4
1 ఈ సంగతుల తరువాత నేను చూస్తూ ఉంటే పరలోకంలో తెరచి ఉన్న ఒక తలుపు✽ కనిపించింది. నేను మొదట విన్న స్వరం బూర ధ్వని లాగే✽ నాతో మాట్లాడడం విన్నాను. ఆ స్వరం “ఇక్కడికి ఎక్కి రా✽, తరువాత ఉండవలసినవి✽ నీకు చూపుతాను” అంది. 2 వెంటనే నేను దేవుని ఆత్మవశుడనయ్యాను✽. అప్పుడు పరలోకంలో నిలిచి ఉన్న సింహాసనాన్ని✽, సింహాసనం మీద కూర్చుని ఉన్న ఒక వ్యక్తిని చూశాను. 3 అక్కడ కూర్చుని ఉన్న ఆ వ్యక్తి చూడడానికి✽ సూర్య కాంతం✽ లాగా, కెంపు✽లాగా ఉన్నాడు. సింహాసనాన్ని రంగుల విల్లు✽ ఒకటి చుట్టుకొని ఉంది. అది పచ్చరాయిలాగా కనిపించింది. 4 సింహాసనం చుట్టూరా ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనాలమీద తెల్లని దుస్తులు తొడుక్కొన్న ఇరవై నలుగురు పెద్దలు✽ కూర్చుని ఉండడం చూశాను. వారి తలలమీద బంగారు కిరీటాలు ఉన్నాయి.5 సింహాసనంనుంచి మెరుపులూ ఉరుములూ శబ్దాలూ బయలుదేరుతూ ఉన్నాయి. సింహాసనం ఎదుట ఏడు కాగడాలు మండుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. 6 సింహాసనానికి ఎదురుగా స్ఫటికాన్ని పోలిన గాజు సముద్రం✽ ఉంది. సింహాసనం మధ్య, దాని చుట్టూ నాలుగు ప్రాణులు✽ ఉన్నాయి. ఆ ప్రాణులకు ముందూ వెనుకా అంతటా కండ్లు ఉన్నాయి✽. 7 మొదటి ప్రాణి సింహంలాంటిది. రెండో ప్రాణి కోడెదూడలాంటిది. మూడో ప్రాణి మనిషి ముఖంలాంటి ముఖం గలది. నాలుగో ప్రాణి ఎగురుతూ ఉన్న గరుడపక్షిలాంటిది✽. 8 ఈ నాలుగు ప్రాణులలో ప్రతిదానికీ ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ, రెక్కలక్రింద కూడా, కళ్ళతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు మానక ఇలా అంటూ ఉన్నాయి: “పూర్వముండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ✽, అమిత శక్తిగల ప్రభువూ అయిన దేవుడు పవిత్రుడు✽, పవిత్రుడు, పవిత్రుడు!”
9 శాశ్వతంగా జీవిస్తూ✽ సింహాసనంమీద కూర్చుని ఉన్న వ్యక్తికి ఆ ప్రాణులు మహిమ, ఘనత, కృతజ్ఞతలు అర్పిస్తూ✽ ఉన్నప్పుడు, 10 ఆ ఇరవై నలుగురు పెద్దలు సింహాసనం మీద కూర్చుని ఉన్న వ్యక్తి ఎదుట సాగిలపడి శాశ్వతంగా జీవిస్తూ ఉన్న ఈయనను ఆరాధిస్తారు. తమ కిరీటాలు సింహాసనం ఎదుట పడవేసి✽ ఇలా అంటారు:
11 ✽“ప్రభూ! నీవు సమస్తాన్ని సృజించావు. నీ ఇష్టాన్ని బట్టే అవి ఉన్నాయి, సృజించబడ్డాయి గనుక మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి నీవే యోగ్యుడవు.”