5
1 సింహాసనంమీద కూర్చుని ఉన్న ఆయన✽ కుడి చేతిలో చుట్టి ఉన్న పత్రం✽ ఒకటి నాకు కనిపించింది. ఆ పత్రంలోనూ దాని వెనుక భాగంమీదా రాత ఉంది. పత్రం ఏడు ముద్రల✽తో ముద్రించబడింది. 2 అప్పుడు బలిష్ఠుడైన దేవదూతను✽ చూశాను. అతడు బిగ్గరగా ఇలా చాటించాడు: “చుట్టి ఉన్న ఈ పత్రాన్ని ముద్రలు తీసి విప్పడానికి ఎవరు యోగ్యుడు✽?”3 అయితే పరలోకంలో గానీ భూమిమీద గానీ భూమిక్రింద గానీ చుట్టి ఉన్న ఆ పత్రం విప్పగల వ్యక్తి, దానిలో చూడగల వ్యక్తి కూడా ఎవ్వరూ లేరు.✽ 4 ✽చుట్టి ఉన్న పత్రం విప్పి చదవడానికి, దానిలో చూడడానికైనా యోగ్యుడెవ్వడూ కనిపించకపోయినందుచేత నేను కన్నీరు మున్నీరుగా ఏడ్చాను.
5 అప్పుడా పెద్దలలో ఒకరు✽ నాతో ఇలా అన్నారు: “ఏడ్వకు. ఇదిగో, దాని ఏడు ముద్రలు తీసి చుట్టి ఉన్న పత్రం విప్పడానికి యూదా గోత్ర సింహమూ✽ దావీదు వేరూ✽ అయిన వ్యక్తి జయించాడు✽.”
6 నేను చూస్తూ ఉంటే, సింహాసనం మధ్య ఆ నాలుగు ప్రాణుల మధ్య ఆ పెద్దలమధ్య గొర్రెపిల్ల✽ నిలుచుండడం కనిపించింది. ఆ గొర్రెపిల్ల వధ✽ అయినట్టు ఉంది. దానికి ఏడు కొమ్ములూ ఏడు కళ్ళు✽ ఉన్నాయి. ఆ కళ్ళు భూమి మీది అన్ని దిక్కులకూ పంపబడే దేవుని ఏడాత్మలు✽. 7 ✽ఆయన వచ్చి సింహాసనంమీద కూర్చుని ఉన్న వ్యక్తి కుడి చేతిలో నుంచి చుట్టి ఉన్న పత్రం తీసుకొన్నాడు.
8 ఆయన చుట్టి ఉన్న పత్రం తీసుకోగానే ఆ నాలుగు ప్రాణులూ ఆ ఇరవై నలుగురు పెద్దలూ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు✽. వారిలో ఒక్కొక్కరికి తంతి వాద్యం✽, ధూపంతో నిండిన బంగారు పాత్రలు ఉన్నాయి. ఆ ధూపం✽ పవిత్రుల ప్రార్థనలు✽. 9 వారు ఈ కొత్త పాట✽ పాడారు:
“చుట్టి ఉన్న ఆ పత్రం తీసుకొని దాని ముద్రలు విప్పడానికి నీవే యోగ్యుడవు! ఎందుకంటే నీవు వధ అయి, ప్రతి గోత్రంలో నుంచీ ప్రతి భాష మాట్లాడేవారిలోనుంచీ ప్రతి జాతిలోనుంచీ ప్రతి జనంలో✽నుంచీ మమ్మల్ని✽ దేవునికోసం నీ రక్తంతో కొనుక్కొన్నావు✽, 10 మమ్మల్ని మన దేవునికి రాజులుగా, యాజులుగా✽ చేశావు. మనం భూమిమీద పరిపాలిస్తాం✽.”
11 అప్పుడు నేను చూస్తూ ఉంటే సింహాసనాన్నీ ప్రాణులనూ పెద్దలనూ చుట్టుకొని ఉన్న అనేక దేవదూతల స్వరం విన్నాను. వారి సంఖ్య వేలాదివేలూ కోటానుకోట్లూ. 12 ✽వారు స్వరమెత్తి ఇలా అన్నారు:
“వధ అయిన గొర్రెపిల్ల ప్రభావమూ✽ ఐశ్వర్యమూ జ్ఞానమూ బలమూ గౌరవమూ మహిమా స్తుతులూ పొందడానికి యోగ్యుడే!”
13 ✽అప్పుడు, పరలోకంలో, భూమిమీద, భూమి క్రింద, సముద్రంలో సృష్టమైనది ప్రతిదీ – వాటిలో ఉన్నవన్నీ ఇలా చెప్పడం విన్నాను:
“సింహాసనంమీద కూర్చుని ఉన్న వ్యక్తికీ గొర్రెపిల్లకూ కీర్తీ గౌరవమూ మహిమా ప్రభావమూ శాశ్వతంగా ఉంటాయి గాక!”
14 అప్పుడు ఆ నాలుగు ప్రాణులు అన్నారు “తథాస్తు!” ఆ ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి శాశ్వతంగా జీవిస్తూ ఉన్న ఆయనను ఆరాధించారు.