1 పేతురు లేఖ
1
1 పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ ప్రాంతాలలో చెదరిపోయియూదులలో పరాయివారుగా ఉండి తండ్రి అయిన దేవునిచేత ఎన్నుకోబడ్డ వారికి యేసు క్రీస్తు రాయబారి అయిన పేతురు రాస్తున్న విషయాలు. 2 దేవుడు మిమ్ములను ఎన్నుకొన్నది తన భవిష్యత్ జ్ఞానం ప్రకారం, తన ఆత్మ పవిత్రపరచే పనివల్ల, విధేయతకూ, యేసు క్రీస్తు రక్త ప్రోక్షణకూ. మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా కలుగుతాయి గాక!
3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగుతాయి గాక! యేసు క్రీస్తును చనిపోయిన వారిలోనుంచి లేపడం ద్వారా, దేవుడు తన మహా కరుణ ప్రకారం మనకు కొత్త జన్మం కలిగించాడు. ఇది సజీవమైన ఆశాభావానికీ 4 నాశనం కాని, చెడిపోని, వాడిపోని వారసత్వానికీ. ఈ వారసత్వం మీ కోసం పరలోకంలో భద్రంగా ఉంచబడేది. 5 కడవరి కాలంలో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న ముక్తి కోసం, నమ్మకం ద్వారా దేవుని బలప్రభావాలు మిమ్ములను కాపాడుతూ ఉన్నాయి.
6 దీనిని బట్టి మీరు చాలా ఆనందిస్తున్నారు. అయినా నానా విధాల విషమ పరీక్షలవల్ల ప్రస్తుతం కొద్ది కాలం మీరు దుఃఖపడవలసి ఉందేమో. 7 ఎందుకని? మీ నమ్మకం నాశనం కాబోయే బంగారం కంటే, ఎంతో విలువగలది. దానికి జ్వాలలచేత పరీక్ష కలిగినా, అది పరీక్షలకు నిలిచి మెప్పు పొందడం యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు స్తుతి, మహిమ, ఘనతలకు కారణంగా కనబడాలి. 8 మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరాయనను చూడడం లేదు గానీ ఆయనమీద నమ్మకం ఉంచుతూ మాటలలో చెప్పలేనంత దివ్య సంతోషం కలిగి ఆనందిస్తున్నారు. 9 మీరు మీ విశ్వాస ఫలితం, అంటే మీ ఆత్మల విముక్తి అనుభవిస్తున్నారు.
10 మీకు కలిగే కృపను గురించి ముందుగానే పలికిన ప్రవక్తలు ఈ విముక్తిని గురించి విచారిస్తూ శ్రద్ధాసక్తులతో పరిశీలించారు. 11 తమలో ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు బాధలనూ వాటి తరువాత కలిగే మహిమగలవాటినీ ముందుగానే సాక్ష్యం చెప్పినప్పుడు ఏ కాలాన్ని, ఎలాంటి పరిస్థితులను సూచిస్తున్నాడో దానంతటి గురించి విచారించారు 12 ఈ విషయాలలో వారు సేవ చేసేది తమకోసం కాకుండా మన కోసమని వారికి వెల్లడి చేయబడింది. పరలోకంనుంచి పంపబడ్డ పవిత్రాత్మచేత ప్రస్తుతం మీకు శుభవార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకు చెప్పారు. దేవదూతలు కూడా ఈ విషయాలను చేరువగా చూడడానికి తహతహలాడుతున్నారు.
13 అందుచేత కార్యసిద్ధికి మీ మనసులను సిద్ధం చేయండి. మెళకువగా ఉండండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు ఇవ్వబోయే కృపకోసం సంపూర్ణమైన ఆశాభావంతో ఎదురు చూడండి. 14 విధేయతగల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలోలాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి. 15  మిమ్ములను పిలిచినవాడు పవిత్రుడు. అలాగే మీ ప్రవర్తనంతట్లో పవిత్రులై ఉండండి. 16 ఎందుకంటే, “నేను పవిత్రుణ్ణి గనుక మీరూ పవిత్రులై ఉండండి” అని రాసి ఉంది.
17 ప్రతి ఒక్కరి పనిని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు “తండ్రి” అని పిలుస్తూ ఉంటే పరవాసులుగా ఉన్నంతకాలం భయభక్తులతో గడపండి. 18 ఎందుకంటే మీకు తెలిసినదేమంటే, మీ పూర్వీకులనుంచి పారంపర్యంగా వచ్చిన మీ వ్యర్థమైన జీవిత విధానం నుంచి మిమ్ములను విడిపించింది వెండి బంగారాలలాంటి నాశనమయ్యే వస్తువులతో కాదు 19 గాని ఏ లోపమూ కళంకమూ లేని గొర్రెపిల్లలాంటి క్రీస్తు అమూల్య రక్తంతోనే. 20 జగత్తు ఉనికిలోకి రాకముందే ఆయన నియమించబడ్డాడు గాని ఈ చివరి కాలాలలోనే మీకోసం ప్రత్యక్షం అయ్యాడు. 21 ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నవారు. దేవుడాయనను చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ నమ్మకం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి.
22 మీరు దేవుని ఆత్మ ద్వారా సత్యానికి విధేయులు కావడంచేత మీ హృదయాలను మీరు పవిత్రంగా చేసుకొన్నారు. తద్వారా మీకు నిజమైన సోదర ప్రేమ కలిగింది. ఇప్పుడు ఒకరినొకరు గాఢంగా, శుద్ధ హృదయంతో ప్రేమించుకోండి. 23 ఎందుకంటే మీరు నాశనమయ్యే బీజంనుంచి కాదు గాని ఎన్నడూ నాశనం కానిదాని ద్వారానే, అంటే సజీవమైన శాశ్వతమైన దైవవాక్కు ద్వారానే కొత్త జన్మం పొందారు. 24  ఎందుకంటే, “శరీరం ఉన్నవారంతా గడ్డిలాంటివారు, మానవ వైభవమంతా అడవి పువ్వులాగా ఉంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది 25 గాని ప్రభు వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.” మీకు శుభవార్త ద్వారా ప్రకటించిన వాక్కు ఇదే.