13
1 ✝సోదర ప్రేమ చూపుతూ ఉండండి. 2 ✝పరాయివారికి అతిథి సత్కారం చేసే విషయం మనసులో ఉంచండి. దానివల్ల కొందరు తెలియకుండానే దేవదూతలకు✽ ఆతిథ్యం చేశారు. 3 ✽ ఖైదులో ఉన్నవారితో కూడా మీరు ఖైదీలై ఉన్నట్టే వారిని జ్ఞాపకముంచుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు గనుక దౌర్జన్యానికి గురి అయినవారిని తలచుకోండి. 4 వివాహమంటే అందరి విషయంలో మాననీయం✽, దాంపత్యం పవిత్రం. అయితే జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు✽ తీరుస్తాడు.
5 మీ జీవిత విధానం డబ్బు మీది వ్యామోహం✽ లేకుండా ఉండాలి. కలిగినదానితోనే తృప్తిపడుతూ✽ ఉండండి. ఎందుకంటే, ప్రభువు తానే ఇలా అన్నాడు: నేను నిన్ను ఎన్నడూ చెయ్యి విడువను✽, ఎన్నడూ వదలిపెట్టను. 6 ✽ అందుచేత మనం “ప్రభువే నాకు సహాయం చేసేవాడు. నాకు భయం ఉండదు. మానవ మాత్రులు నాకేం చేయగలరు?” అని ధైర్యంతో చెప్పగలం.
7 మీకు దేవుని వాక్కు చెప్పి నాయకులు✽గా ఉన్నవారిని మనసులో ఉంచుకోండి. వారి జీవిత విధాన ఫలితం తలపోస్తూ వారి విశ్వాస మార్గాన్ని అనుసరించండి✽.
8 ✽యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరమూ ఒక్కటే రీతిగా ఉన్నాడు.
9 ఆయా రకాల విపరీత ఉపదేశాలకు✽ కొట్టుకుపోకండి. భోజనాల గురించిన కట్టుబాట్ల వల్ల గాక, దేవుని కృపవల్లే హృదయం సుస్థిరం కావడం మేలు. ఆ భోజనాలను బట్టి ప్రవర్తించేవారికి ప్రయోజనమేమీ కలగలేదు. 10 మనకు బలిపీఠం✽ ఒకటి ఉంది. దీనికి సంబంధించిన దానిని తినడానికి ఆరాధన గుడారంలో సేవ చేసేవారికి హక్కు లేదు. 11 ✽ఎందుకంటే ప్రముఖయాజి ఏ జంతువుల రక్తాన్ని పాపంకోసమైన అర్పణగా పవిత్రస్థలంలోకి తెస్తాడో ఆ జంతువుల కళేబరాలను శిబిరం బయట కాల్చివేయడం జరిగేది. 12 అందుచేత, యేసు కూడా స్వరక్తం వల్ల తన ప్రజలను పవిత్రపరచడానికి✽ నగర ద్వారం వెలుపల✽ బాధల పాలయ్యాడు.
13 కాబట్టి మనం ఆయన నింద భరిస్తూ✽ శిబిరం బయటికి✽ ఆయన దగ్గరకు వెళ్ళిపోదాం. 14 ఎప్పటికీ నిలిచి ఉండే నగరం✽ ఇక్కడ మనకు లేదు గాని వచ్చే నగరం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. 15 ✽కనుక ఆయనద్వారా దేవునికి స్తుతి✽ యజ్ఞం – అంటే ఆయన పేరును ఒప్పుకొనే నోటి ఫలం – మనమెప్పుడూ అర్పిస్తూ ఉందాం. 16 ఉపకారాలూ✽ దానధర్మాలూ✽ చేయడం మరవకండి. ఇలాంటి యజ్ఞాలంటే దేవునికి ఇష్టమే.
17 మీ సంఘ నాయకుల మాట విని వారికి లోబడండి✽. ఎందుకంటే, వారు లెక్క✽ అప్పచెప్పవలసినవారుగా మీ ఆత్మలకు కావలి కాస్తున్నారు. వారు ఈ పని దుఃఖంతో చేస్తే అది మీకు ప్రయోజనం ఉండదు. కనుక వారు ఈ పనిని దుఃఖంతో కాకుండా ఆనందంతో చేసేలా వారి మాట వినండి.
18 మాకు మంచి అంతర్వాణి✽ ఉందనీ మేము అన్ని విషయాలలో యోగ్యంగా ప్రవర్తించడానికి కోరుతున్నామనీ మా గట్టి నమ్మకం గనుక మాకోసం ప్రార్థన చేయండి. 19 ✝నేను మీ దగ్గరకు ఇంకా త్వరలో వచ్చేలా ఈ విధంగా చేయాలని మిమ్ములను మరీ ఎక్కువగా వేడుకొంటున్నాను.
20 శాశ్వతమైన ఒడంబడిక రక్తం✽ ద్వారా మన ప్రభువైన యేసును – గొర్రెలకు ఆ గొప్ప కాపరి✽ని – చనిపోయిన✽వారిలో నుంచి లేపిన శాంతిప్రదాత దేవుడు✽ 21 ✽ప్రతి మంచి విషయంలో తన సంకల్పం నెరవేర్చడానికి మిమ్ములను పూర్తిగా సంసిద్ధులను చేస్తాడు గాక! యేసు క్రీస్తు ద్వారా తనకు ప్రీతికరమైనవాటిని మీ లోపల జరిగిస్తాడు గాక! యేసు క్రీస్తుకు యుగయుగాలకు మహిమ కలుగుతుంది గాక! తథాస్తు!
22 సోదరులారా, నేను మీకు క్లుప్తంగా రాశాను. ఈ ప్రోత్సాహ వాక్కు✽ ఓపికతో స్వీకరించండని మిమ్ములను వేడుకొంటున్నాను.
23 ✽మన సోదరుడు తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతడు త్వరలో వస్తే అతనితోకూడా వచ్చి మిమ్ములను చూస్తాను. 24 మీ నాయకులందరికీ, పవిత్రులందరికీ మా అభివందనాలు చెప్పండి. ఇటలీ దేశంవారు మీకు అభివందనాలు చెపుతున్నారు.
25 మీకందరికీ కృప✽ తోడై ఉంటుంది గాక. తథాస్తు.