4
1 ✽మీలో జగడాలకూ పోట్లాటలకూ కారణమేమిటి? మీ అవయవాలలో పోరాడుతున్న మీ సుఖాలకోసమైన కోరికలే గదా. 2 మీరు ఏవేవో కావాలని కోరుతారు. అవి లేవు గనుక హత్య చేస్తారు✽. అపేక్షిస్తారు గాని కోరేది సంపాదించు కోలేరు. పోట్లాటలూ జగడాలూ జరిగిస్తారు. అయితే మీకు దొరకని కారణమేమంటే మీరు దేవుణ్ణి అడగడం లేదు✽. 3 ✽ఒక వేళ అడుగుతారు గాని మీ సుఖభోగాల కోసమే వాడుకోవాలని దురుద్దేశంతోనే అడుగుతారు గనుక మీకేమీ దొరకదు.4 వ్యభిచారులారా! వ్యభిచారిణులారా✽! లోకంతో స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా? అందుచేత ఎవరైతే లోకంతో స్నేహం చేయాలని ఉద్దేశిస్తారో వారు దేవునికి విరోధులవుతారు. 5 ✽మనలో నివసిస్తున్న ఆత్మ తీవ్రంగా ఆకాంక్షిస్తాడా? అని చెప్పిన లేఖనం వ్యర్థం అనుకొంటున్నారా? 6 ✝అయితే ఆయన మరెక్కువ కృప✽ ఇస్తాడు. అందుచేత దేవుడు గర్విష్ఠులను✽ ఎదిరిస్తాడు గానీ వినయవంతులకు✽ కృప చూపుతాడని చెపుతాడు.
7 కాబట్టి దేవునికి లోబడి✽ ఉండండి. అపనింద పిశాచాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు✽.
8 ✽దేవుని దగ్గరకు రండి, అప్పుడాయన మీ దగ్గరకు వస్తాడు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి✽. చపల చిత్తులారా✽, మీ హృదయాలు పవిత్రం చేసుకోండి✽. 9 ✽ దుఃఖించండి, ఏడ్వండి, రోదనం చేయండి. మీ నవ్వు ఏడుపుకు, మీ సంతోషం విచారానికి మార్చుకోండి. 10 ✽ప్రభు సముఖంలో మిమ్ములను మీరే తగ్గించుకోండి, అప్పుడాయన మిమ్ములను పైకెత్తుతాడు.
11 సోదరులారా, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుకోకండి✽. సోదరునికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తీ తీర్పు తీర్చే వ్యక్తీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దానికి తీర్పు తీరుస్తున్నాడు. ఒకవేళ నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తుంటే దానిప్రకారం ప్రవర్తించేవాడివి కావు గాని దానికి తీర్పరిగా ఉన్నావు. 12 ధర్మశాస్త్రకర్త✽ ఒకడే. ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ✽ సమర్థుడు. ఇతరులకు✽ తీర్పు తీర్చడానికి✽ నీవెవరివి?
13 ✽“ఈవేళో రేపో ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ సంవత్సరం గడిపి వ్యాపారం చేస్తూ లాభం సంపాదించు కొంటాం” అని చెప్పుకొనేవారలారా, వినండి 14 ✽ రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ బ్రతుకు ఏపాటిది? అది కాసేపు కనబడి అంతలో అంతర్ధానమైపోయే ఆవిరిలాంటిది. 15 దీనికి బదులుగా మీరు ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇదీ అదీ చేస్తాం” అనాలి✽. 16 ఇప్పుడైతే మీరు డాంబికులై గర్వంగా మాట్లాడుకొంటున్నారు✽. అలాంటి గర్వమంతా చెడ్డది. 17 ✽ కాబట్టి తాను చేయవలసిన మంచి తెలిసి చేయని వాడికి అది పాపం.