తీతుకు రాసిన పత్రిక
గ్రంథకర్త
తీతుకు రాసిన లేఖ రచయితగా పౌలు తనను చెప్పుకున్నాడు. “దేవుని దాసుడు, యేసు క్రీస్తు అపోస్తలుడు” గా తనను అభివర్ణించుకున్నాడు (తీతు 1:1). పౌలుకు, తీతుకు మధ్య పరిచయం గురించి అస్పష్టత ఉంది. అతడు పౌలు పరిచర్యలో క్రైస్తవుడు అయ్యాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే “మన అందరి విశ్వాస విషయములో నా నిజ కుమారుడగు తీతుకు” అని పౌలు రాశాడు (1:4). పౌలు తీతును స్నేహితునిగాను, సువార్తలో జత పనివానిగాను ఎంతో గౌరవించాడు. అతని అపేక్ష, శ్రద్ధ, ఇతరులకు అతడు చేకూర్చిన ఆదరణల నిమిత్తం మెచ్చుకున్నాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 63 - 65
పౌలు ఈ ఉత్తరం నికొపొలి నుండి తీతుకు రాశాడు. అపోస్తలుని మొదటి రోమ్ చెర అనంతరం విడుదల అయిన తరువాత రాశాడు. ఎఫెసులో పరిచర్యకై తిమోతిని పంపి పౌలు తీతుతోకలిసి క్రేతు లంకకు వెళ్ళాడు.
స్వీకర్త
క్రేతులో ఉన్న మరొక ఆత్మీయ కుమారుడు, సాటి పనివాడు అయిన తీతు.
ప్రయోజనం
క్రేతులో అప్పుడే ఏర్పడిన సంఘాల్లోని లోపాలను సరిదిద్దడం. అందులోని క్రైస్తవులు క్రమశిక్షణ లేకుండా ఒక పధ్ధతి అనేది లేకుండా ఉన్నారు. వారికి సహాయం అవసరం. (1) సంఘాల్లో కొట్టగా పెద్దలను ఏర్పాటు చెయ్యాలి. (2) క్రేతులో ఉన్న క్రైస్తవేతరుల ఎదుట మంచి విశ్వాస సాక్ష్యం ఇవ్వడానికి వారిని సిద్ధ పరచాలి.
ముఖ్యాంశం
ప్రవర్తన నియమావళి
విభాగాలు
1. అభివాదం — 1:1-4
2. పెద్దల నియామకం — 1:5-16
3. వివిధ వయో బృందాల గురించిన సూచనలు — 2:1-3:11
4. అంతిమ పలుకులు — 3:12-15