11
1 కొలతబద్దలాంటి చేతి కర్ర నాకివ్వబడింది. ఆ దేవదూత నిలుస్తూ ఇలా అన్నాడు: “లేచి దేవుని ఆలయం, వేదిక కొలతలు తీసుకొని అందులో ఆరాధించేవారిని లెక్కపెట్టు. 2 అయితే ఆలయం బయటి ఆవరణం కొలత తీసుకోకుండా విడిచిపెట్టు. ఎందుకంటే అది యూదులు కాని జనాలకు ఇవ్వబడింది. వారు నలభై రెండు నెలలు పవిత్ర నగరాన్ని కాళ్ళక్రింద త్రొక్కుతారు. 3 నేను నా ఇద్దరు సాక్షులకు బలప్రభావాలు ఇస్తాను. వారు గోనెపట్ట కట్టుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై రోజులు దేవుని మూలంగా పలుకుతారు.”
4 వీరు భూలోకానికి దేవుడై ఉన్న వ్యక్తి ముందర నిలుచున్న రెండు ఆలీవ్ చెట్లూ రెండు దీపస్తంభాలూ. 5 ఎవరైనా సరే వీరికి హాని చేయజూస్తే వీరి నోటినుంచి మంటలు వచ్చి వీరి శత్రువులను మ్రింగివేస్తాయి. వీరికి హాని చేయజూచేవాడెవడైనా సరే వాడు ఇలాగే చంపబడాలి. 6 వీరు దేవుని మూలంగా పలికే రోజులలో వాన ఏమీ రాకుండా ఆకాశాన్ని మూసివేసే అధికారం వారికి ఉంది. అంతే కాక, తమకు ఇష్టం వచ్చినప్పుడెల్లా నీళ్ళు రక్తంగా మార్చడానికీ వాటిమీద, అన్ని రకాల ఈతిబాధలతో భూమిని మొత్తడానికీ కూడా వీరికి అధికారం ఉంది.
7 వీరు తమ సాక్ష్యం పూర్తిగా చెప్పిన తరువాత అగాధంలోనుంచి పైకి వచ్చే క్రూరమృగం వీరిమీద యుద్ధం చేస్తుంది, వీరిని ఓడించి చంపుతుంది. 8 వీరి మృత దేహాలు ఆ మహా నగరం వీధిలో పడివుంటాయి. ఆ నగరానికి అలంకారికంగా సొదొమ అనీ ఈజిప్ట్ అనీ పేరు. అక్కడే మన ప్రభువు సిలువ పాలయ్యాడు. 9 ఆయా ప్రజలలో, వంశాలలో, భాషలవారిలో, జాతులలో కొందరు మూడున్నర రోజులు వీరి మృత దేహాలను చూస్తూ వాటిని సమాధి చేయనివ్వరు. 10 ఈ ఇద్దరు ప్రవక్తలవల్ల భూనివాసులు వేదనపాలయ్యారు గనుక వీరి చావును బట్టి భూనివాసులు వీరి గురించి సంతోషంతో ఉప్పొంగిపోతూ సంబరపడుతూ ఉంటారు, ఒకరికొకరు బహుమతులు పంపుకొంటారు.
11 అయితే ఆ మూడున్నర రోజుల తరువాత దేవునినుంచి జీవ శ్వాస ఈ ప్రవక్తలలోకి వచ్చింది. వారు లేచి నిలబడ్డారు. వారిని చూచినవారు అధికంగా హడలిపోయారు. 12 “ఇక్కడికి పైకి రండి” అని పరలోకంనుంచి పెద్ద స్వరం తమతో అనడం ఈ ప్రవక్తలు విన్నారు. వారి విరోధులు చూస్తూ ఉండగానే వారు మేఘంలో పరలోకానికి పైకి వెళ్ళిపోయారు. 13 ఆ ఘడియలోనే పెద్ద భూకంపం కలిగింది. ఆ నగరంలో పదో భాగం కుప్పకూలింది. ఆ భూకంపానికి ఏడు వేలమంది చనిపోయారు. మిగిలినవారు ఎంతో భయపడుతూ పరలోక దేవుణ్ణి మహిమపరచారు.
14 రెండో విపత్తు గతించింది. ఇదిగో మూడో విపత్తు త్వరగా వస్తూ ఉంది.
15 ఏడో దేవదూత బూర ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించి ఇలా పలికాయి:
“భూలోక రాజ్యాలు మన ప్రభు రాజ్యాలు, ఆయన అభిషిక్తుని రాజ్యాలు అయ్యాయి. ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడు.”
16 అప్పుడు, దేవుని ముందర తమ సింహాసనాల మీద కూర్చుని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు:
17 ప్రభూ అమిత శక్తిగల దేవా! పూర్వముండి ప్రస్తుతముంటూ రానై ఉన్నవాడా! నీ మహా బల ప్రభావాలు ప్రయోగించి రాజ్య పరిపాలన చేశావు, గనుక మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. 18 జనాలు కోపగించాయి. నీ కోపం వచ్చింది. చనిపోయినవారికి తీర్పు తీర్చే సమయమూ, నీ దాసులైన ప్రవక్తలకూ పవిత్రులకూ నీ పేరంటే భయభక్తులున్న ఘనులకైనా అల్పులకైనా బహుమతులు ఇచ్చే సమయమూ, భూమిని నాశనం చేసేవారిని నాశనం చేసే సమయమూ వచ్చింది.”
19 అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరచుకొంది. ఆయన ఆలయంలో ఆయన ఒడంబడిక పెట్టె కనిపించింది. మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపం, గొప్ప వడగండ్లు కలిగాయి.