9
1 అయిదో దేవదూత బూర ఊదాడు. అప్పుడు ఆకాశం నుంచి భూమిమీదికి రాలిన నక్షత్రాన్ని చూశాను. అతడికి అగాధం తాళంచెవి ఇవ్వబడింది. 2 అతడు అగాధం తెరిచాడు. అప్పుడు బ్రహ్మాండమైన కొలిమినుంచి లేచే పొగలాంటి పొగ అగాధంనుంచి లేచింది. అగాధం పొగతో సూర్యగోళం, వాయుమండలం చీకటిమయం అయ్యాయి. 3 ఆ పొగలోనుంచి మిడతలు భూమిమీదికి వచ్చిపడ్డాయి. వాటికి భూమిలోని తేళ్ళకున్న శక్తిలాంటి శక్తి ఇవ్వడం జరిగింది. 4 భూమి గడ్డికి గానీ ఎలాంటి మొక్కకూ చెట్టుకూ గానీ హాని చేయకూడదనీ నొసళ్ళమీద దేవుని ముద్ర లేని మనుషులకే హాని చేయాలనీ వాటికి ఆజ్ఞ వచ్చింది. 5 ఆ మనుషులను అయిదు నెలలపాటు వేధించడానికి వాటికి అధికారం ఇచ్చి ఉంది గాని చంపడానికి మాత్రం కాదు. వాటివల్ల కలిగే వేదన తేలు మనిషిని కుట్టినట్టుంది. 6  ఆ రోజులలో మనుషులు చావుకోసం దేవులాడుతూ ఉంటారు గాని అది దొరకదు. చావాలని తహతహలాడుతూ ఉంటారు గాని చావు వారి దగ్గరనుంచి పారిపోతుంది.
7 ఆ మిడతల ఆకారాలు యుద్ధానికి సిద్ధమైన గుర్రాల్లాంటివి. వాటి తలలమీద బంగారు కిరీటాల లాంటివి ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాలలాంటివి. 8 వాటికి స్త్రీల తల వెంట్రుకలలాంటి వెంట్రుకలున్నాయి. వాటి పళ్ళు సింహాల కోరలలాంటివి. 9 వాటికి ఇనుప ఛాతీ కవచంలాంటి కవచాలున్నాయి. వాటి రెక్కల చప్పుడు యుద్ధానికి పరుగెత్తుతూ ఉన్న అనేక గుర్రాలున్న రథాల చప్పుడులాంటిది. 10 వాటికి తేళ్ళలాంటి తోకలు ఉన్నాయి. వాటి తోకలకు కొండ్లు ఉన్నాయి. అయిదు నెలలవరకు మనుషులకు హాని చేయడానికి వాటికి అధికారం ఉంది.
11 వాటి మీద ఒక రాజు ఉన్నాడు. వాడు అగాధం దూత. హీబ్రూ భాషలో వాడి పేరు “అబద్దోన్” గాని గ్రీక్ భాషలో వాడి పేరు “అపొల్లుయోన్”.
12 మొదటి విపత్తు గతించింది. ఇదిగో, ఈ సంగతుల తరువాత ఇంకా రెండు విపత్తులు రాబోతున్నాయి.
13 ఆరో దేవదూత బూర ఊదాడు. అప్పుడు దేవుని ముందర ఉన్న బంగారు వేదిక నాలుగు కొమ్ములనుంచి ఒక స్వరం నాకు వినవచ్చింది. 14 ఆ స్వరం, బూర ఉన్న ఆ ఆరో దేవదూతతో “యూఫ్రటీసు అనే మహానది దగ్గర బంధించి ఉన్న నలుగురు దేవదూతలను విడిపించు” అంది. 15 ఆ సంవత్సరానికీ నెలకూ రోజుకూ గంటకూ సిద్ధంగా ఉంచబడ్డ ఆ నలుగురు దేవదూతలను మనుషులలో మూడో భాగాన్ని చంపడానికి విడిపించడం జరిగింది. 16  సైన్యంలో ఉన్న రౌతుల లెక్క ఇరవై కోట్లు. వారి లెక్క విన్నాను. 17 ఆ దర్శనంలో ఆ గుర్రాలూ వాటి మీద కూర్చుని ఉన్నవారూ నాకు ఇలా కనిపించారు: వారికి నిప్పు రంగు, నీలం, గంధకం రంగు గల కవచాలున్నాయి. ఆ గుర్రాల తలలు సింహాల తలల్లాంటివి. వాటి నోళ్ళనుంచి మంటలు, పొగ, గంధకాలు బయలుదేరుతూ ఉన్నాయి. 18 ఈ మూడు దెబ్బలచేత, అంటే వాటి నోళ్ళనుంచి బయలుదేరుతున్న మంటలు, పొగ, గంధకాలచేత మనుషులలో మూడో భాగం చంపబడ్డారు. 19 వాటి శక్తి వాటి నోళ్ళలో, వాటి తోకలలో ఉంది. ఎందుకంటే వాటి తోకలు తలలు గలవై పాముల్లాంటివి. ఆ తోకలతో అవి హాని చేస్తాయి.
20 ఈ దెబ్బలతో చావకుండా మనుషులలో మిగిలినవారు తమ చేతులతో చేసిన పనులను గురించి పశ్చాత్తాపపడలేదు. అంటే, దయ్యాలనూ, చూడలేని వినలేని నడవలేని బంగారు వెండి కంచు రాయి కొయ్యలతో చేసిన విగ్రహాలనూ పూజించడం మానలేదు. 21 తమ హత్యలూ తమ మంత్రప్రయోగాలూ తమ వ్యభిచారాలూ తమ దొంగతనాల గురించి కూడా వారు పశ్చాత్తాపపడలేదు.