కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక
గ్రంథకర్త
పౌలు తన జీవితంలో బలహీనుడుగా అనిపిస్తున్న సమయంలో ఈ పత్రిక రాశాడు. కొరింతి సంఘం ఇబ్బందుల్లో ఉందని అతనికి తెలిసింది. స్థానిక విస్వాసుల ఐక్యతను కాపాడడానికి అతడు పూనుకున్నాడు. పౌలు ఈ లేఖ రాసినప్పుడు కొరింతు విశ్వాసుల పట్ల అతనికి ఉన్న ప్రేమను బట్టి అతడితో మనస్తాపంతో ఉన్నాడు. ఈ ఇబ్బందులు మానవపరమైన బలహీనతలేగానీ దేవుని వైపు నుండి సహాయం కూడా అతనికి అందింది. “నా కృప నీకు చాలు. బలహీనతల్లోనే నా బలప్రభావాలు పరిపూర్ణం అవుతాయి” (12:7-10). ఈ లేఖలో పౌలు తన పరిచర్యను, తన అపోస్తలిక అధికారాన్ని, తీవ్రంగా సమర్థించుకోవాల్సి వచ్చింది. దేవుని సంకల్పం మూలంగానే తాను క్రీస్తు అపోస్తలుడినని నొక్కి చెప్పడంతో పౌలు ఈ లేఖ మొదలు పెట్టాడు (1:1). అపోస్తలుని గురించీ క్రైస్తవ విశ్వాసం గురించీ ఈ లేఖ అనేక విషయాలను తెలియజేస్తున్నది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 56 - 57
ఈ పత్రికను పౌలు మాసిడోనియా నుండి రాశాడు.
స్వీకర్త
కొరింతు లోని దేవుని సంఘానికి, ఆకయ (ఇది రోమ్ సామ్రాజ్యంలో ఒక పరగణా. కొరింతు దీని ముఖ్య పట్టణం) లోని వారికి పౌలు రాశాడు.
ప్రయోజనం
ఈ పత్రిక రాయడంలో పౌలు మనసులో అనేక ఉద్దేశాలు ఉన్నాయి. తాను రాసిన నిష్టురమైన పత్రిక కొరింతు క్రైస్తవులు సానుకూలంగా స్పందించిన దానికి (1:3-4; 7:8-9, 12, 13) అతడు సంతోషించాడు. ఆసియాలో తనకు వాటిల్లిన కష్టాలు వారికి తెలిపాడు (1:8-11). బాధ కలిగించినందుకు క్షమించమని కోరాడు (2:5 – 11). క్రైస్తవ పరిచర్య అనే ఉన్నతమైన పిలుపులోని నిజమైన అర్థం వారికి వివరించాడు. (2:14-7:4). ఇవ్వడం అనే సుగుణాన్ని వారికి నేర్పిస్తూ యెరుషలేములోని పేద క్రైస్తవులకు వారు ఇవ్వదలుచుకున్న కానుక పూర్తి చేయమని ప్రోత్సహించాడు (అధ్యా. 8, 9).
ముఖ్యాంశం
పౌలు తన అపోస్తలత్వాన్ని సమర్థించుకోవడం.
విభాగాలు
1. పౌలు పరిచర్య వివరణ — 1:1-7:16
2. యెరుషలేము పేదల కోసం చందా — 8:1-9:15
3. పౌలు తన అధికారాన్ని సమర్థించుకోవడం — 10:1-13:10
4. త్రిత్వ సంబంధమైన దీవెన వాక్కులతో ముగింపు — 13:11-14