జెకర్యా
గ్రంథకర్త
ఈ పుస్తక రచయిత జెకర్యా ప్రవక్త అని 1:1 గుర్తిస్తున్నది. ఇతడు ఇద్దో కుమారుడైన బెరెక్యాకు పుట్టినవాడు. ఇద్దో చెరనుండి తిరిగి వచ్చిన యాజక కుటుంబాలకు చెందిన వాడు (నెహేమ్యా 12:4, 16). జెకర్యా కుటుంబం యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు అతడు బాల్యప్రాయంలో ఉండి ఉండవచ్చు. తన వంశాన్ని బట్టి జెకర్యా ప్రవక్తయే గాక, యాజకుడు కూడా. కాబట్టి యూదుల ఆరాధన క్రమాలతో ఇతనికి సన్నిహిత పరిచయం ఉండవచ్చు. నిర్మించిన ఆలయంలో ఇతడు యాజకుడుగా పని చేశాడో లేదో తేలియదు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 520 - 480
బబులోను చెర తరువాత గ్రంథ రచన జరిగింది. ఆలయ నిర్మాణం పూర్తి కాకమునుపు 1-8 ఆధ్యాయాలు రాశాడు. పూర్తి అయిన తరువాత 9-14 అధ్యాయాలు రాశాడు.
స్వీకర్త
చెరనుండి తిరిగి వచ్చి యెరూషలేములో నివసిస్తున్న ప్రజలు.
ప్రయోజనం
శేష ప్రజకు జెకర్యా రాస్తూ భావికాలంలో రాబోతున్న యేసు క్రీస్తు అనే మెస్సీయ రాక కోసం ఎదురు చూసే ఆశాభావం, అవగాహన కల్పించాడు. దేవుడు తన ప్రజలకు హెచ్చరిక, ఉపదేశం, దిద్దుబాటు కలిగించడానికి తన ప్రవక్తలను వాడుకుంటాడు. దురదృష్ట వశాత్తూ వారు వినడానికి నిరాకరించారు. వారి పాపం దేవుని శిక్షను తెచ్చిపెట్టింది. ప్రవచనాలు సైతం అబద్దాలై ఉండ వచ్చని ఈ గ్రంధం రుజువులు చూపుతున్నది.
ముఖ్యాంశం
దేవుని విడుదల
విభాగాలు
1. పశ్చాత్తాపానికై పిలుపు — 1:1-6
2. జెకర్యా దర్శనాలు — 1:7-6:15
3. ఉపవాసాల గురించిన ప్రశ్నలు — 7:1-8:23
4. భావికాలం గురించి భారం — 9:1-14:21