2
1 నా చిన్న పిల్లలారా, మీరు ఎలాంటి పాపం చేయకుండా ఉండాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే తండ్రిదగ్గర మన తరఫున న్యాయవాది ఒకడు మనకు ఉన్నాడు. ఆయనే న్యాయవంతుడైన యేసు క్రీస్తు. 2 మన పాపాలకు కరుణాధారమైన బలి కూడా ఆయనే. మన పాపాలకు మాత్రమే కాదు – లోకమంతటికీ ఆయన కరుణాధారమైన బలి.
3 మనం ఆయన ఆజ్ఞలు శిరసావహిస్తూ ఉంటే ఆయనను తెలుసుకొని ఉన్నామని దీనిని బట్టి మనకు తెలుసు. 4 “నేనాయనను తెలుసుకొని ఉన్నాను” అని ఎవరైనా చెప్పి ఆయన ఆజ్ఞలు శిరసావహించకపోతే అతడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. 5 కానీ ఆయన వాక్కును ఎవరైనా ఆచరిస్తూ ఉంటే నిజంగా ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ పరిపూర్ణమయింది. మనం ఆయనలో ఉన్నామని దీన్నిబట్టి మనకు తెలుసు. 6 “ఆయనలో నిలిచి ఉంటున్నాను” అనే వ్యక్తి ఆయన నడిచినట్టే నడవాలి.
7 సోదరులారా, నేను ఇప్పుడు మీకు రాస్తున్నది మొదటినుంచీ మీకున్న పాత ఆజ్ఞే గానీ కొత్తది కాదు. ఈ పాత ఆజ్ఞ మీరు మొదటి నుంచి విన్న వాక్కే. 8 అయినా కొత్త ఆజ్ఞ మీకు రాస్తున్నాను. ఇది ఆయనలో మీలో కూడా సత్యమే. ఎందుకంటే చీకటి పోతూ ఉంది, నిజమైన వెలుగు ప్రకాశిస్తూ ఉంది. 9 “తాను వెలుగులో ఉన్నాను” అని చెప్పుకొంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటివరకూ చీకటిలోనే ఉన్నాడు. 10 తన సోదరుణ్ణి ప్రేమతో చూచేవాడు వెలుగులో ఉన్నాడు. అతనిలో తొట్రుపాటు కారణమేదీ లేదు. 11 కాని, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. ఆ చీకటి అతని కండ్లకు గుడ్డితనం కలిగించింది గనుక ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తనకే తెలియదు.
12 చిన్న పిల్లలారా, ఆయన పేరును బట్టి మీ పాపాలకు క్షమాపణ మీకు కలిగింది గనుక మీకు రాస్తున్నాను. 13 తండ్రులారా, ఆదినుంచీ ఉన్న ఆయనను మీరు తెలుసుకొని ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు దుర్మార్గుణ్ణి జయించారు గనుక మీకు రాస్తున్నాను. చిన్న పిల్లలారా, తండ్రిని మీరు తెలుసుకొని ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. 14 తండ్రులారా, ఆదినుంచీ ఉన్న ఆయనను మీరు తెలుసుకొన్నారు గనుక మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీలో ఉంది, మీరు దుర్మార్గుణ్ణి జయించారు గనుక మీకు రాస్తున్నాను.
15 లోకాన్ని గానీ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే ఆ వ్యక్తిలో పరమ తండ్రి ప్రేమ లేదు. 16 ఎందుకంటే, లోకంలో ఉన్నదంతా, అంటే శరీర స్వభావం కోరికలూ కండ్ల కోరికలూ జీవితాన్ని గురించిన బడాయిలూ తండ్రివల్ల కలిగేవి కావు గాని లోకంవల్లే కలిగేవి. 17 లోకమూ దాని కోరికా గతించిపోతూ ఉన్నాయి గాని దేవుని ఇష్టం నెరవేర్చేవాడు శాశ్వతంగా జీవిస్తాడు.
18 చిన్న పిల్లలారా, ఇది చివరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు గదా. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇది చివరి ఘడియ అని దీన్ని బట్టి మనకు తెలుసు. 19 వారు మన మధ్యనుంచే వెళ్ళారు గానీ వారు మనకు చెందినవారు కారు. ఒకవేళ వారు మనకు చెందినవారైతే మనతోనే నిలిచి ఉండేవారు. కానీ వారిలో ఎవరూ మనకు చెందినవారు కాదని వెల్లడి అయ్యేలా వెళ్ళిపోయారు.
20 మీరైతే పవిత్రునిచేత అభిషేకం పొందినవారు గనుక విషయాలన్నీ తెలిసినవారు. 21  మీకు సత్యం తెలియకపోవడంచేత నేను మీకు రాయడం లేదు గాని మీకది తెలుసు, ఏ అబద్ధమూ సత్యానికి చెందినది కాదు గనుకనే మీకు రాస్తున్నాను. 22 యేసు అభిషిక్తుడు కాడని చెప్పేవాడు తప్ప అబద్ధికుడెవడు? తండ్రినీ కుమారుణ్ణీ కాదంటున్న వ్యక్తే క్రీస్తు విరోధి. 23 కుమారుణ్ణి కాదనే వ్యక్తికి తండ్రి లేడు. కుమారుణ్ణి ఒప్పుకొనే వ్యక్తికి తండ్రి కూడా ఉన్నాడు.
24 మీరు మొదటినుంచి విన్నది మీలో నిలిచేలా చూచుకోండి. మీరు మొదటినుంచి విన్నది మీలో నిలిస్తే మీరు కుమారునిలోను తండ్రిలోను నిలుస్తారు. 25 ఆయన మనకు వాగ్దానం చేసినది శాశ్వత జీవమే.
26 మిమ్ములను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించే వారిని గురించి ఈ విషయాలు మీకు రాశాను. 27 అయితే ఆయనచేత మీకు అందిన అభిషేకం మీలో నిలిచి ఉంది గనుక ఎవరూ మీకు ఉపదేశించనక్కరలేదు. ఆ అభిషేకం అన్నిటిని గురించీ మీకు ఉపదేశిస్తుంది. ఈ అభిషేకం వాస్తవమైనది, అబద్ధమైనది కాదు. అది మీకు ఉపదేశించినట్టే మీరు ఆయనలో నిలిచి ఉంటారు.
28 కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన కనబడేటప్పుడు ఆయన రాకడలో ఆయన సమక్షంలో మనం సిగ్గుపాలు కాకుండా ధైర్యంగా ఉండేలా ఆయనలో నిలిచి ఉండండి.
29 ఆయన న్యాయవంతుడని మీకు తెలిసి ఉంటే న్యాయంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరూ ఆయనవల్ల జన్మించి ఉన్నారని కూడా మీకు తెలుసు.