కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక
గ్రంథకర్త
ఈ పత్రిక రచయితగా పౌలును గుర్తిస్తున్నారు. (1 కొరింతి 1:1; 16:21). పౌలు ఎఫేసులో ఉన్నప్పుడో, అంతకు ముందు కాలం లోనో ఈ పత్రిక కన్నా ముందటి పత్రిక మరొకటి అతడి కొరింతి సంఘానికి రాశాడు (5:10-11). కొరింతి సంఘం దాన్ని అపార్థం చేసుకున్నది. దురదృష్టవశాత్తూ ఆ పత్రిక ఇప్పుడు లభ్యం కావడం లేదు. ఈ ముందటి పత్రికలోని అంశాలు ఏమీ తెలియవు. డానికి స్పందనగా కొరింతి సంఘం వారు రాసి పంపిన పత్రికకు జవాబుగా పౌలు 1 కొరింతి పత్రిక రాశాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 55 - 57
ఈ పత్రికను పౌలు ఎఫెసు నుండి రాశాడు.
స్వీకర్త
1 కొరింతి పత్రికను అందుకున్న వారు కొరింతులో ఉన్న దేవుని సంఘం (1 కొరింతి 1:2). అయితే పౌలు తాను ఈ పత్రిక “ప్రతి చోటా మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించే వారందరి” కోసం అని కూడా పేర్కొన్నాడు.
ప్రయోజనం
కొరింతి సంఘంలో నెలకొన్న స్థితిగతుల గురించి అనేకమంది ద్వారా పౌలుకు తెలిసింది. సంఘంలోని బలహీనతల విషయంలో దిద్దుబాటు, ఉపదేశం ఇచ్చి దానికి పూర్వ క్షేమ స్థితి కలిగించడం పౌలు ఈ పత్రిక రాయడంలో ముఖ్య ఉద్దేశం. చీలికలు (1:10-4:21), పునరుత్థానం గురించిన భిన్న బోధలు (అధ్యా. 15), దుర్నీతి (5, 6:12-20), ప్రభువు బల్ల విషయంలో దురాచారాలు (11:17-34) మొదలైన వాటిని సరిదిద్దడం ఈ పత్రిక ఉద్దేశం. కొరింతి సంఘంలో అనేక వర ప్రసాదాలు ఉన్నాయి (1:4-7). కానీ సంఘం పరిణతి చెందలేదు. ఆధ్యాత్మికంగా లేదు (3:1-4). సంఘం తనలోని అన్ని రకాల పాపాలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే డానికి ప్రాముఖ్యమైన సూచనలు పౌలు ఇస్తున్నాడు. అందులోని సంబంధ బాంధవ్యాల సమస్యలను, దురాచారాలను చూసీ చూడనట్టు పోనియ్యక నేరుగా సూటిగా పౌలు వాటిని ఎత్తి చూపుతున్నాడు.
ముఖ్యాంశం
విశ్వాసి ప్రవర్తన
విభాగాలు
1. పరిచయం (1:1-9) — 1:1-9
2. కొరింతి సంఘంలో విభేదాలు — 1:10-4:21
3. నైతిక అల్లకల్లోలం — 5:1-6:20
4. వివాహ సూత్రాలు — 7:1-40
5. అపొస్తలుల స్వేచ్ఛ — 8:1-11:1
6. ఆరాధన సూచనలు — 11:2-34
7. ఆధ్యాత్మిక బహుమతులు — 12:1-14:40
8. పునరుత్థాన సిద్ధాంతం — 15:1-16:24