10
1 ✽✽బలిష్ఠుడైన వేరొక దేవదూత పరలోకంనుంచి దిగి రావడం నాకు కనిపించింది. ఆయన మేఘం ధరించుకొని ఉన్నాడు. ఆయన తలకు పైగా రంగుల విల్లు ఉంది. ఆయన ముఖం సూర్యమండలంలాంటిది✽. ఆయన కాళ్ళు నిప్పు స్తంభాలలాంటివి. 2 ఆయన చేతిలో చుట్టిన చిన్న పత్రం✽ ఒకటి ఉంది. అది విప్పి ఉంది. ఆయన తన కుడి పాదం సముద్రంమీద, ఎడమ పాదం నేలమీద మోపి✽ 3 పెద్ద స్వరంతో కేక వేశాడు. అది సింహం గర్జించినట్టు✽ ఉంది. ఆయన కేక వేసినప్పుడు ఏడు ఉరుముల స్వరాలు పలికాయి. 4 ✽ఆ ఏడు ఉరుముల స్వరాలు పలికినప్పుడు నేను రాయబోయాను గాని పరలోకంనుంచి ఒక స్వరం నాతో ఇలా అనడం విన్నాను: “ఏడు ఉరుములు పలికిన విషయాలు మూసివేయి. వాటిని రాయకు.”5 ✽నేను చూచినప్పుడు సముద్రం మీదా నేలమీదా నిలబడ్డ ఆ దేవదూత తన చేయి ఆకాశంవైపు ఎత్తాడు, 6 పరలోకాన్నీ అందులో ఉన్నవాటినీ భూమినీ అందులో ఉన్నవాటినీ సముద్రాన్నీ అందులో ఉన్నవాటినీ సృజించిన, శాశ్వతంగా జీవిస్తూ ఉన్న వ్యక్తి తోడని ఇలా శపథం చేశాడు: 7 ఇక ఆలస్యం కాదు✽. ఏడో దేవదూత బూర ఊది వినిపించే రోజులలో✽ అతడు బూర ఊదబోతూ ఉంటే, దేవుని రహస్య సత్యం✽ పూర్తిగా నెరవేరుతుంది. ఇది ప్రవక్తలైన తన దాసులకు ఆయన ప్రకటించినట్టే జరుగుతుంది.”
8 పరలోకంనుంచి నాకు వినిపించిన స్వరం మళ్ళీ నాతో మాట్లాడి “వెళ్ళి సముద్రంమీదా నేలమీదా నిలుచున్న దేవదూత చేతిలో విప్పి ఉన్న పత్రం తీసుకో” అని పలికింది.
9 అందుచేత నేనా దేవదూత దగ్గరకు వెళ్ళి ఆయనతో “ఆ చిన్న పత్రం నాకివ్వండి” అన్నాను. అప్పుడాయన నాతో “ఇది తీసుకొని తిను✽. ఇది నీ కడుపులో చేదవుతుంది గాని నీ నోట్లో మాత్రం ఇది తేనెలాగా తియ్యగా✽ ఉంటుంది” అన్నాడు. 10 దేవదూత చేతిలోనుంచి ఆ చిన్న పత్రం తీసుకొని దానిని తినివేశాను. నా నోట్లో అది తేనెలాగా తియ్యగా ఉంది గాని అది తిన్న తరువాత నా కడుపులో చేదైపోయింది.
11 అప్పుడాయన నాతో “మరో సారి అనేక ప్రజలు, జనాలు, భాషలు, రాజులను గురించి నీవు దేవుని మూలంగా పలకాలి✽” అన్నాడు.