4
1 మెట్టుకు, సోదరులారా, మేము ప్రభువైన యేసు అధికారంతో మీకిచ్చిన ఆదేశాలేవో మీకు తెలుసు. మీరెలా ప్రవర్తిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టాలో మాచేత ఉపదేశం పొందారు. 2 ఇందులో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలని మిమ్ములను ప్రభువైన యేసులో పురికొల్పుతూ ప్రోత్సహిస్తూ ఉన్నాం.
3 దేవుని చిత్తం మీరు పవిత్రంగా ఉండడం, మీరు వ్యభిచారం విసర్జించడం, 4 దేవుణ్ణి ఎరుగని ఇతర ప్రజలాగా కామవికారంతో లేకుండా 5 మీలో ప్రతి ఒక్కరూ తన పాత్రను పవిత్రంగా, ఘనంగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం. 6 ఈ విషయంలో ఎవ్వడూ ఆసరాగా తీసుకొని తన సోదరుణ్ణి వంచించకూడదు. ఇలాంటి విషయాలన్నిటిలో ప్రభువు ప్రతీకారం చేసేవాడు. మునుపు దీన్ని గురించి మేము చెప్పి సాక్షులుగా మిమ్ములను హెచ్చరించాం గదా. 7 దేవుడు మనలను పిలిచింది కల్మషం కోసం కాదు గాని పవిత్రత కోసమే. 8 కనుక ఈ ఉపదేశం నిరాకరించేవారు మనుషులను నిరాకరించడం లేదు గాని మనకు తన ఆత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నారు.
9 సోదర ప్రేమ గురించి మీకు నేను రాయనక్కరలేదు. ఒకరినొకరు ప్రేమతో చూడాలని దేవుడే మీకు నేర్పాడు. 10 నిజంగా మాసిదోనియ అంతటిలో ఉన్న సోదరులందరినీ మీరు ప్రేమతో చూస్తూ ఉన్నారు. అయినా, సోదరులారా, ఇందులో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలని మిమ్ములను ప్రోత్సహిస్తున్నాం. 11 అంతే కాక, మేము మీకు ఆజ్ఞ ఇచ్చినట్టు బయటివారిపట్ల తగిన విధంగా ప్రవర్తించేలా, మీకు కొదువ ఏమీ లేకుండేలా, 12 మీరు ఇతరుల జోలికి పోకుండా సొంత చేతులతో పని చేస్తూ శాంతంగా బతకడం అనే గురి పెట్టుకోవాలని కూడా మిమ్ములను ప్రోత్సహిస్తున్నాం.
13 సోదరులారా, కన్ను మూసినవారిని గురించి మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. వారి విషయంలో ఆశాభావం లేని ఇతరులలాగా మీరు శోకించకూడదు. 14 యేసు చనిపోయి మళ్ళీ సజీవంగా లేచాడని నమ్ముతున్నాం గదా. ఆ ప్రకారమే యేసులో కన్నుమూసినవారిని ఆయనతోకూడా దేవుడు తీసుకువస్తాడు. 15 ప్రభువు మాటగా మేము మీకు చెప్పేదేమంటే, ప్రభువు రాకడ వరకూ బ్రతికి ఉండీ మిగిలి ఉండే మనం కన్ను మూసినవారికంటే ముందరివారంగా ఉండం. 16 ఎలాగంటే, ఆజ్ఞాపూర్వకమైన కేకతో, ప్రధాన దూత స్వరంతో, దేవుని బూర శబ్దంతో ప్రభువు తానే పరలోకం నుంచి దిగివస్తాడు. అప్పుడు క్రీస్తులో ఉండి చనిపోయినవారు మొదట లేస్తారు. 17 ఆ తరువాత ఆకాశ మండలంలో ప్రభువును ఎదుర్కొనడానికి ఇంకా బ్రతికి ఉండీ మిగిలి ఉండే మనలను వారితోపాటు మేఘాలలో పైకెత్తడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎప్పటికీ ప్రభువుతో ఉంటాం. 18 కాబట్టి ఈ మాటలచేత ఒకరినొకరు ఓదార్చుకోండి.