3
1 అలాగే పెండ్లయిన స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. అప్పుడు వారిలో ఎవరైనా వాక్కుకు అవిధేయులై ఉంటే మాటలతో కాకుండా వారి భార్యల ప్రవర్తనమూలంగా వారు ప్రభువుకు లభ్యం కావచ్చు. 2 భయభక్తులతో కూడిన మీ పవిత్ర జీవితాలను చూచినప్పుడు అలా జరగవచ్చు. 3  జడలు వేసుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, విలువగల వస్త్రాలు ధరించుకోవడం – మీది ఇలాంటి బయటి అలంకారం కాకూడదు. 4 దానికి బదులు మీ లోపలి స్వభావం – శాంతం, సాత్వికం గల వైఖరి అనే తరిగిపోని అలంకారం ఉండాలి. ఇది దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. 5 ఇలాగే గతంలో దేవునిమీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు తమను అలంకరించుకొనేవారు, తమ భర్తలకు లోబడి ఉండేవారు. 6 ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి విధేయురాలయింది. మీరు ఎలాంటి బీతిభయాలకు లొంగకుండా మంచి చేస్తూ ఉండేవారైతే మీరు ఆమె పిల్లలు.
7  పెండ్లయిన పురుషులారా, మీ ప్రార్థనలకు ఆటంకం రాకుండా తెలివైన విధంగా మీ భార్యలతో కాపురముండండి. కృపవల్ల కలిగిన జీవంలో వారు మీతోకూడా పాలివారనీ మీకంటే బలహీనమైన పాత్రలనీ వారిని గౌరవించండి.
8 తుదకు, మీరంతా ఏక భావంతో ఉండండి, సానుభూతితో ఒకరినొకరు చూడండి. సోదర ప్రేమతో, దయతో, మర్యాదతో బ్రతకండి. 9 కీడుకు కీడు, దూషణకు దూషణ చేయకుండా దీవించండి. మిమ్ములను పిలిచింది మీరిలా చేసి దీవెనకు వారసులయ్యేందుకే.
10  బ్రతుకు అంటే ఇష్టం ఉండి మంచి రోజులు చూడగోరేవారెవరైనా తమ నాలుకను చెడు నుంచి, పెదవులు మోసంగా పలకకుండా కాపాడుకోవాలి. 11 చెడునుంచి వైదొలగాలి, మంచినే చేస్తూ ఉండాలి, శాంతిని వెదికి అనుసరించాలి. 12 ప్రభు దృష్టి న్యాయవంతులమీద ఉంది. ఆయన చెవులు వారి ప్రార్థనలకు తెరచి ఉన్నాయి. గానీ ప్రభు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.
13  మీరు మేలైనదాన్ని అనుసరిస్తూ ఉంటే ఎవరు మీకు హాని చేస్తారు? 14 ఒకవేళ నీతినిజాయితీకోసం బాధలకు గురి కావలసివచ్చినా మీరు ధన్యులే. వాళ్ళు భయపడేదానికి భయపడవద్దు, కంగారుపడవద్దు. 15 మీ హృదయాలలో ప్రభువైన దేవుణ్ణి ప్రతిష్టించుకోండి. మీకున్న ఆశాభావానికి కారణమేమిటి అని అడిగే ప్రతి ఒక్కరికీ సాత్వికంతో భయభక్తులతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. 16 క్రీస్తులో మీ మంచి ప్రవర్తనను దూషించేవారు చెప్పుకొనే అపనిందల విషయంలో సిగ్గుపాలయ్యేలా మంచి అంతర్వాణి కలిగి ఉండండి. 17 ఒకవేళ మీరు మంచి చేసినందుచేత బాధలకు గురి కావడం దేవుని చిత్తమైతే, చెడుతనం చేసి బాధలకు గురి కావడం కంటే అది మేలు.
18 మనలను దేవుని దగ్గరకు తేవడానికి న్యాయవంతుడైన క్రీస్తు న్యాయం తప్పినవారికోసం పాపాల విషయంలో ఎప్పటికీ ఒకే సారి బాధలు అనుభవించాడు. శారీరకంగా ఆయన చంపబడ్డాడు. దేవుని ఆత్మచేత సజీవమయ్యాడు. 19 ఈ ఆత్మద్వారా ఆయన వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకు చాటింపు చేశాడు. 20 ఆ ఆత్మలు ఒకప్పుడు దేవునికి విధేయత చూపలేదు. ఇది జరిగినది నోవహు రోజులలో, ఓడ తయారవుతూ ఉంటే దేవుడు ఓపికతో కనిపెట్టిన ఆ కాలంలో. ఆ ఓడలో కొద్దిమందినే, అంటే ఎనిమిదిమందినే నీళ్ళద్వారా రక్షించడం జరిగింది. 21 దానికి అనుగుణమైన చిహ్నం – బాప్తిసం – ఇప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంది. అది శరీర స్వభావంలోని మాలిన్యం తీసివేయడం కాదు గానీ దేవుని పట్ల మంచి అంతర్వాణి ఇచ్చే జవాబు. ఈ రక్షణ యేసు క్రీస్తు పునర్జీవితం ద్వారానే కలిగేది. 22 ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడివైపున ఉన్నాడు. ఆయనకు దేవదూతలమీద, అధికారులమీద, బలాఢ్యులమీద అధికారం కలిగింది.