతో మీ దగ్గరకు దిగివచ్చాడు.”
13 రెక్కలున్న సర్పం తాను భూమిమీదికి పడద్రోయబడడం చూచి మగ శిశువును కన్న ఆ స్త్రీని హింసించాడు. 14 అయితే ఆ స్త్రీ ఎడారిలో ఆ సర్ప సమక్షం నుంచి ఒక కాలం, కాలాలు, సగం కాలం పోషణ పొందేలా తన స్థలానికి ఎగిరిపోయేలా ఆమెకు గొప్ప గరుడపక్షి రెక్కలు రెండు ఇవ్వబడ్డాయి. 15 అప్పుడా స్త్రీ ప్రవాహానికి కొట్టుకుపోవాలని సర్పం తన నోటనుంచి నీళ్ళు నదిలాగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కింది.; 16 కానీ స్త్రీకి భూమి సహాయం చేస్తూ నోరు తెరచి రెక్కలున్న సర్పం నోటనుంచి వెళ్ళగ్రక్కిన నదిని మ్రింగివేసింది. 17 ఆ స్త్రీని గురించి రెక్కలున్న సర్పం కోపంతో మండిపడింది. ఆమె సంతానంలో మిగిలినవారి మీద యుద్ధం చేయడానికి అది వెళ్ళిపోయింది. 18 ఆ సంతానమెవరంటే దేవుని ఆజ్ఞలు శిరసావహిస్తూ, యేసు క్రీస్తును గురించిన సాక్ష్యం చెపుతూ ఉన్నవారే.