5
1 ఇదిగో వినండి, ఆస్తిపరులారా! మీమీదికి వచ్చే కడగండ్లను గురించి రోదనం చేయండి, ఏడ్వండి! 2 మీ ఆస్తి మురిగిపోయింది. మీ వస్త్రాలు చిమ్మెటలు కొట్టాయి. 3 మీ వెండి బంగారాలకు తుప్పు పట్టింది. వాటి తుప్పు మీమీద విరుద్ధ సాక్ష్యం పలుకుతూ ఉండి నిప్పులాగా మీ శరీరాలను తినివేస్తుంది. మీరు ధనం పోగు చేసుకొన్నది చివరి రోజులలోనే! 4 ఇదిగో వినండి. మీ పొలాల పంట కోసినవారికి మీరు కూలి ఇవ్వకుండా వంచనతో బిగబట్టారు. ఆ కూలి కేకలు వేస్తూ ఉంది. కోతవారి మొరలు సేనలప్రభువు చెవులకు చేరాయి. 5 మీరు భూమిమీద సుఖంగా విలాసాసక్తితో బ్రతికారు. వధ సమయంలో ఉన్నట్టు మీ హృదయాలను కొవ్వబెట్టుకొన్నారు. 6 న్యాయవంతుణ్ణి నేరస్థాపనకు గురి చేశారు, చంపారు. అతడు మిమ్ములను ఎదిరించినవాడు కాదు.
7 అయితే సోదరులారా, ప్రభువు వచ్చేంతవరకు ఓర్పుతో ఉండండి. చూడండి, రైతు తొలకరి వాన, కడవరి వాన వచ్చేవరకు విలువైన ఫలసాయం కోసం ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాడు. 8 ప్రభువు రాకడ సమీపంగా ఉంది గనుక మీరు కూడా ఓర్పుతో ఉండండి. మీ మనసులను దిటవు చేసుకోండి. 9 సోదరులారా, మీకు శిక్షావిధి రాకుండా ఒకరిమీద ఒకరు సణుక్కోకండి. ఇదిగో వినండి, న్యాయమూర్తి తలుపుదగ్గరే నిలుచున్నాడు.
10 నా సోదరులారా, కీడులకు గురి అయి ఓపికతో సహించే విషయంలో, ప్రభువు పేర పలికిన ప్రవక్తలను ఆదర్శంగా తీసుకోండి. 11 సహించినవారిని ధన్యులని పరిగణిస్తున్నాం గదా. యోబు ఓర్పును గురించి మీరు విన్నారు. తుదకు ప్రభువు వల్ల కలిగిన ఫలితం – ప్రభువు కరుణామయుడు, ఎంతో జాలి గలవాడని చూశారు.
12  నా సోదరులారా, చాలా ముఖ్యమైన విషయం ఏమంటే, ఆకాశంతోడని గానీ భూమితోడని గానీ మరి దేనితోడని గానీ ఒట్టు పెట్టుకోకండి. మీమీదికి తీర్పు రాకుండా మీరు చెప్పేది అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండేలా చేయండి.
13 మీలో ఎవరైనా కష్టాలలో ఉన్నారా? ఆ వ్యక్తి ప్రార్థన చేయాలి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఆ వ్యక్తి స్తుతి గీతాలు పాడాలి. 14 మీలో ఎవరికైనా జబ్బు చేసిందా? ఆ వ్యక్తి క్రీస్తు సంఘం పెద్దలను పిలిపించుకోవాలి. వారు ప్రభువు పేర ఆ వ్యక్తి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. 15 నమ్మకంతో చేసే ప్రార్థన రోగిని రక్షిస్తుంది. ప్రభువు ఆ వ్యక్తిని లేపుతాడు. ఆ వ్యక్తి పాపాలు చేసి ఉంటే అతనికి క్షమాపణ దొరుకుతుంది.
16 ఒకరితో ఒకరు మీ అతిక్రమాలు ఒప్పుకోండి. మీకు ఆరోగ్యం చేకూరేలా ఒకరికోసం ఒకరు ప్రార్థన చేయండి. న్యాయవంతుని ప్రార్థన పని చేయడంలో చాలా ప్రభావంగలది, ఫలవంతమైనది.
17 ఏలీయా మనలాంటి స్వభావం గలవాడే. వాన కురియకూడదని అతడు మనసారా ప్రార్థించాడు. మూడున్నర సంవత్సరాలపాటు ఆ దేశంలో వాన పడలేదు. 18 మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వాన కురిపించింది, భూమి దాని పంట ఇచ్చింది.
19 సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తప్పిపోతే, మరొకరు ఆ వ్యక్తిని సత్యానికి మళ్ళిస్తే ఇది తెలుసుకోవాలి: 20 పాపిని తన తప్పుదారినుంచి మళ్ళించేవాడు ఆ మనిషి ఆత్మను చావునుంచి రక్షించి విస్తారమైన పాపాలను కప్పివేస్తాడు.