రోమీయులకు రాసిన పత్రిక
గ్రంథకర్త
రోమా 1:1 ప్రకారం ఈ పత్రిక రాసిన వాడు పౌలు. రోమ్ చక్రవర్తిగా పదహారేళ్ళ నీరో సింహాసనం ఎక్కినా 3 సంవత్సరాలకు పౌలు కొరింతు అనే గ్రీకు పట్టణంలో ఉండి ఈ పత్రిక రాశాడు. ఈ ప్రముఖ పట్టణం లైంగిక అవినీతికీ విగ్రహ పూజకూ పెట్టింది పేరు. కాబట్టి రోమా పత్రికలో పౌలు మానవాళి పాపం గురించి, జీవితాలను అద్భుత రీతిలో పూర్తిగా మార్చగలిగిన దేవుని కృపలోని శక్తిని గురించీ రాస్తున్నప్పుడు తానేమి రాస్తున్నాడో తనకు బాగా తెలుసు ఈ పుస్తకంలోని ముఖ్యాంశం క్రైస్తవ సువార్త సారాంశం. అందులోని కీలకమైన అంశాలన్నీ ఉన్నాయి. దేవుని పవిత్రత, మానవాళి పాపం, యేసు క్రీస్తు ఇవ్వజూపుతున్న రక్షణార్ధం అయిన కృప.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 56 - 57 లో కొరింతు పట్టణం లో గ్రంథ రచన జరిగింది. రచనకు కీలక ప్రదేశం రోమ్.
స్వీకర్త
రోమ్ లో దేవుని ప్రేమను చూరగొని అయన పవిత్ర ప్రజగా ఉండడానికి పిలుపు అందిన వారు. అంటే రోమ్ సామ్రాజ్యానికి ముఖ్య నగరం రోమ్ లో ఉన్న క్రైస్తవ సంఘం.
ప్రయోజనం
క్రైస్తవ సిద్ధాంతాన్ని బహు స్పష్టంగా, ప్రణాళికాబద్ధంగా అందించిన పత్రిక ఇదే. సకల మానవాళి పాపం గురించి చర్చించడం తో పౌలు ఈ పత్రిక ఆరంభించాడు. దేవునికి వ్యతిరేకంగా మన తిరుగుబాటు మూలంగా మనుషులంతా నేరస్థులయ్యారు. అయితే దేవుడు తన కృప చొప్పున తన కుమారుడు క్రీస్తు ద్వారా విశ్వాస మూలమైన నిర్దోషత్వాన్ని మనుషులకు ఇస్తున్నాడు. దేవుడు మనల్ని నిర్దోషులుగా తీర్చినప్పుడు మనకు రక్షణ లేక విమోచన లభిస్తుంది. ఎందుకంటే క్రీస్తు రక్తం మన పాపాలను కప్పి వేస్తుంది. పాపాల నిమిత్తం ఒక మనిషి శిక్షనుండి, పాపం యొక్క ప్రభావం నుండి ఎలా తప్పించుకుంటాడో పౌలు ఇక్కడ వివరించిన అంశాలు సహేతుకమైన, సంపూర్ణమైన అవగాహన ఇస్తున్నాయి.
ముఖ్యాంశం
దేవుని నీతిన్యాయాలు
విభాగాలు
1. పాపానికి దక్కవలసిన శిక్ష, నీతి న్యాయాల ఆవశ్యకత — 1:18-3:20
2. ఆపాదించబడిన నీతిన్యాయాలు, నిర్దోషత్వం — 3:21-5:21
3. అందించిన నీతి న్యాయాలు, పవిత్రీకరణ — 6:1-8:39
4. ఇశ్రాయేల్ కోసం దేవుని సదుపాయం — 9:1-11:36
5. న్యాయ బద్ధమైన మార్గం అమలు — 12:1-15:13
6. ముగింపు: వ్యక్తిగత సందేశాలు — 15:14-16:27