5
1 యేసే అభిషిక్తుడు అని నమ్మే ప్రతి ఒక్కరూ దేవుని వల్ల జన్మించినవారు. జన్మ కలిగించినవాణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆయనవల్ల జన్మించినవాణ్ణి కూడా ప్రేమిస్తారు. 2 మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉంటే, దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాన్ని బట్టి మనకు తెలుసు. 3 దేవుణ్ణి ప్రేమించడమంటే మనం ఆయన ఆజ్ఞలు శిరసావహించడమే. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. 4 ఎందుకంటే, దేవునివల్ల జన్మించిన సంతతివారందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించినది మన నమ్మకమే. 5 లోకాన్ని జయించేది ఎవరు? యేసు దేవుని కుమారుడని నమ్మే వ్యక్తే!
6  నీళ్ళద్వారా, రక్తంద్వారా వచ్చినవాడు ఆయనే – అంటే యేసు క్రీస్తే. నీళ్ళద్వారా మాత్రమే కాదు, నీళ్ళద్వారా, రక్తంద్వారా కూడా వచ్చాడు. దేవుని ఆత్మ సత్యస్వరూపి గనుక ఆత్మే సాక్ష్యం చెపుతున్నాడు. 7  పరలోకంలో ముగ్గురు సాక్షులున్నారు – తండ్రి, “వాక్కు”, పవిత్రాత్మ. ఈ ముగ్గురూ ఒక్కటే. 8 భూమిమీద కూడా మూడు సాక్ష్యాలు ఉన్నాయి – ఆత్మ, నీళ్ళు, రక్తం. ఈ మూడు ఏకీభవిస్తున్నాయి.
9 మనుషులు చెప్పే సాక్ష్యం అంగీకరిస్తున్నాం గదా. దానికంటే దేవుని సాక్ష్యం మరీ గొప్పది. ఎందుకంటే దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుణ్ణి గురించి చెప్పినదే. 10 దేవుని కుమారునిమీద నమ్మకముంచిన వ్యక్తిలో ఈ సాక్ష్యం ఉంటుంది. దేవుణ్ణి నమ్మని వ్యక్తి దేవుణ్ణి అబద్ధికుడుగా చేసినట్టే. ఎందుకంటే దేవుడు తన కుమారుని విషయం చెప్పిన సాక్ష్యం ఆ వ్యక్తి నమ్మలేదు. 11 ఆ సాక్ష్యం ఇదే: దేవుడు శాశ్వత జీవం మనకిచ్చాడు. ఈ జీవం ఆయన కుమారునిలో ఉంది. 12 ఏ వ్యక్తికి దేవుని కుమారుడు ఉన్నాడో ఆ వ్యక్తికి జీవం ఉంది. ఏ వ్యక్తికి దేవుని కుమారుడు లేడో ఆ వ్యక్తికి జీవం లేదు.
13 దేవుని కుమారుని పేరు మీద నమ్మకం ఉంచిన మీరు శాశ్వత జీవం గలవారని మీకు తెలిసిపోవాలనీ దేవుని కుమారుని పేరుమీద ఇంకా నమ్మకం ఉంచాలనీ ఈ విషయాలు మీకు రాస్తున్నాను. 14 ఆయనను గురించి మనకున్న నిశ్చయత ఏమంటే ఆయన చిత్త ప్రకారం మనమేది అడిగినా ఆయన మన విన్నపం వింటాడనేదే. 15 మనమేది అడిగినా ఆయన మన విన్నపం వింటాడని మనకు తెలిసి ఉంటే ఆయనను అడిగినవి మనకు కలిగాయని కూడా తెలుసు.
16 తన సోదరుడు మరణకరం కాని పాపమేదైనా చేయడం ఎవరైనా చూస్తే ఆ వ్యక్తి అతని కోసం ప్రార్థించాలి. మరణకరం కాని పాపం చేసినవారికి ఆ వ్యక్తిని బట్టి దేవుడు జీవమిస్తాడు. మరణకరమైన పాపం ఉంది. దానిని గురించి అతడు ప్రార్థించాలని నేను చెప్పడం లేదు. 17  ప్రతి విధమైన అక్రమ కార్యం పాపమే. అయితే మరణకరం కాని పాపం కూడా ఉంది.
18  దేవునివల్ల జన్మించినవాడెవడూ పాపం చేస్తూ ఉండడని మనకు తెలుసు. దేవునివల్ల జన్మించినవాడు తనను భద్రంగా కాపాడుకుంటాడు. దుర్మార్గుడు అతణ్ణి పట్టుకొని ఉండడు. 19 మనం దేవునికి చెందేవారమనీ లోకమంతా ఆ దుర్మార్గుడిలో ఉందనీ మనకు తెలుసు. 20 మనం సత్యస్వరూపిని తెలుసుకొనేలా దేవుని కుమారుడు వచ్చాడనీ మనకు వివేచన ఇచ్చాడనీ కూడా తెలుసు. మనం ఆ సత్యస్వరూపిలో ఉన్నాం, ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడూ, శాశ్వత జీవమూ.
21 చిన్న పిల్లలారా, విగ్రహాల బారినుంచి మిమ్ములను కాపాడుకోండి. తథాస్తు.