8
1 ఆయన ఏడో ముద్ర✽ విప్పినప్పుడు పరలోకంలో సుమారు అరగంట సేపు నిశ్శబ్దం✽ ఆవరించింది. 2 దేవుని ముందర నిలుచుండే ఏడుగురు దేవదూతలను చూశాను. వారికి ఏడు✽ బూరలు✽ ఇవ్వడం జరిగింది.3 అప్పుడు మరో దేవదూత వచ్చి ధూపవేదిక✽ ఎదుట నిలిచాడు. అతడు బంగారు ధూపార్తి✽ చేతపట్టుకొని ఉన్నాడు. అతనికి చాలా ధూపం✽ ఇవ్వబడింది. అతడు దానిని పవిత్రులందరి ప్రార్థనలతో✽ కలిపి సింహాసనం ఎదుట ఉన్న బంగారు ధూపవేదిక మీద అర్పించాలని ఉద్దేశం. 4 ధూపం పొగ పవిత్రుల ప్రార్థనలతో కలిసి ఆ దేవదూత చేతిలోనుంచి పైకి పోయి దేవుని సన్నిధానం చేరింది. 5 అప్పుడా దేవదూత ధూపార్తిని తీసుకొని దానిని ధూపవేదిక మీద ఉన్న నిప్పుతో నింపి భూమి మీద పడవేశాడు. వెంటనే ధ్వనులూ ఉరుములూ మెరుపులూ ఒక భూకంపమూ✽ కలిగాయి.
6 అప్పుడు ఏడు బూరలు ఉన్న ఆ ఏడుగురు దేవదూతలు ఊదడానికి తమను సిద్ధం చేశారు.
7 ✽ మొదటి దేవదూత బూర ఊదాడు. అప్పుడు రక్తంతో కలిసిన నిప్పు, వడగండ్లు కలిగాయి. వాటిని భూమిమీదికి విసిరివేయడం జరిగింది. అప్పుడు చెట్లలో మూడో భాగం కాలిపోయింది, పచ్చగడ్డి అంతా కాలిపోయింది.
8 ✝రెండో దేవదూత బూర ఊదాడు. అప్పుడు అగ్నితో మండుతూ ఉన్న పెద్ద పర్వతంలాంటిది ఒకటి సముద్రంలో పడవేయడం జరిగింది, సముద్రంలో మూడో భాగం రక్తమయింది. 9 సముద్రంలోని ప్రాణులలో మూడో భాగం చచ్చింది, ఓడల్లో మూడో భాగం నాశనమయింది.
10 ✽మూడో దేవదూత బూర ఊదాడు. అప్పుడు దివిటీలాగా మండుతూ ఉన్న పెద్ద నక్షత్రం ఒకటి ఆకాశం నుంచి రాలి నదులలో మూడో భాగంమీదా నీటి బుగ్గలమీదా పడింది. 11 ఆ నక్షత్రం✽ పేరు “చేదు”. దానివల్ల నీళ్ళలో మూడో భాగం చేదయింది. నీళ్ళు చేదు కావడం మూలాన, వాటివల్ల మనుషులు అనేకులు చనిపోయారు.
12 ✝నాలుగో దేవదూత బూర ఊదాడు. అప్పుడు సూర్యగోళంలో మూడో భాగం, చంద్రబింబంలో మూడో భాగం, నక్షత్రాలలో మూడో భాగం చీకటి అయి, పగటిలో మూడో భాగమూ రాత్రిలో మూడో భాగమూ ప్రకాశించకుండా వాటిలో మూడో భాగం దెబ్బ తిన్నది.
13 నేను చూస్తూ ఉంటే, ఆకాశం మధ్య ఒక దేవదూత✽ ఎగిరిపోతూ పెద్ద స్వరంతో ఇలా చెప్పడం విన్నాను: “ఇంకా బూరలు ఊదబోతున్న ముగ్గురు దేవదూతల బూరల ధ్వనులను బట్టి భూనివాసులకు అయ్యో, విపత్తు! విపత్తు! విపత్తు!”