1 తెస్సలొనీకవారికి లేఖ
1
1 తండ్రి అయిన దేవునిలో ప్రభువైన యేసు క్రీస్తులో✽ తెస్సలొనీకవారి సంఘానికి పౌలు✽, సిల్వానస్✽, తిమోతి✽ రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుంచీ ప్రభువైన యేసు క్రీస్తు నుంచీ కృప, శాంతి✽ మీకు కలుగుతాయి గాక.2 ✽మా ప్రార్థనలలో ఎప్పుడూ మిమ్ములను పేర్కొంటూ మీ అందరికోసమూ దేవునికి కృతజ్ఞతలు✽ చెపుతున్నాం. 3 ✽విశ్వాసంవల్ల అయిన మీ పని, ప్రేమ పూర్వకమైన మీ ప్రయాసను, మన ప్రభువైన యేసు క్రీస్తు మీది ఆశాభావం✽వల్ల అయిన మీ ఓర్పును మన తండ్రి అయిన దేవుని సమక్షంలో ఎడతెగకుండా జ్ఞాపకం చేసుకొంటున్నాం.
4 ప్రియ సోదరులారా, దేవుడు మిమ్ములను ఎన్నుకొన్న✽ సంగతి మాకు తెలుసు✽. 5 ✽ఎందుకంటే, మా శుభవార్త✽ మీ దగ్గరకు వచ్చినది మాటతో మాత్రమే కాదు, బలప్రభావాలతో✽, పవిత్రాత్మ✽తో, పూర్తి నిశ్చయతతో✽. అప్పుడు మీ మధ్య మీ మేలుకోసం ఉన్న మేము ఎలాంటివారమో✽ మీకే తెలుసు. 6 మీరు చాలా కష్టంలో✽ పవిత్రాత్మ ఇచ్చే ఆనందం✽తో దేవుని వాక్కు అంగీకరించారు, మమ్ములనూ✽ ప్రభువునూ పోలి ప్రవర్తించడానికి మొదలుపెట్టారు. 7 ఈ విధంగా మీరు మాసిదోనియ, అకయ✽లో ఉన్న విశ్వాసులందరికీ మాదిరి✽ అయ్యారు. 8 ఎలాగంటే, ప్రభు వాక్కు మీ దగ్గరనుంచి మాసిదోనియ, అకయలలో వినిపించింది. ఆ ప్రాంతాలలో మాత్రమే కాక, దేవునిపట్ల మీ నమ్మకం గురించిన మాట అంతటా✽ మారు మ్రోగింది✽, గనుక మేమేమీ చెప్పనక్కరలేదు. 9 మీ మధ్యకు మా ప్రవేశం ఎలాంటిదో, మీరు జీవం గల సత్య దేవుని✽కి సేవ చేయడానికీ పరలోకంనుంచి రాబోయే ఆయన కుమారుని కోసం ఎదురు చూడడానికీ✽ ఏవిధంగా విగ్రహాలు✽ విడిచిపెట్టి దేవునివైపు తిరిగారో వారే చెపుతున్నారు. 10 దేవుడు ఆయనను – దేవుని కోపం✽ నుంచి మనలను తప్పిస్తున్న యేసును – చనిపోయిన వారిలో నుంచి✽ లేపాడు.