యాకోబు లేఖ
1
1 విదేశాల్లో చెదిరిపోయిన పన్నెండు గోత్రాలకు✽ యాకోబు✽ అభివందనాలతో రాస్తున్న విషయాలు. నేను దేవునికీ ప్రభువైన✽ యేసుక్రీస్తుకూ దాసుణ్ణి.2 ✽నా సోదరులారా, వివిధమైన విషమ పరీక్షలలో మీరు పడేటప్పుడెల్లా అదంతా ఆనందంగా ఎంచుకోండి.
3 క్రీస్తుమీది మీ నమ్మకాన్ని పరీక్షించడం మీకు సహనం✽ కలిగిస్తుందని మీకు తెలుసు గదా. 4 మీరు ఆధ్యాత్మికంగా పెరిగి సంపూర్ణత పొంది ఏ విషయంలోనూ కొదువ లేనివారై ఉండేలా సహనం తన పని పూర్తి చేయనివ్వండి.
5 ✽మీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉంటే దేవుణ్ణి అడగాలి. అప్పుడది ఆ వ్యక్తికి ఇవ్వబడుతుంది✽. దేవుడు నిందించకుండా✽ అందరికీ ధారాళంగా✽ ఇచ్చేవాడు.
6 అయితే ఆ వ్యక్తి అనుమానమేమీ లేకుండా✽ నమ్మకంతో అడగాలి. అనుమానించే వ్యక్తి గాలికి ఎగిరిపడి కొట్టుకుపోయే సముద్రం అలలాంటివాడు. 7 ఆ మనిషి చపలచిత్తుడు, తన ప్రవర్తన అంతటిలో నిలకడ లేనివాడు. 8 గనుక తనకు ప్రభువువల్ల ఏమైనా దొరుకుతుందని అతడు అనుకోకూడదు.
9 గౌరవం లేని సోదరుడు తన ఉన్నత స్థాయి✽ని బట్టి అతిశయించాలి. 10 ఆస్తిపరుడైన సోదరుడు తనకు వచ్చిన అగౌరవాన్ని✽ బట్టి అతిశయించాలి. ఎందుకంటే ఇతడు గడ్డిపువ్వులాగా గతించిపోతాడు. 11 ✝మాడ్చివేసే వేడితో ప్రొద్దు ఎక్కుతుంది, గడ్డిని ఎండిపోచేస్తుంది. గడ్డిపువ్వు రాలి దాని అందం పాడవుతుంది. అలాగే ఆస్తిపరుడు తన వ్యవహారాలలో నీరసించిపోతాడు.
12 విషమపరీక్షను ఓర్చుకొనే మనిషి ధన్యజీవి✽. ఎందుకంటే అతడు పరీక్షకు నిలిచి మెప్పు పొందిన తరువాత అతనికి జీవ కిరీటం✽ లభిస్తుంది. ప్రభువు తనను ప్రేమించేవారికి✽ దానిని వాగ్దానం చేశాడు.
13 ✽ఎవరికైనా దుష్ట ప్రేరేపణ✽ వస్తే ఆ వ్యక్తి “ఈ దుష్ట ప్రేరేపణ దేవుడు నాకు కలిగిస్తున్నాడు” అనకూడదు. ఎందుకంటే, దుర్మార్గత చేయడానికి దేవునికి ప్రేరేపణ కలగడం అసాధ్యం. అలాంటి ప్రేరేపణ ఎవరికీ కలిగించడు కూడా. 14 ✽ప్రతి ఒక్కరూ తన కోరికలు తనను ఆకర్షించి ఈడ్వడంవల్లే దుష్ట ప్రేరేపణకు గురి కావడం జరుగుతుంది. 15 ✽కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి చావును కంటుంది. 16 నా ప్రియ సోదరులారా, మోసపోకండి✽.
17 ✽ప్రతి మంచి ఈవీ, పరిపూర్ణమైన ప్రతి ఉచిత వరమూ పైనుంచే వస్తాయి, జ్యోతులకు కర్త ✽ అయిన తండ్రినుంచే వస్తాయి. ఆయన విషయంలో మార్పు✽, భ్రమణ ఛాయలు అంటూ ఏమీ లేవు. 18 తన సృష్టిలో మనం తొలి పంట✽గా ఉండాలని తన సంకల్పం ప్రకారం తన సత్యవాక్కు✽ద్వారా మనకు నూతన జన్మం✽ కలిగించాడు.
19 ✽అందుచేత నా ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరూ వినడానికి✽ ఆతురంగా, మాట్లాడడానికీ✽ కోపగించడానికీ✽ నిదానంగా ఉండాలి. 20 ఎందుకంటే మనిషి కోపం దేవుని న్యాయాన్ని సాధించదు. 21 అందుచేత సమస్తమైన మాలిన్యం, మిగిలి ఉన్న దుష్టత్వాన్ని విసర్జించి✽ లోపల నాటుకొన్న వాక్కును✽ అణుకువతో స్వీకరించండి. అది మీ ఆత్మలను రక్షించే శక్తిగలది.
22 ✽వాక్కు ప్రకారం ప్రవర్తిస్తూ ఉండండి. దానిని ఊరికే విని మిమ్ములను మీరే మోసగించుకోకండి. 23 వాక్కు విని దాని ప్రకారం ప్రవర్తించని వ్యక్తి అద్దం✽లో తన ముఖం ఉన్నది ఉన్నట్టే చూచుకొనేవాడిలాగా ఉన్నాడు. 24 అతడు తనను చూచుకొని అవతలికి వెళ్ళిన వెంటనే తానెలాంటివాడో మరచి పోతాడు. 25 ✽కానీ పరిపూర్ణ విముక్తి నియమంలోకి పరీక్షగా చూస్తూ తాను విన్నది మరవకుండా ఆచరణలో పెడుతూ ఉన్న వ్యక్తికి తాను చేస్తున్న దానిమీద దీవెన కలుగుతుంది.
26 ✽ మీలో ఎవరైనా తాను మత నిష్ఠ గలవాణ్ణి అనుకొంటూ నాలుకను అదుపులో ఉంచుకోకుండా తన హృదయాన్ని తానే మోసగించుకొంటే అతడి మతం వట్టిదే! 27 ✽తండ్రి అయిన దేవుని దృష్టిలో కళంకం లేని పవిత్రమైన మతనిష్ఠ ఇదే – అనాథ పిల్లలనూ విధవరాండ్రనూ వారి కష్టాలలో సందర్శించి సహాయం చేయడం, లోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకోవడం.