2
1 ✽నా సోదరులారా, మన ప్రభువూ మహిమ✽ స్వరూపీ అయిన యేసు క్రీస్తుమీది నమ్మకం విషయంలో పక్షపాతం లేకుండా ఉండండి. 2 బంగారు ఉంగరం పెట్టుకొని మేలి రకమైన బట్టలు తొడుక్కొన్నవాడు, మాసిన బట్టలు కట్టుకొన్న బీదవాడు – వీరిద్దరు మీ సభలోకి వస్తే, 3 ఒకవేళ మీరు మేలిరకమైన బట్టలు తొడుక్కొన్న మనిషిని అభిమానంతో చూస్తూ “తమరు ఇక్కడ ఈ మంచి చోట కూర్చోండి” అని చెప్పి బీదవానితో “నీవు అక్కడ నిలబడు” లేదా, “నా పాదపీఠం దగ్గర కింద కూర్చో” అని చెపితే, 4 మీలో మీరు భేదాలు చూపుతూ చెడ్డ ఉద్దేశాలతో నిర్ణయాలు చేసిన వారవుతారు గదా.5 ✽నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో ఉన్న బీదవారిని విశ్వాసం విషయంలో భాగ్యవంతులుగా, తనను ప్రేమించేవారికి✽ వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా✽ ఎన్నుకోలేదా? 6 మీరైతే బీదవాణ్ణి అవమానానికి గురి చేశారు. మిమ్ములను అణగద్రొక్కేదీ, న్యాయస్థానాలకు ఈడ్చుకుపోయేదీ ధనవంతులే గదా! 7 మీరు ఏ దివ్యమైన పేరునుబట్టి పిలువబడ్డారో✽ ఆ పేరును✽ దూషించేది కూడా వీరే గదా!
8 ✝లేఖనంలో “మిమ్ములను ప్రేమించుకొన్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి” అనేది రాజాజ్ఞ✽. దీన్ని మీరు నెరవేరుస్తూ ఉంటే, బాగానే ప్రవర్తిస్తూ ఉన్నారన్న మాటే. 9 కాని, మీరు పక్షపాతం✽ చూపుతూ ఉంటే మీరు పాపం చేస్తున్నారు. మీరు అతిక్రమకారులని ధర్మశాస్త్రం తీర్పు తీరుస్తుంది. 10 ✽ఎందుకంటే, ఎవరైనా ధర్మశాస్త్రమంతా పాటిస్తూ ఒక్క విషయంలో తప్పిపోతే ఆ వ్యక్తి ధర్మశాస్త్రమంతటిలో అపరాధి. 11 ✽ “వ్యభిచారం చేయకూడదు” అన్నవాడు “హత్య చేయకూడదు” అని కూడా చెప్పాడు. నీవు వ్యభిచరించకపోయినా హత్య చేస్తే ధర్మశాస్త్రాన్ని మీరిన వాడివవుతావు.
12 విముక్తి✽ నియమం ప్రకారం తీర్పు పొందబోయే✽వారికి తగినట్టుగా మాట్లాడండి, ప్రవర్తించండి. 13 ✝కరుణ చూపని వ్యక్తికి కరుణ లేకుండా తీర్పు జరుగుతుంది. కరుణ తీర్పు మీద గెలుపొంది అతిశయిస్తుంది.
14 నా సోదరులారా, ఎవరైనా క్రియలు లేనప్పుడు తనకు నమ్మకం ఉంది అని చెపితే ఏమి ప్రయోజనం? అలాంటి నమ్మకం ఆ వ్యక్తిని రక్షించగలదా?✽ 15 ✽ఎవరైనా ఒక సోదరుడు గానీ సోదరి గానీ బట్టలూ, రోజూ కావలసిన ఆహారమూ లేకుండా ఉన్న పక్షంలో 16 మీలో ఎవరైనా వారికి శరీర అవసరాలను తీర్చకుండా “క్షేమంగా వెళ్ళు, చలి కాచుకో, తృప్తిగా తిను” అని చెపితే ఏమి ప్రయోజనం? 17 అలాగే క్రియలు లేని నమ్మకం ఒంటరిదై నిర్జీవంగా ఉంది.
18 ✽కాని, ఎవరైనా “మీకేమో నమ్మకం ఉంది. నాకు క్రియలున్నాయి” అనవచ్చు. నీ క్రియలు లేకుండా నీ నమ్మకాన్ని నాకు చూపెట్టు. నేను నా క్రియలచేతే నా నమ్మకాన్ని చూపిస్తాను. 19 ✽ఒకే దేవుడున్నాడని నీవు నమ్ముతున్నావు. నీవలా నమ్మడం మంచిదే గానీ దయ్యాలు కూడా అది నమ్ముతాయి, నమ్మి వణుకుతాయి.
20 తెలివితక్కువవాడా✽! క్రియలు లేని నమ్మకం నిర్జీవమని✽ తెలుసుకోవడానికి నీకిష్టం ఉందా?
21 ✽✝మన పూర్వీకుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలివేధికమీద సమర్పించినప్పుడు క్రియలవల్ల న్యాయవంతుల లెక్కలోకి రాలేదా? 22 ✽అతని క్రియలతో నమ్మకం పని చేసిందనీ, క్రియల ద్వారా నమ్మకం పరిపూర్ణమయిందనీ గమనించారా! 23 ✽ ఈ లేఖనం నెరవేరింది కూడా – అబ్రాహాము దేవునిమీద నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే అతనికి నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది. అంతేగాక, అతనికి దేవుని స్నేహితుడని✽ పేరు వచ్చింది. 24 ✽మనిషి నమ్మకం ద్వారా మాత్రమే గాక క్రియల ద్వారా కూడా న్యాయవంతుల లెక్కలోకి వస్తాడని మీరు గ్రహిస్తున్నారు గదా.
25 ✽ వేశ్య రాహాబు సంగతి కూడా అంతే గదా. పంపబడ్డవారిని ఆమె స్వీకరించి వేరే దారిన వారిని పంపివేసినప్పుడు క్రియల మూలంగా న్యాయవంతుల లెక్కలోకి రాలేదా? 26 ✽ప్రాణం లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని నమ్మకమూ మృతమే.