5
1 సోదరులారా, ఆ కాలాలను సమయాలను గురించి నేను మీకు రాయనక్కరలేదు. 2 రాత్రి పూట దొంగ వచ్చినట్టే ప్రభు దినం వస్తుందని మీకు బాగా తెలుసు. 3 వారు “శాంతి, భద్రత మనకున్నాయి” అని చెప్పుకొంటూ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీకి కాన్పునొప్పులు వచ్చినట్టు హఠాత్తుగా నాశనం వారిమీదికి వచ్చి పడుతుంది. వారు ఏ మాత్రమూ తప్పించుకోరు.
4 అయితే, సోదరులారా, ఆ దినం దొంగలాగా మీమీదికి రావడానికి మీరు చీకటిలో లేరు. 5 మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రికీ చీకటికీ చెందినవారం కాము. 6 కనుక నిద్రపోయిన ఇతరులలాగా కాక, మత్తులం కాక, మెళకువగా ఉందాం. 7 నిద్రపోయేవారు నిద్రపోయేది రాత్రివేళ. త్రాగి మత్తిల్లేవారు మత్తిల్లేది రాత్రివేళ. 8 మనం పగటికి చెందినవారమై ఉండి మత్తులం కాకుండా ఉందాం, విశ్వాసం, ప్రేమ అనే చాతీ కవచం, విముక్తి కోసమైన ఆశాభావం అనే శిరస్త్రాణం ధరించుకొందాం. 9 ఎందుకంటే, దేవుడు మనలను నియమించినది మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందడానికే గాని కోపానికి కాదు. 10 మనం కన్ను తెరచి ఉన్నా కన్ను మూసినా తనతో బ్రతకాలని క్రీస్తు మనకోసం చనిపోయాడు. 11 అందుచేత మీరిప్పుడు చేస్తున్న విధంగానే ఒకరికొకరు ప్రోత్సాహం, అభివృద్ధి కలిగించుకోండి.
12 సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ, ప్రభువులో మీమీద నాయకత్వం వహించి మీకు బుద్ధి చెపుతూ ఉన్నవారిని గుర్తించి 13 వారి పనిని బట్టి వారిని ప్రేమభావంతో గొప్పగా గౌరవించండని మిమ్మల్ని కోరుతున్నాం. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి.
14 సోదరులారా! అక్రమంగా ప్రవర్తించేవారిని హెచ్చరించండి. క్రుంగిపోయినవారిని ప్రోత్సహించండి. దుర్బలులకు సహాయం చేయండి. అందరిపట్ల ఓర్పు చూపండి. 15 ఎవరూ ఎవరికైనా అపకారానికి అపకారం చేయకుండా చూచుకోండి. ఒకరికొకరు, మనుషులందరికీ మేలైనదాన్ని అనుసరించండి. 16 ఎప్పుడూ ఆనందిస్తూ ఉండండి. 17 ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తూ ఉండండి. 18 అన్ని పరిస్థితులలోనూ దేవునికి కృతజ్ఞతలు చెపుతూ ఉండండి. ఇది మీ గురించి క్రీస్తు యేసులో దేవుని చిత్తం. 19 దేవుని ఆత్మను ఆర్పకండి. 20 దేవుని మూలంగా పలికే వాటిని తృణీకరించకండి. 21 అన్నిటినీ పరీక్షించండి, మంచివాటిని చేపట్టి ఉండండి. 22 ప్రతి విధమైన దుష్టత్వాన్ని విసర్జించండి.
23 శాంతిప్రదాత దేవుడు తానే మిమ్ములను పూర్తిగా పవిత్రపరుస్తాడు గాక! మన ప్రభువైన యేసు క్రీస్తు వచ్చేటప్పుడు మీ ఆత్మ, ప్రాణం, శరీరం యావత్తూ నిందారహితంగా ఉండేలా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు గాక! 24 మిమ్ములను పిలిచినవాడు నమ్మకమైనవాడు, ఆయన అలా చేస్తాడు.
25 సోదరులారా, మాకోసం ప్రార్థన చేయండి.
26 సోదరులందరికీ పవిత్రమైన ముద్దు పెట్టి అభివందనాలు చెప్పండి. 27 ఈ ఉత్తరం పవిత్ర సోదరులందరికీ చదివి వినిపించాలని ప్రభువు పేర నేను మీకు ఆదేశమిస్తున్నాను.
28 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడైవుంటుంది గాక. తథాస్తు.