3
1 ✽మనం ఉపదేశకులమైతే మరీ కఠినమైన తీర్పుకు గురి అవుతామని తెలిసి మీలో అనేకులు ఉపదేశకులు కాకండి. 2 ✽మనమందరమూ అనేక విషయాలలో తొట్రు పడుతున్నాం. ఎవరైనా తాను చెప్పేదానిలో తొట్రు పడకపోతే✽ అతడు ఏ లోపమూ లేని మనిషి, శరీరమంతా అదుపులో ఉంచుకోగల వ్యక్తి. 3 ✽గుర్రాలను లోపరచుకోవడానికి వాటి నోటికి కళ్ళెం పెట్టి దానితో వాటి శరీరమంతా త్రిప్పుతాం గదా. 4 ఓడల విషయం కూడా చూడండి. అవి ఎంతో పెద్దవి. బలమైన గాలి తాకిడికి కొట్టుకుపోయేవి. అయినా ఓడ నడిపేవాడు చాలా చిన్న చుక్కానితో తనకిష్టం వచ్చినట్టు వాటిని త్రిప్పుతాడు. 5 అలాగే శరీరంలో నాలుక చిన్న భాగమే గాని గొప్పలు చెపుతుంది. చూడండి, అంత చిన్న నిప్పురవ్వ ఎంత పెద్ద అడవిని తగలబెడుతుందో! 6 ✽నాలుక నిప్పు✽ లాంటిదే! అది మన అవయవాల్లో నాలుక ఎలాంటిదంటే అది పాపిష్ఠి ప్రపంచమే. శరీరాన్నంతా మాలిన్యం చేస్తుంది. జీవిత చక్రానికి నిప్పంటిస్తుంది. అదేమో నరకంచేతే రగులు కొంటుంది.7 ✽మనుషులు అన్ని రకాల మృగాలనూ పక్షులనూ ప్రాకే జంతువులనూ సముద్ర ప్రాణులనూ మచ్చిక చేసు కొంటున్నారు, చేసుకొన్నారు. 8 అయినా నాలుకను మచ్చిక చేసుకోవడం ఏ మనిషిచేతా కాదు. అది నెమ్మది లేని✽ చెడ్డది, ప్రాణాంతకమైన విషం✽తో నిండి ఉంది. 9 ✽దానితో మన తండ్రి✽ అయిన దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుని పోలికలో✽ ఉనికిలోకి వచ్చిన మనుషులను దానితో శపిస్తాం. 10 ఒకే నోటినుంచి స్తుతి, శాపం వెలువడతాయి. నా సోదరులారా, ఈ విధంగా ఉండకూడదు. 11 ✽ఒకే ఊటనుంచి తియ్యని నీళ్ళు, చేదు నీళ్ళు రెండూ ఊరుతాయా? 12 నా సోదరులారా, అంజూర చెట్టు ఆలీవ్‌పండ్లు, ద్రాక్షచెట్టు అంజూర పండ్లు కాయడం జరుగుతుందా? అలాగే ఒకే ఊటనుంచి ఉప్పు నీళ్ళు, తియ్యని నీళ్ళు రావు.
13 ✽✽మీలో ఎవరికి తెలివి, గ్రహింపు ఉన్నాయి? అలాంటి వ్యక్తి మంచి ప్రవర్తనచేత జ్ఞాన మూలమైన వినయంతో చేసిన క్రియలను కనుపరచాలి. 14 కాని, తీవ్రమైన అసూయ✽, కలహభావం మీ హృదయంలో ఉంటే అతిశయంగా మాట్లాడకండి, సత్యానికి వ్యతిరేకంగా అబద్ధం ఆడకండి. 15 ✽ఈ “జ్ఞానం” పైనుంచి దిగి వచ్చేది కాదు. ఇది ఇహలోక సంబంధమైనది, సహజసిద్దమైనది, దయ్యాలచేత కలిగేది. 16 ✽ఎందుకంటే అసూయ, కలహ భావం ఎక్కడ ఉన్నాయో అక్కడ అక్రమ పరిస్థితులు, ప్రతి విధమైన దురాచారం ఉంటాయి.
17 పైనుంచి✽ వచ్చే జ్ఞానం ముఖ్యంగా పవిత్రంగా✽ ఉండేది. అది శాంతికరమైనది, మృధువైనది, అణుకువ గలది, జాలితో మంచి ఫలాలతో నిండి ఉన్నది, పక్షపాతం లేనిది కపటం లేనిది. 18 ✽సమాధానం చేకూర్చేవారు సమాధానంతో విత్తినదానివల్ల నీతిన్యాయాల ఫలం కలుగుతుంది.