పేతురు రాసిన మొదటి పత్రిక
గ్రంథకర్త
మొదటి వచనంలోనే ఈ పత్రిక రచయిత “యేసు క్రీస్తు అపోస్తలుడు పేతురు” అని సూచిస్తున్నది. ఇతడు తనను అపోస్తలుడుగా చెప్పుకున్నాడు (1:1). క్రీస్తు పడిన హింసల గురించి ఇతడు పదేపదే ప్రస్తావించడాన్ని బట్టి (2:21-24; 3:18; 4:1; 5:1) హింసల పాలైన సేవకుడు అనే అభిప్రాయం అతని మనస్సులో గాఢమైన ముద్ర వేసిందని అర్థం అవుతున్నది. ఇతడు మార్కును “కుమారుడు” గా చెబుతున్నాడు (5:13). అపో. కా. గ్రంథంలో (2:2) లో చెప్పిన కుటుంబంతోనూ, ఈ యువకునితోనూ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ వాస్తవాలను బట్టి సహజంగానే అపోస్తలుడు పేతురు ఈ పత్రిక రాశాడని భావించవచ్చు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 62 - 64
5:13 లో రచయిత బబులోను సంఘం నుండి అభినందనలు పంపుతున్నాడు.
స్వీకర్త
ఆసియా మైనర్ ఉత్తర ప్రాంతాల్లో చెదరి ఉన్న క్రైస్తవ సమూహాలను పేతురు ప్రస్తావించాడు. బహుశ, యూదులు, యూదేతరులు కలిసి ఉన్న ప్రజానీకానికి పేతురు రాశాడు.
ప్రయోజనం
ఈ పత్రిక తాను ఎందుకు రాసాడో పేతురు వివరించాడు. అదేమిటంటే విశ్వాసంలో బాధలు ఎదుర్కొంటున్న వారిని ప్రోత్సహించడం. దేవుని కృప లభ్యమయ్యేది క్రైస్తవ్యంలో మాత్రమే అని వారికి హామీ ఇస్తున్నాడు. అందుచేత వారు విశ్వాసం విడనాడ కూడదు. 5:12 లో చెప్పినట్టు “ఇదియే సత్యమైన దేవుని కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి నిలకడగా ఉండుడి.” తన పత్రిక చదివే వారి మధ్య ఈ హింస విస్తారంగా ఉన్నట్టు ఉంది. పేతురు మొదటి పత్రిక ఉత్తర ఆసియా మైనర్ అంతటా క్రైస్తవులకు ఉన్న హింసను స్మరిస్తున్నది.
ముఖ్యాంశం
హింసకు ప్రతి స్పందన.
విభాగాలు
1. అభివాదం — 1:1, 2
2. దేవుని కృపను బట్టి ఆయనకు స్తుతి — 1:3-12
3. పవిత్ర జీవనానికి ప్రోత్సాహం — 1:13-5:12
4. అంతిమ శుభాకాంక్షలు — 5:13, 14