3
1 మనం దేవుని పిల్లలమని అనిపించుకొనేలా తండ్రి మనమీద చూపిన ప్రేమ ఎలాంటిదో చూడండి! ఈ కారణం చేత లోకం మనలను ఎరగదు. ఎందుకంటే అది ఆయనను ఎరగలేదు. 2 ప్రియ సోదరులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. అయితే మనమిక ఏమవుతామో అది ఇంకా వెల్లడి కాలేదు గాని ఆయన వెల్లడి అయ్యేటప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం గనుక ఆయనలాగా ఉంటామని మనకు తెలుసు. 3 ఆయన మీద ఈ ఆశాభావం ఉన్న ప్రతి ఒక్కరూ, ఆయన పవిత్రుడై ఉన్నట్టు తనను పవిత్రం చేసుకొంటారు.
4 అపరాధం చేయడం అభ్యసించే ప్రతి ఒక్కరూ న్యాయం లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అపరాధమంటే న్యాయం లేనట్టు ప్రవర్తించడం. 5 మన అపరాధాలు తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడని మీకు తెలుసు. ఆయనలో అపరాధమేమీ లేదు. 6 ఆయనలో నిలిచి ఉండే వ్యక్తి ఎవరూ అపరాధం చేస్తూ ఉండరు. అపరాధం చేస్తూ ఉండే వ్యక్తి ఎవరూ ఆయనను చూడలేదు, ఆయనను తెలుసుకోలేదు.
7 చిన్న పిల్లలారా, మిమ్ములను ఎవరూ తప్పు దారి పట్టించకుండా చూచుకోండి. ఆయన న్యాయవంతుడై ఉన్నట్టు న్యాయంగా ప్రవర్తించే ప్రతి ఒక్కడూ న్యాయవంతుడే. 8 అపరాధం చేస్తూ ఉండేవాడు అపనింద పిశాచానికి చెందినవాడు. అపనింద పిశాచం మొదటినుంచి పాపం చేస్తూ ఉన్నాడు. అపనింద పిశాచం పనులు నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. 9 దేవునివల్ల జన్మించిన వ్యక్తి ఎవరూ అపరాధం చేస్తూ వుండడు. ఎందుకంటే దేవుని విత్తనం అతనిలో నిలిచి ఉంటుంది. అతడు దేవునివల్ల జన్మించినవాడు గనుక అపరాధం చేస్తూ ఉండలేడు. 10 దీన్నిబట్టి దేవుని పిల్లలెవరో అపనింద పిశాచం పిల్లలెవరో తేటతెల్లమవుతుంది. న్యాయంగా ప్రవర్తించనివాడు దేవునికి చెందినవాడు కాడు. తన సోదరుణ్ణి ప్రేమతో చూడనివాడు కూడా అంతే.
11 మనం ఒకరినొకరు ప్రేమతో చూడాలి అనేది మొదటినుంచి మీరు విన్న సందేశమే గదా. 12 మనం కయీనులాగా ఉండకూడదు. అతడు దుర్మార్గుడికి చెందినవాడై తన సోదరుణ్ణి చంపాడు. అతణ్ణి ఎందుకు చంపాడు? తన పనులు చెడ్డవి, తోబుట్టువు పనులు న్యాయమైనవి, అందుచేతే.
13  సోదరులారా, మీరంటే లోకానికి ద్వేషం ఉంటే ఆశ్చర్యపడకండి. 14 మనం సోదరులను ప్రేమతో చూస్తున్నాం గనుక మరణంలో నుంచి జీవంలోకి దాటామని మనకు తెలుసు. తన సోదరుణ్ణి ప్రేమతో చూడనివాడైతే మరణంలోనే ఆగిపోతున్నాడు. 15 తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతి ఒక్కడూ హంతకుడే! ఏ హంతకుడిలోనూ శాశ్వత జీవం లేదని మీకు తెలుసు.
16 యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణం ధారపోశాడు. ప్రేమ అంటే ఎలాంటిదో దీన్నిబట్టే మనకు తెలుసు. మనమూ సోదరులకోసం మన ప్రాణాలను ధారపోయడానికి బాధ్యతగలవారం. 17  అయితే ఈ లోకం బ్రతుకుదెరువు గలవాడెవడైనా తన సోదరుడు అక్కరలో ఉండడం చూస్తూ అతనిమీద ఏమీ జాలి చూపకపోతే అతడిలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది?
18 నా చిన్న పిల్లలారా, మాటతో భాషతో గాక వాస్తవంగా, క్రియతో ప్రేమ చూపుదాం. 19 అలా చేయడంవల్ల మనం సత్యానికి చెందినవారమని మనకు తెలుసు. ఆయన ఎదుట మన హృదయాలను శాంతిపరచుకొంటాం. 20 మన హృదయం మనమీద నింద మోపుతూ ఉంటే దేవుడు మన హృదయంకంటే అధికుడు. సమస్తమూ ఆయనకు తెలుసు. 21 ప్రియ సోదరులారా, మన హృదయం మనమీద నింద మోపకపోతే దేవుని సన్నిధానంలో మనకు ధైర్యం ఉంటుంది. 22 అప్పుడు, ఆయన ఆజ్ఞలు శిరసావహిస్తూ ఆయనకిష్టమైన వాటిని జరిగిస్తూ ఉండడంచేత, మనం ఏమి అడిగినా సరే అది ఆయన మనకిస్తాడు.
23 ఆయన ఆజ్ఞ ఇదే: ఆయన కుమారుడైన యేసు క్రీస్తు పేరు మీద మనం నమ్మకముంచాలి. ఆయన మనకు ఆజ్ఞాపించినట్టే ఒకరినొకరం ప్రేమతో చూడాలి. 24 ఆయన ఆజ్ఞలను శిరసావహించేవాడు ఆయనలో నిలిచి ఉంటాడు, ఆయన ఆ వ్యక్తిలో నిలిచి ఉంటాడు. ఆయన మనలో నిలిచి ఉంటున్నాడని ఆయన మనకిచ్చిన తన ఆత్మ ద్వారా మనకు తెలుసు.