4
1 ప్రియ సోదరులారా, చాలామంది కపట ప్రవక్తలు లోకంలోకి బయలుదేరారు గనుక ప్రతి ఆత్మనూ నమ్మకండి గానీ ఆ ఆత్మలు దేవునికి చెందేవో కావో పరీక్షించి చూడండి. 2 మీరిలా దేవుని ఆత్మను గుర్తిస్తారు: యేసు క్రీస్తు శరీరంతో వచ్చాడని ఒప్పుకొనే ప్రతి ఆత్మా దేవునికి చెందేది, 3 యేసు క్రీస్తు శరీరంతో వచ్చాడని ఒప్పుకోని ప్రతి ఆత్మా దేవునికి చెందేది కాదు. అది క్రీస్తు విరోధికి చెందేది. అది వస్తుందని మీరు విన్నారు గదా, అది ఇప్పుడే లోకంలో ఉంది.
4 చిన్న పిల్లలారా, మీరు దేవునికి చెందేవారు, లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు అధికుడు గనుక మీరు ఆ కపట ప్రవక్తలను జయించారు. 5 వారు లోకానికి చెందేవారు గనుక లోకానికి చెందినట్టే మాట్లాడుతారు. వారి మాట లోకం వింటుంది కూడా. 6 మనమైతే దేవునికి చెందేవారం. దేవుణ్ణి తెలుసుకొనేవాడు మన మాట వింటాడు గాని దేవునికి చెందనివాడు మన మాట వినడు. దీన్ని బట్టి సత్యాత్మ ఏదో అసత్యాత్మ ఏదో మనకు తెలుసు.
7 ప్రియ సోదరులారా, ఒకరినొకరు ప్రేమతో చూచుకొందాం. ఎందుకంటే ప్రేమ దేవునికి చెందేది. ప్రేమతో చూచే ప్రతి ఒక్కరూ దేవునివల్ల జన్మించినవారు, దేవుణ్ణి ఎరిగినవారు. 8 దేవుడు ప్రేమస్వరూపి గనుక ప్రేమతో చూడనివాడు దేవుణ్ణి ఎరగనివాడే. 9  దేవుని ప్రేమ మనకు వెల్లడి అయిన విధానమేమంటే, మనం ఆయనద్వారా జీవించేలా దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి లోకంలోకి పంపాడు. 10 ప్రేమంటే ఇదే: మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి మన పాపాలకు కరుణాధారమైన బలి కావడానికి తన కుమారుణ్ణి పంపాడు. 11 ప్రియ సోదరులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు గనుక మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి. 12 ఏ మనిషీ దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు. మనం ఒకరినొకరం ప్రేమతో చూస్తూ ఉంటే దేవుడు మనలో ఉంటున్నాడు, ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమై ఉంది.
13 ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. దీన్ని బట్టి మనం ఆయనలో ఉన్నామనీ ఆయన మనలో ఉన్నాడనీ మనకు తెలుసు. 14 తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా పంపాడు. ఇది చూచి మేము సాక్ష్యం చెపుతున్నాం. 15 యేసు దేవుని కుమారుడని ఒప్పుకొన్నవాడెవరైనా దేవునిలో ఉంటున్నారు, దేవుడు ఆ వ్యక్తిలో ఉంటున్నాడు. 16 దేవునికి మనమీద ఉన్న ప్రేమను మనం తెలుసుకొన్నాం, నమ్ముకొన్నాం. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమలో ఉంటున్నవాడు దేవునిలో ఉంటున్నాడు, దేవుడు అతనిలో ఉంటున్నాడు. 17 తీర్పు రోజున మనకు ధైర్యం ఉండేలా దీన్ని బట్టి మనమధ్య ప్రేమ పరిపూర్ణమై ఉంది. ఎందుకంటే, ఈ లోకంలో మనం ఆయనలాగా ఉన్నాం. 18 ప్రేమలో భయమంటూ లేదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని బయటికి గెంటివేస్తుంది. భయానికి దండనతో సంబంధం ఉంది. భయం ఉన్నవాడు ప్రేమలో ఇంకా పరిపూర్ణుడు కాలేదు.
19  ఆయనే మనలను మొదట ప్రేమించాడు. అందుచేతే మనం ఆయనను ప్రేమిస్తున్నాం. 20  “దేవుడంటే నాకు ప్రేమ” అంటూ ఎవడైనా తన సోదరుణ్ణి ద్వేషిస్తూ ఉంటే అతడు అబద్ధికుడు. తాను చూచే సోదరుణ్ణి ప్రేమించనివాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? 21 దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలనే ఆజ్ఞ ఆయనవల్లే మనకు ఉంది.