4
1 అందుచేత, క్రీస్తు శరీరంలో మనకోసం బాధలు అనుభవించాడు గనుక అలాంటి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఎందుకంటే శరీరంలో బాధలు అనుభవించినవాడు పాపం నుంచి విరమించుకొన్నాడు. 2 ఈ శరీరంతో ఉన్న మిగతా కాలమంతా మానవ దురాశల కోసం కాదు గాని దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని అతని ఉద్దేశం. 3  మనం పోకిరి పనులలో, దురాశలలో, మద్యపానంలో, అల్లరితో కూడిన ఆటపాటలలో, త్రాగుబోతుల విందులలో, అసహ్యమైన విగ్రహ పూజలలో నడుచుకొంటూ ఇతర ప్రజల ఇష్టం నెరవేర్చడానికి గడిచిపోయిన జీవిత కాలమే చాలు. 4 ఇప్పుడు విపరీతమైన దుర్మార్గ వ్యవహారాలలో వారితోపాటు మీరు పరుగెత్తడం లేదని వారు ఆశ్చర్యపోతూ మిమ్ములను తిట్టిపోస్తున్నారు. 5 బ్రతికి ఉన్నవారికి చనిపోయినవారికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవానికి వారు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. 6 ఈ కారణంచేత చనిపోయినవారు శరీర విషయంలో మానవరీతిగా తీర్పు పొందేలా, ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి బ్రతికేలా వారికి కూడా శుభవార్త ప్రకటించబడింది.
7 అన్నిటికీ అంతం దగ్గరలో ఉంది, గనుక మీ ప్రార్థనలలో స్థిరబుద్ధితో, మెళకువగా ఉండండి. 8 ప్రేమ విస్తారమైన పాపాలను కప్పుతుంది గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు గాఢంగా ప్రేమతో చూచుకోండి. 9  ఏమీ సణుక్కోకుండా ఒకరినొకరు అతిథి మర్యాదలు చేసుకోండి. 10 ప్రతి ఒక్కరూ తనకు ఇవ్వబడ్డ ఆధ్యాత్మిక వరం ఇతరులకు సేవ చేయడానికి దాన్ని వినియోగించాలి. దేవుని ఆయా విధాల కృప విషయంలో మంచి నిర్వాహకులుగా ఉండాలి. 11 ఎవరైనా మాట్లాడితే దేవోక్తులు పలికినట్టే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడిచ్చిన సామర్థ్యంతో అలా చేయాలి. అన్నిటిలో దేవునికి యేసు క్రీస్తు ద్వారా మహిమ కలగాలనే ఉద్దేశంతో ఉండాలి. ఆయనకే మహిమ, అధికారం యుగయుగాలకు చెందుతాయి. తథాస్తు!
12 ప్రియ సోదరులారా, మీమధ్య వాటిల్లుతూ ఉన్న మంటల్లాంటి విపత్తు మిమ్ములను పరీక్షించడానికే. మీకేదో విపరీతం జరుగుతున్నట్టు ఆశ్చర్యపడకండి. 13 అయితే క్రీస్తు మహిమ వెల్లడి అయ్యేటప్పుడు మీరు మహానందంతో ఉప్పొంగిపోయేలా ఇప్పుడు ఆయన బాధలలో మీరు పాలివారై ఉన్నంతగా ఆనందించండి. 14 ఒకవేళ క్రీస్తు పేరుకోసం మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే, మహిమా స్వరూపి అయిన దేవాత్మ మీమీద నిలిచి ఉన్నాడన్నమాట. వారివైపున ఆయన దూషించబడుతున్నాడు, మీవైపున ఆయనకు మహిమ కలుగుతూ ఉంది. 15 కానీ మీలో ఎవరూ హంతకుడుగా గానీ దొంగగా గానీ దుర్మార్గుడుగా గానీ పరుల జోలికి పోయేవాడుగా గానీ బాధలు అనుభవించకూడదు. 16 ఎవరైనా క్రైస్తవుడైనందుచేత బాధలు అనుభవించవలసివస్తే సిగ్గుపడకూడదు. అయితే ఈ విషయంలో దేవుణ్ణి కీర్తించాలి.
17 దేవుని ఇంటివారి విషయంలో తీర్పు ఆరంభమయ్యే సమయం వచ్చింది. అది మనతోనే ఆరంభమయితే దేవుని శుభవార్తకు విధేయత చూపనివారి అంతం ఏమవుతుంది! 18 న్యాయవంతునికే రక్షణ, విముక్తి కలగడం కష్టమైతే భక్తిహీనులూ పాపులూ ఎక్కడ కనిపిస్తారో! 19 అందుచేత దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవిస్తున్నవారు మంచి చేస్తూ తమ ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు అప్పచెప్పుకోవాలి.