22
1 అప్పుడతడు స్ఫటికమంత స్వచ్ఛంగా శుద్ధంగా ఉన్న జీవజల నది నాకు చూపించాడు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయి ఉన్న సింహాసనంలోనుంచి ఆ నది బయలుదేరి 2 ఆ నగర వీధి మధ్యగా పారుతూ ఉంది. ఆ నదికి అటూ ఇటూ జీవ వృక్షం ఉంది. అది నెలనెలకు ఫలిస్తూ పన్నెండు కాపులు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థతకోసం.
3 అప్పటినుంచి శాపం అంటూ ఏమీ ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయి ఉన్న సింహాసనం ఆ నగరంలో ఉంటుంది. ఆయన దాసులు ఆయనకు సేవ చేస్తారు. 4 వారాయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళమీద ఉంటుంది. 5 అక్కడ రాత్రి ఏమీ ఉండదు. దీప కాంతి గానీ సూర్యకాంతి గానీ వారికక్కర ఉండదు. ఎందుకంటే ప్రభువైన దేవుడే వారికి కాంతి ఇస్తాడు. వారు శాశ్వతంగా రాజ్యపరిపాలన చేస్తారు.
6 అప్పుడతడు నాతో “ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. పవిత్ర ప్రవక్తలకు ప్రభువైన దేవుడు త్వరగా జరగవలసినవాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపాడు” అన్నాడు.
7 “ఇదిగో, నేను త్వరగా రాబోతున్నాను. దేవుని మూలంగా వచ్చిన ఈ గ్రంథంలోని మాటలను పాటించే వ్యక్తి ధన్యజీవి.”
8 నేను – యోహానును – ఈ విషయాలు చూశాను, విన్నాను, విని చూచినప్పుడు ఈ విషయాలు నాకు చూపించిన దేవదూత పాదాలదగ్గర ఆరాధన చేయడానికి సాగిలపడ్డాను. 9 అయితే అతడు “అలా చేయకూడదు! నేనూ నీలాగే దేవుని దాసుణ్ణి. నీ సోదర ప్రవక్తలతోపాటు, ఈ గ్రంథంలోని మాటలను పాటించేవారితోపాటు దాసుణ్ణి. దేవుణ్ణే ఆరాధించు” అని నాతో చెప్పాడు. 10 అతడు ఇంకా నాతో “దేవుని మూలంగా వచ్చిన వాక్కయిన ఈ గ్రంథంలోని మాటలను మూసి ముద్ర వేయకు, సమయం సన్నిహితం. 11 అన్యాయస్థుడు ఇంకా అన్యాయస్థుడుగా ఉండనియ్యి, నీచుడు ఇంకా నీచంగా ఉండనియ్యి. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనియ్యి. పవిత్రుడు ఇంకా పవిత్రుడుగా ఉండనియ్యి” అని చెప్పాడు.
12 “ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసినదాని ప్రకారమే ప్రసాదించడానికి నేనిచ్చే ప్రతిఫలం నా దగ్గర ఉంటుంది. 13 నేను ‘అల్ఫా’ను, ‘ఒమేగ’ను, ఆదిని, అంతాన్ని, మొదటివాణ్ణి, చివరివాణ్ణి. 14 జీవ వృక్షానికి హక్కుగలవారై ద్వారాల గుండా నగరంలో ప్రవేశించేలా ఆయన ఆదేశాల ప్రకారం ప్రవర్తించే వారు ధన్యజీవులు. 15 నగరం బయట కుక్కలూ, మాంత్రికులూ, లైంగిక అవినీతిపరులూ, హంతకులూ, విగ్రహపూజ చేసేవారూ, అబద్ధాలంటే ఇష్టమున్న వారంతా, వాటిని అభ్యసించే వారంతా ఉంటారు. 16 నేను – యేసును – సంఘాలలో ఈ విషయాలు మీకు సాక్ష్యం చెప్పడానికి నా దూతను పంపాను. నేను దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశమానమైన వేకువచుక్కనూ.”
17 దేవుని ఆత్మ, పెళ్ళి కుమార్తె రమ్మని అంటున్నారు. ఇది విన్న వ్యక్తి రమ్మనాలి. దప్పిక వేసిన వ్యక్తి రావాలి. ఇష్టమున్న వ్యక్తి ఎవరైనా సరే జీవ జలం ఉచితంగానే పుచ్చుకోవచ్చు.
18 దేవునిమూలంగా వచ్చిన వాక్కయిన ఈ గ్రంథంలోని మాటలు వినే ప్రతి వ్యక్తికీ నేనిలా సాక్ష్యం చెపుతున్నాను: ఎవరైనా సరే ఈ విషయాలతో ఏదైనా కలిపితే ఈ గ్రంథంలో రాసి ఉన్న ఈతిబాధలు దేవుడు ఆ వ్యక్తిమీదికి రప్పిస్తాడు. 19 దేవునిమూలంగా వచ్చిన వాక్కయిన ఈ గ్రంథంలోని మాటలలో నుంచి ఏదైనా ఎవరైనా తీసివేస్తే ఈ గ్రంథంలో రాసి ఉన్న జీవ గ్రంథంలో నుంచి, పవిత్ర నగరంలో నుంచి, ఈ గ్రంథంలో రాసి ఉన్న విషయాలలో నుంచి ఆ వ్యక్తి భాగం దేవుడు తీసివేస్తాడు.
20 ఈ విషయాల గురించి సాక్ష్యం చెప్పేవాడు “అవును, నేను త్వరగా రాబోతున్నాను” అంటున్నాడు. తథాస్తు! అవును, యేసుప్రభూ! వచ్చెయ్యి!
21 ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహం మీకందరికీ తోడై ఉంటుంది గాక! తథాస్తు!