2
1 ✽ కాబట్టి సమస్తమైన దుష్టభావం, వంచన, కపటం, అసూయ, దూషణ మాటలంతా విసర్జించండి. 2 దేవుని వాక్కులోని ఆధ్యాత్మికమైన స్వచ్ఛమైన పాలవల్ల✽ పెరిగేలా✽, కొత్తగా పుట్టిన బిడ్డల్లాగా✽ దాన్ని ఆశిస్తూ ఉండండి. 3 ✝ప్రభువు దయగలవాడని మీరు రుచి చూశారు గదా.4 ఆయన సజీవమైన రాయి✽. ఆయనను మనుషులు వద్దన్నారు✽ గానీ దేవుడు ఎన్నుకొన్నాడు, ప్రియంగా✽ ఎంచాడు. 5 ఆయన దగ్గరకు వస్తున్న మీరు కూడా సజీవమైన రాళ్ళు✽గా ఉంటూ ఆధ్యాత్మిక ఆలయం✽గా కట్టబడుతూ ఉన్నారు. మీరు పవిత్ర యాజులుగా✽ ఉండి, యేసు క్రీస్తుద్వారా దేవునికి అంగీకారమైన ఆధ్యాత్మిక బలులు✽ సమర్పించాలని దేవుని ఉద్దేశం.
6 ✽అందుచేత ఈ లేఖనంలో కూడా ఇది ఉంది, ఇదిగో, నేను ఎన్నుకొని ప్రియంగా ఎంచిన ముఖ్యమైన మూలరాయిని సీయోనులో ఉంచుతున్నాను. ఆయన మీద నమ్మకం ఉంచినవాడు ఎన్నడూ కలవరానికి గురికాబోడు.
7 నమ్మకముంచుతున్న మీకు ఈ “రాయి” ప్రియమైనది✽ గానీ నమ్మకాన్ని నిరాకరించేవారి విషయమైతే ఈ మాట చెల్లుతుంది: “కట్టేవాళ్ళు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి✽ అయింది.” 8 ✽ “ఆయన తగిలే రాయిగా, తొట్రుపాటు బండగా ఉంటాడు.” వారు వాక్కుకు అవిధేయులు గనుకనే తొట్రుపడుతున్నారు. ఇది వారికి నియమించిన విధి✽.
9 మీరైతే ఎన్నికైన✽ వంశం, పరలోక రాజుకు చెందిన యాజుల సమూహం✽, పవిత్ర జనం✽, దేవుని సొత్తయిన ప్రజ. ఇందులో ఆయన ఉద్దేశమేమంటే, చీకటిలోనుంచి తన అద్భుతమైన వెలుగు✽లోకి మిమ్ములను పిలిచిన ఆయన ఉత్తమ గుణాలు✽ మీరు చాటించాలి.
10 ✽ఒకప్పుడు మీరు ప్రజగా లేకపోయారు. ఇప్పుడైతే మీరు దేవుని ప్రజ. ఒకప్పుడు కరుణ పొందనివారు. ఇప్పుడైతే కరుణ పొందినవారు.
11 ప్రియ స్నేహితులారా, పరవాసులు✽, యాత్రికులై ఉండి శరీర స్వభావ దురాశలు✽ విసర్జించండని మిమ్ములను వేడుకొంటున్నాను. అవి మీ ఆత్మలమీద యుద్ధం✽ చేస్తాయి. 12 ✝ఇతర ప్రజలు మిమ్ములను దుర్మార్గులని దూషిస్తూ ఉంటే✽ వారు మీ మంచి పనులు చూచి దైవదర్శన దినాన✽ దేవుణ్ణి మహిమపరచాలని వారిమధ్య ఆకర్షణీయమైన ప్రవర్తన గలవారై ఉండండి.
13 ✝అందుచేత మనుషులలో నియమించిన ప్రతి అధికారానికీ ప్రభువును బట్టి లోబడండి. రాజుకు ఆధిపత్యం ఉందనీ 14 ప్రాంతీయాధికారులు దుర్మార్గులను దండించడానికీ సన్మార్గులను మెచ్చుకోవడానికీ రాజు పంపినవారనీ వారికీ లోబడండి. 15 ఎందుకంటే మీరు మంచి చేయడం✽ ద్వారా తెలివితక్కువగా మాట్లాడే✽ మూర్ఖుల✽ నోరు మూయించడం దేవుని చిత్తం. 16 ✝స్వతంత్రులై ఉండి దుర్మార్గాన్ని కప్పిపుచ్చడానికి మీ స్వేచ్ఛ వినియోగించుకోకండి గాని దేవుని బానిసలుగా బ్రతకండి. 17 అందరిపట్ల✽ గౌరవం చూపండి. క్రైస్తవ సోదరత్వాన్ని ప్రేమతో చూడండి. దేవునిమీది భయభక్తులు కలిగి ఉండండి. రాజును గౌరవించండి.
18 ✝ఇంటి దాసులారా, మీ యజమానులకు పూర్తి భయ మర్యాదలతో లోబడి ఉండండి. మంచివారికీ సాత్వికులకూ మాత్రమే కాకుండా వక్ర బుద్ధులకు కూడా అణిగి ఉండండి. 19 ఎందుకంటే ఎవరైనా అన్యాయంగా బాధలకు గురి అవుతూ ఉన్నప్పుడు దేవునిపట్ల అంతర్వాణిని బట్టి ఆ దుఃఖం ఓర్చుకొంటే అది మెచ్చుకోదగిన✽ సంగతి. 20 ✝తప్పిదాలు చేసినందుచేత మీరు దెబ్బలు తిని ఓర్చుకొంటే మీకేం కీర్తి? గానీ మీరు మంచి చేసి బాధలకు గురి అయి ఓర్చుకొంటే ఇది దేవుని దృష్టిలో మెచ్చుకోతగినదే. 21 మీకు దేవుని పిలుపు✽ వచ్చినది ఇందుకే గదా.
ఎందుకంటే, క్రీస్తు సహా మనకోసం బాధలు అనుభవించి మీరు ఆయన అడుగు జాడలలో నడవాలని✽ మనకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళిపోయాడు. 22 ✝ఆయన ఏమీ పాపం చేయలేదు. ఆయన నోట ఏమీ మోసం లేదు. 23 ✽ దూషణకు ఆయన గురి అయినప్పుడు ఆయన దూషణ మాటలు బదులు చెప్పలేదు, బాధలకు గురి అయినప్పుడు బెదరించలేదు గాని న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పచెప్పుకొన్నాడు.
24 ✽మనం పాపాల విషయంలో చనిపోయి✽ నీతిన్యాయాలకోసం✽ బ్రతకాలని ఆయన తానే తన శరీరంలో మన పాపాలు మ్రానుమీద భరించాడు. ఆయన పొందిన దెబ్బల మూలంగా మీకు ఆరోగ్యం✽ కలిగింది. 25 ఎందుకంటే మీరు గొర్రెలలాగా త్రోవ తప్పిపోయారు✽ గాని ఇప్పుడు మీ ఆత్మలకు కాపరిగా✽, పై విచారణకర్తగా✽ ఉన్న ఆయన దగ్గరకు మళ్ళుకొని వచ్చారు.