12
1 ఇంత పెద్ద సాక్షి సమూహం మేఘంలాగా మన చుట్టూ ఆవరించి ఉన్నారు గనుక మనలను ఆటంకపరిచే ప్రతిదాన్నీ, సుళువుగా చిక్కులుపెట్టే పాపాన్నీ త్రోసిపుచ్చి యేసువైపు చూస్తూ మన ముందున్న పందెంలో ఓర్పుతో పరుగెత్తుదాం. 2 నమ్మకానికి కర్త, దానిని అంతం వరకు కొనసాగించేవాడు ఆయనే. ఆయన తన ముందున్న ఆనందంకోసం సిలువను ఓర్చుకొని ఆ అవమానాన్ని తృణీకరించి దేవుని సింహాసనం కుడి ప్రక్కన కూర్చున్నాడు. 3 మీ ప్రాణాలకు అలసట, నిరుత్సాహం కలగకుండా పాపాత్ములవల్ల కలిగిన మొత్తం వ్యతిరేకత ఓర్చుకున్న ఆయనను బాగా తలపోయండి.
4 పాపంతో పెనుగులాడడంలో మీ రక్తం చిందేటంతగా మీరింకా దానికి ఎదురాడలేదు. 5 అంతేగాక, కొడుకులతో చెప్పినట్టు మీతో చెప్పిన ప్రోత్సాహం మరచిపోయారు. అదేమిటంటే, నా కుమారా, ప్రభువు ఇచ్చే శిక్షను చిన్న చూపు చూడకు. ఆయన మందలింపుకు నిరుత్సాహపడకు. 6 తాను ప్రేమించేవారిని ప్రభువు శిక్షిస్తాడు, స్వీకరించిన ప్రతి కొడుకునూ కొరడా దెబ్బలకు గురి చేస్తాడు.
7 మీరు శిక్ష ఓర్చుకొంటూ ఉన్నారా, దేవుడు కొడుకులనుగా మిమ్మును చూస్తున్నాడన్న మాట. తండ్రి శిక్షించని కొడుకు ఎవడు? 8 కొడుకులందరికీ శిక్ష వచ్చేది. ఒకవేళ మీకు రాలేదు అంటే మీరు కొడుకులు కారు గాని అక్రమ సంతానం లాంటివారు. 9 అంతేకాదు, శారీరకంగా మనలను శిక్షించిన తండ్రులు మనకు ఉండేవారు, వారిని గౌరవించాం. అంతకంటే ముఖ్యంగా ఆత్మల తండ్రికి లోబడుతూ తద్వారా బ్రతుకుతూ ఉండాలి గదా. 10 వారేమో తమకు తోచిన విధానం ప్రకారం కొద్ది కాలం మనలను శిక్షించారు. దేవుడైతే మనం తన పవిత్రతలో పాల్గొనాలని మన మేలుకే శిక్షిస్తాడు.
11 ఏదైనా శిక్ష జరుగుతూ ఉంటే అది దుఃఖకరమే అనిపిస్తుంది గాని సంతోషకరం కాదు. అయినా దానివల్ల శిక్షణ పొందినవారికి తరువాత అది శాంతితో కూడిన న్యాయశీలం అనే ఫలం ఇస్తుంది. 12 అందుచేత దించిన చేతులను, దుర్బలమైన మోకాళ్ళకు బలం చేకూర్చుకోండి. 13 కుంటికాలు బెణకకుండా కుదురుబడేలా మీ పాదాలకు తిన్నని త్రోవలు చేసుకోండి.
14 అందరితో సమాధానం, పవిత్రత మీకు ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. పవిత్రత లేకుండా ఎవరూ ప్రభువును చూడరు. 15 మీలో దేవుని కృపను అందుకోని వ్యక్తి ఎవరూ ఉండకుండా, ఏదైనా చేదు వేరు మొలిచి కలత పెట్టడంచేత అనేకులు అపవిత్రం కాకుండా జాగ్రత్తగా చూచుకోండి. 16 ఒక్క పూట తిండికోసం తన జన్మహక్కును అమ్మివేసిన ఏశావులాంటి వ్యభిచారి గానీ అపవిత్రుడు గానీ మీలో ఉండకుండా చూచుకోండి. 17 తరువాత ఆ దీవెన కావాలని ఏశావు ఆశించినా అతడు నిరాకరణకు గురి అయిన సంగతి మీకు తెలుసు. తన తండ్రి మనసు మార్చాలని అవకాశంకోసం కన్నీళ్ళతో మనసారా వెదికినా అలాంటిదేమీ అతడికి లభించలేదు.
18 మీరు చేరినది తాకగల పర్వతానికి కాదు. మండుతూ ఉన్న మంటలు, కారు మబ్బులు, దట్టమైన చీకటి, తుఫాను ఉన్న దానికి కాదు. 19 బూరధ్వనికి, మాటల ధ్వనికి మీరు రాలేదు. ఆ మాటల ధ్వని విన్నవారు మరే మాటా తమతో చెప్పవద్దని బతిమాలుకొన్నారు. 20 “జంతువైనా ఈ పర్వతాన్ని తగిలితే దానిని రాళ్ళతో కొట్టి లేదా, బాణం వేసి చంపాలి” అనే ఆజ్ఞను వారు ఓర్చుకోలేకపోయారు.
21 ఆ దృశ్యం ఎంత భయంకరం అంటే మోషే “ఎంతో భయంతో వణుకుతున్నాను” అన్నాడు.
22 గానీ మీరు వచ్చినది సీయోను పర్వతానికి, పరలోకంలోని జెరుసలం అనే సజీవుడైన దేవుని నగరానికి, వేలాదివేలమంది దేవదూతల దగ్గరకు, 23 ప్రముఖుడైన క్రీస్తుసంఘానికి (ఈ సంఘ సభ్యుల పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయి), వారి మహోత్సవ సభకు, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకు, పరిపూర్ణ స్థితి పొందిన న్యాయవంతుల ఆత్మల దగ్గరకు, 24 కొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే మరీ శ్రేష్ఠమైనవాటిని తెలియజేసే ప్రోక్షణ రక్తం దగ్గరకు.
25 మాట్లాడుతున్నవాణ్ణి నిరాకరించకుండా చూచుకోండి. భూమిమీద హెచ్చరించిన ఈయనను నిరాకరించినవారు తప్పించుకోలేకపోతే పరలోకంనుంచి హెచ్చరించే ఈయనను విడిచిపెట్టిపోతే మనం తప్పించుకోలేమనేది మరీ నిశ్చయం గదా! 26 అప్పుడు ఆయన స్వరం భూమిని కదిలించింది. ఇప్పుడైతే ఆయన వాగ్దానం ఇలా ఉంది: మరోసారి నేను భూమిని మాత్రమే గాక ఆకాశాన్ని కూడా కదిలిస్తాను.
27  “మరో సారి” అనే మాట ఏమి సూచిస్తుందంటే, కదిలించబడలేనివి మిగిలేలా కదిలించబడ్డ వాటిని – అంటే సృజించబడ్డవాటిని – తీసివేయడమే.
28 అందుచేత, కదిలించబడలేని రాజ్యం మనకు లభించే కారణంగా దేవునికి భయభక్తులతో అంగీకారమైన సేవ చేసేలా కృప కలిగి ఉందాం. 29 ఎందుకంటే మన దేవుడు దహించివేసే జ్వాలలాంటివాడు.