3
1 కనుక మేమిక తట్టుకోలేక ఏథెన్సులో ఏకాంతంగా ఉండాలని నిశ్చయించుకొని 2 మన సోదరుడూ దేవుని సేవకుడూ క్రీస్తు శుభవార్త విషయంలో మా జతపనివాడూ అయిన తిమోతిని మీ దగ్గరకు పంపాం. 3 మీలో ఎవరూ ఈ బాధలవల్ల కలవరపడకుండా మిమ్ములను మీ విశ్వాసం విషయంలో బలపరచడానికీ ప్రోత్సహించడానికీ అతణ్ణి పంపాం. కడగండ్లు అనుభవించడం మన విధి అని మీకు తెలుసు. 4 మేము మీతో ఉన్నప్పుడు మనకు బాధలు తప్పవని ముందుగానే చెప్పాం గదా. అలాగే జరిగింది కూడా. ఇది మీకు తెలుసు. 5 ఈ కారణంచేత నేనిక తట్టుకోలేక, మీ విశ్వాసం గురించి తెలుసుకొందామని అతణ్ణి పంపాను. ఒకవేళ దుష్ట ప్రేరేపణలు చేసేవాడు మిమ్ములను ప్రేరేపించాడేమో అనీ మా ప్రయాస వ్యర్థమై పోయిందేమో అనీ మా ఆందోళన.
6 కానీ తిమోతి ఇప్పుడు మీ దగ్గరనుంచి వచ్చి మీ విశ్వాసం, ప్రేమ గురించీ మంచి కబురు తెచ్చాడు. మిమ్ములను చూడడానికి మాకెలా తీవ్ర ఆశ ఉందో అలాగే మమ్ములను చూడడానికి మీకూ తీవ్ర ఆశ ఉందనీ మీరు ఎప్పుడూ మా గురించి మంచిని జ్ఞాపకం చేసుకొంటున్నారనీ చెప్పాడు. 7 అందుచేత, సోదరులారా, మా బాధలు, కడగండ్లన్నిటిలో మీ విశ్వాసం కారణంగా మీ గురించి మాకు ఓదార్పు కలిగింది. 8 ఎందుకంటే, ప్రభువులో మీరు నిలకడగా ఉంటే ఇప్పుడు మేము నిజంగా బ్రతుకుతూ ఉన్నాం. 9 మన దేవుని ముందు మిమ్ములను బట్టి మాకున్న ఆనందమంతటి కోసం సరిపోయినంత కృతజ్ఞతలు దేవునికి ఎలా చెప్పగలం? 10 మేము మీ ముఖాలను మళ్ళీ చూడాలని, మీ విశ్వాసంలో ఉన్న కొరత పూర్తిగా తీర్చడానికి అవకాశం కోసం రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుణ్ణి వేడుకొంటూ ఉన్నాం.
11 మన తండ్రి అయిన దేవుడు తానే, మన ప్రభువైన యేసు క్రీస్తు మమ్ములను మీ దగ్గరకు నడిపిస్తాడు గాక! 12 మీ పట్ల మా ప్రేమ ఎలా సమృద్ధిగా పెరుగుతున్నదో అలాగే మీ పరస్పర ప్రేమ, మనుషులందరి పట్ల కూడా సమృద్ధిగా పెరిగేలా ప్రభువు చేస్తాడు గాక! 13 మన ప్రభువైన యేసు క్రీస్తు తన పవిత్రులందరితో వచ్చేటప్పుడు మన తండ్రి అయిన దేవుని ముందు మీరు పవిత్రత విషయంలో అనింద్యులై ఉండేలా మీ హృదయాలను సుస్థిరం చేస్తాడు గాక!