2
1 సోదరులారా, మేము మీ దగ్గరకు రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు. 2 అంతకు ముందు మేము ఫిలిప్పీలో బాధలు అనుభవించి అవమానం పాలయ్యాం. ఇది కూడా మీకు తెలుసు. అయినా తీవ్రమైన పోరాటానికి గురై మీకు దేవుని శుభవార్త ప్రకటించడానికి మన దేవునిలో ధైర్యం తెచ్చుకొన్నాం.
3 ఎందుకంటే, మేము ఇచ్చే ప్రోత్సాహం భ్రమనుంచి గానీ కల్మషంనుంచి గానీ జిత్తులమారి మనసునుంచి గానీ కలిగింది కాదు. 4 దేవుడు మమ్ములను తగినవారుగా ఎంచి శుభవార్త మాకు అప్పగించాడు. ఇలాంటివారమై మనుషులను సంతోషపెట్టడానికి కాదు గాని మన హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టడానికే మాట్లాడుతాం. 5 మేము ఇచ్చకం మాటలు ఎన్నడూ పలకలేదని మీకు తెలుసు. అత్యాశను కప్పివేయడానికి వేషాలు వేసుకోలేదు కూడా. దేవుడే ఇందుకు సాక్షి. 6 అంతే కాదు. క్రీస్తు రాయబారులై ఉన్న మాకు అధికారం చేసే హక్కు ఉన్నా, మనుషులవల్ల – మీవల్ల గానీ ఇంకెవరివల్లా గానీ – ఘనతకోసం మేము చూడలేదు. 7 కానీ పాలిచ్చే తల్లి తన పసి పిల్లలను పోషించినట్టే మేము మీ మధ్య మృదువుగా వ్యవహరించాం. 8 మీరంటే ఇలాంటి వాత్సల్యం ఉంది గనుక మీకు దేవుని శుభవార్త మాత్రమే కాదు – మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరంటే మాకు అంత ప్రీతి కలిగింది.
9 సోదరులారా, మా ప్రయాస, కష్టం మీకు జ్ఞాపకమే గదా. మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని మేము రాత్రింబగళ్ళు పాటుపడి జీవనం చేస్తూ, మీకు దేవుని శుభవార్త ప్రకటించాం. 10 విశ్వాసులైన మీపట్ల మా ప్రవర్తన ఎంత పవిత్రంగా, నిజాయితీగా అనింద్యంగా ఉందో దానికి మీరు సాక్షులు, దేవుడూ సాక్షి. 11 తన రాజ్యంలోకీ మహిమలోకీ మిమ్ములను పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని 12 తండ్రి తన సొంత పిల్లలపట్ల వ్యవహరించినట్టు మీలో ప్రతి ఒకరినీ ప్రోత్సహిస్తూ, ఓదారుస్తూ, హెచ్చరిస్తూ వచ్చాం.
13 ఈ కారణంచేత కూడా మేము ఎడతెగకుండా దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాం: అంటే, మీరు మాచేత దేవుని వాక్కు విని అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్కుగా కాక దేవుని వాక్కుగానే అవలంబించారు. అది నిజంగా దేవుని వాక్కే. దాన్ని నమ్ముతున్న మీలో అది పని చేస్తూ ఉంది కూడా. 14 ఎలాగంటే, సోదరులారా, యూదయ ప్రాంతంలో, క్రీస్తు యేసులో ఉన్న దేవుని సంఘాలను పోలి నడుచుకోవడం మీరు మొదలు పెట్టారు. అంటే, ఆ సంఘాలు యూదయవారిచేత అనుభవించే బాధలు మీరు కూడా మీ స్వదేశస్థులచేత అనుభవించారు. 15 యూదులు ప్రభువైన యేసునూ తమ ప్రవక్తలనూ చంపారు. మమ్ములను హింసించారు. వారు దేవునికి అయిష్టులు, మనుషులందరికీ ప్రతికూలంగా ఉన్నారు. 16 ఎలాగంటే, ఇతర ప్రజలకు పాపవిముక్తి, రక్షణ కలిగేలా మేము వారితో మాట్లాడకూడదని వారు మమ్ములను అడ్డగిస్తూ ఉండేవారు. ఈ విధంగా వారు తమ పాపాలను ఎప్పుడూ పూర్తిగా పోగు చేసుకొంటూ ఉన్నారు. దేవుని కోపం వారిమీదికి అత్యధికంగా వచ్చింది.
17 సోదరులారా, కొద్ది కాలం పాటు మీ దగ్గరనుంచి శరీరరీతిగా – మనసులో కాదు – మమ్మల్ని తీసుకుపోవడం జరిగింది. అయినా మీ ముఖాలను చూడాలని ఎంతో ఆశ కలిగి తీవ్ర ప్రయత్నం చేశాం. 18 మీ దగ్గరకు రావాలని మేము ఆశించినా, పౌలనే నాకు ఈ ఆశ తరచుగా కలిగినా, సైతాను మమ్ములను ఆటంకపరచాడు. 19  మా ఆశాభావం, ఆనందం, అతిశయ కారణమైన కిరీటం ఏమిటి? మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ సమయంలో, ఆయన సన్నిధానంలో మీరే గదా! 20 నిజంగా మా మహిమ, మా ఆనందం మీరే.