ప్రకటన (ప్రత్యక్షం)
1
1 ఇది యేసు క్రీస్తును గురించిన ప్రత్యక్షం✽. త్వరగా✽ జరగవలసినవాటిని తన దాసులకు✽ చూపించడానికి✽ ఈ ప్రత్యక్షం దేవుడు ఆయనకిచ్చాడు. ఆయన తన దేవదూతను✽ పంపి ఇది తన దాసుడైన యోహానుకు సూచనలతో తెలియజేశాడు. 2 ✽యోహాను దేవుని వాక్కును గురించీ, యేసు క్రీస్తు సాక్ష్యాన్ని గురించీ తాను చూచినదానంతటిని గురించీ సాక్ష్యం చెప్పాడు. 3 దేవునిమూలంగా కలిగిన ఈ వాక్కులు✽ చదివే వ్యక్తి, ఇది విని ఇందులో రాసి ఉన్న విషయాలను పాటించేవారు ధన్యజీవులు✽. ఎందుకంటే సమయం సమీపంగా ఉంది.✽4 ఆసియా✽ రాష్ట్రంలో ఉన్న ఏడు సంఘాలకు✽ యోహాను✽ రాస్తున్న విషయాలు. ప్రస్తుతముంటూ, పూర్వముండి, భవిష్యత్తులో వచ్చేవానినుంచీ✽, ఆయన సింహాసనం ముందున్న ఏడు ఆత్మలనుంచీ✽, యేసు క్రీస్తునుంచీ✽ మీకు అనుగ్రహం, శాంతి✽ కలుగుతాయి గాక! 5 యేసు క్రీస్తు నమ్మకమైన సాక్షి✽, చనిపోయిన వారిలోనుంచి ప్రముఖుడుగా లేచినవాడు✽, భూరాజులను పరిపాలించేవాడు✽. ఆయన మనలను ప్రేమిస్తూ✽, తన రక్తం✽వల్ల మనలను మన పాపాలనుంచి కడిగి విడిపించాడు,✽ 6 మనలను తన తండ్రి అయిన దేవునికి రాజులుగా✽, యాజులుగా✽ చేశాడు. ఆయనకు మహిమ, అధికారం✽ యుగయుగాలకు ఉంటాయి గాక! తథాస్తు✽.
7 ✽ఇడుగో, ఆయన మేఘాలతో✽ వస్తున్నాడు✽, ప్రతి కన్నూ ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచినవారు✽ కూడా ఆయనను చూస్తారు. భూజనాలన్నీ ఆయనను బట్టి గుండెలు బాదుకొంటారు✽. అవును, తథాస్తు.
8 ప్రభువు ఇలా అంటున్నాడు: “అల్ఫా, ఓమేగలనూ✽ ఆది అంతాలనూ నేనే. ప్రస్తుతముంటూ, పూర్వముండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి, అమిత శక్తిగలవాణ్ణి.”
9 ✽మీ సోదరుడూ, యేసు క్రీస్తు బాధలలో✽, రాజ్యంలో, ఓర్పులో✽ మీతోకూడా భాగస్తుడూ అయిన యోహానను నేను దేవుని వాక్కునుబట్టీ యేసు సాక్ష్యాన్నిబట్టీ పత్మాసు✽ అనే లంకలో ఉన్నాను. 10 ప్రభు దినాన✽ దేవుని ఆత్మవశుణ్ణయ్యాను✽, బూర ధ్వనిలాంటి పెద్ద స్వరం నా వెనుక పలకడం విన్నాను. 11 ✽ఏమంటే “అల్ఫా ఓమేగలను నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి. నీవు చూచేది పుస్తకంలో రాసి ఆసియాలో ఉన్న ఈ ఏడు సంఘాలకు పంపించు: ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ.”
12 నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో చూడడానికి అటువైపు మళ్ళుకొన్నాను. మళ్ళుకొన్నప్పుడు ఏడు✽ బంగారు దీప స్తంభాలు✽ చూశాను. 13 దీపస్తంభాల మధ్య మానవ పుత్రుడి✽లాంటి వ్యక్తి కనిపించాడు. ఆయన తొడుక్కొన్న నిలువుటంగీ పాదాలవరకు ఉంది. ఆయన ఛాతీ మీద బంగారు దట్టి✽ కట్టి ఉంది. 14 ఆయన తల, తలవెంట్రుకలు తెల్లని ఉన్ని✽లాగా, మంచంత తెల్లగా ఉన్నాయి. ఆయన కండ్లు మంటల్లాంటివి✽. 15 ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ మెరుస్తున్న కంచు✽లాగా ఉన్నాయి. ఆయన స్వరం అనేక జల ప్రవాహాల ధ్వని✽లాంటిది. 16 ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలు✽ ఆయనకున్నాయి. ఆయన నోట్లోనుంచి పదునైన రెండంచుల ఖడ్గం✽ వస్తున్నది. ఆయన ముఖం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యమండలం✽ లాంటిది.
17 ఆయనను చూడగానే చచ్చినవానిలాగా నేను ఆయన పాదాల దగ్గర✽ పడ్డాను. నామీద కుడి చేయి ఉంచి ఆయన నాతో ఇలా అన్నాడు: “భయపడకు✽, నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి✽. 18 నేను సజీవుణ్ణి✽. చనిపోయాను✽ గాని చూడు, యుగయుగాలకూ జీవిస్తున్నాను✽. తథాస్తు. మరణ పాతాళాలకు తాళం చెవులు✽ నా దగ్గరే ఉన్నాయి. 19 ✽నీవు చూచినవీ ఉన్నవీ వీటి తరువాత జరగబోయేవీ వ్రాయి. 20 నీవు నా కుడిచేతిలో చూచిన ఏడు నక్షత్రాలనూ ఆ ఏడు బంగారు దీప స్తంభాలనూ గురించిన రహస్య సత్యం✽ ఏమంటే, ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతలు✽. నీవు చూచిన ఆ ఏడు దీప స్తంభాలు ఆ ఏడు సంఘాలు✽.