1 యోహాను లేఖ
1
1 ఆది✽నుంచి ఉన్న జీవ వాక్కు✽ను గురించి మేము✽ విన్నదీ మా కండ్లతో చూచిందీ, పరిశీలనగా చూచి కనిపెట్టినదీ, మా చేతులు తాకినదీ✽ మీకు ప్రకటిస్తున్నాం. 2 ఆ జీవం వెల్లడి అయినది. మేము చూచి దాన్ని గురించి సాక్ష్యం చెపుతున్నాం, తండ్రిదగ్గర✽ ఉండి మాకు ప్రత్యక్షమైన✽ ఆ శాశ్వత జీవాన్ని✽ మీకు ప్రకటిస్తున్నాం. 3 మీరు మాతో కూడా సహవాసం✽ అనుభవించాలని మేము చూచిందీ✽, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. మన సహవాసమైతే ఆ తండ్రితో, ఆయన కుమారుడైన✽ యేసు క్రీస్తుతో ఉంది. 4 మీ ఆనందం✽ పరిపూర్ణం కావాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాం.5 ఆయన చెప్పగా విని మేము మీకు ప్రకటించే సందేశమేమంటే, దేవుడు వెలుగు✽, ఆయనలో చీకటి అంటూ ఏమీ లేదు✽. 6 ఆయనతోకూడా మనకు సహవాసం ఉందని చెప్పుకొని✽ చీకటిలో నడుస్తూ ఉంటే మనం అబద్ధమాడుతున్నాం✽, సత్యం ఆచరణలో✽ పెట్టుకోవడం లేదు. 7 ✽కానీ, ఆయన వెలుగులో ఉన్నట్టు మనం వెలుగులో నడుస్తూ ఉంటే మనకు పరస్పర సహవాసం✽ ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపంనుంచీ శుద్ధి చేస్తుంది✽.
8 ✽మనం పాపం లేనివారమని చెప్పుకొంటే మనలను మనమే మోసపుచ్చుకొంటున్నాం. మనలో సత్యం ఉండదు✽. 9 మన✽ పాపాలు మనం ఒప్పుకొంటే✽ ఆయన మన పాపాలు క్షమించి అన్యాయమంతటి నుంచీ మనలను శుద్ధి చేస్తాడు✽. అందుకు ఆయన నమ్మతగినవాడూ✽ న్యాయవంతుడూ✽. 10 ✽ఏ పాపమూ చేయలేదని మనం చెప్పుకొంటే ఆయనను అబద్ధికుడుగా చేసినవారమవుతాం, ఆయన వాక్కు మనలో ఉండదు.