6
1 గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో ఒకదాన్ని విప్పినప్పుడు నేను చూశాను. అప్పుడు ఆ నాలుగు ప్రాణులలో ఒకటి ఉరుములాంటి స్వరంతో “వచ్చి చూడు!” అనడం విన్నాను. 2 నేను చూస్తూ ఉంటే తెల్లని గుర్రం కనిపించింది. దానిమీద కూర్చుని ఉన్నవాడికి విల్లు ఉంది. అతనికి కిరీటం ఒకటి ఇవ్వబడింది. అతడు జయిస్తూ ఇంకా జయించడానికి బయలుదేరాడు.
3 ఆయన రెండో ముద్ర విప్పినప్పుడు రెండో ప్రాణి “వచ్చి చూడు!” అనడం విన్నాను. 4 మరో గుర్రం బయలుదేరింది. అది ఎర్రనిది. మనుషులు ఒకరినొకరు చంపుకొనేలా భూమిమీద శాంతి లేకుండా చేయడానికి ఈ గుర్రంమీద కూర్చుని ఉన్నవాడికి అధికారం ఇవ్వబడింది. అతడికి పెద్ద ఖడ్గం కూడా ఇవ్వబడింది.
5 ఆయన మూడో ముద్ర విప్పినప్పుడు మూడో ప్రాణి “వచ్చి చూడు!” అనడం విన్నాను. నేను చూస్తూ ఉంటే నల్లని గుర్రం ఒకటి కనిపించింది. దానిమీద కూర్చుని ఉన్నవాడు తక్కెడ చేతపట్టుకొని ఉన్నాడు.
6 అప్పుడా నాలుగు ప్రాణుల మధ్య ఒక స్వరం “రోజు కూలికి ఒక్క కిలో గోధుమలు, రోజు కూలికి మూడు కిలోల యవలు. నూనెనూ ద్రాక్షరసాన్నీ పాడు చేయకు” అని చెప్పడం విన్నాను.
7 ఆయన నాలుగో ముద్ర విప్పినప్పుడు నాలుగో ప్రాణి స్వరం “వచ్చి చూడు!” అనడం విన్నాను. 8 నేను చూస్తూ ఉంటే బూడిద రంగు గుర్రం కనిపించింది. దానిమీద కూర్చుని ఉన్నవాడి పేరు “మృత్యువు”. “పాతాళం” వాడివెంట వస్తూ ఉంది. ఖడ్గంతో, కరవుతో, తెగులుతో, భూమిమీద ఉన్న క్రూర మృగాలతో మనుషులను చంపడానికి భూమి నాలుగో భాగంమీద వారికి అధికారమివ్వబడింది.
9 ఆయన అయిదో ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్కును బట్టీ తాము చేపట్టిన సాక్ష్యాన్ని బట్టీ హతమైనవారి ఆత్మలు బలిపీఠం క్రింద ఉండడం నేను చూశాను. 10 వారు పెద్ద స్వరంతో “ప్రభూ! పవిత్రుడా, సత్యస్వరూపీ, ఎందాకా భూలోక నివాసులకు తీర్పు తీర్చకుండా, మా రక్తం విషయం ప్రతిక్రియ చేయకుండా ఉంటావు?” అన్నారు. 11 అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ తెల్లని నిలువుటంగీ ఇవ్వబడింది. వారిలాగే హతం కాబోయేవారి లెక్క – వారి సాటి దాసులైన సోదరుల లెక్క పూర్తి అయ్యేవరకు వారింకా కొద్ది కాలం విశ్రమించాలని వారికి చెప్పడం జరిగింది.
12 ఆయన ఆరో ముద్ర విప్పినప్పుడు నేను చూస్తూ ఉంటే వెంటనే పెద్ద భూకంపం కలిగింది. సూర్యగోళం గొంగళిలాగా నల్లగా అయింది. చంద్ర బింబం రక్తంలాగా అయింది. 13 పెద్ద గాలికి ఊగులాడుతున్న అంజూర చెట్టు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రాలు భూమిమీద రాలాయి. 14 ఆకాశ మండలం చుట్టుకుపోతున్న కాగితంలాగా తొలగిపోయింది. ప్రతి పర్వతమూ ద్వీపమూ వాటి వాటి స్థానాలు తప్పాయి. 15  భూరాజులూ ప్రముఖులూ ధనికులూ సహస్రాధిపతులూ బలిష్టులూ ప్రతి దాసుడూ ప్రతి స్వతంత్రుడూ గుహలలో, కొండల బండల మధ్య దాక్కొన్నారు. 16 కొండలతో, బండలతో వారు ఇలా అన్నారు:
“మా మీద పడండి! సింహాసనం మీద కూర్చుని ఉన్నవాని ముఖంనుంచీ గొర్రెపిల్ల కోపంనుంచీ మమ్మల్ని మరుగు చెయ్యండి! 17 ఎందుకంటే ఆయన మహా కోప దినం వచ్చింది. దానిని ఎవరు తట్టుకోగలరు?”