11
1 నమ్మకం✽ అనేది ఆశతో ఎదురు చూచేవాటిని గురించిన నిశ్చయత, కంటికి కనిపించనివాటిని గురించిన నిర్థారణ. 2 దీన్ని బట్టే పూర్వీకుల✽ గురించి మంచి సాక్ష్యం ఇవ్వడం జరిగింది.3 ✽లోకం, దాని యుగాలు దేవుడు చెప్పిన మాట మూలంగానే రూపొందాయనీ కంటికి కనిపించేది కనిపించే వస్తువులతో నిర్మించబడలేదనీ నమ్మకంవల్లే గ్రహిస్తున్నాం.
4 ✽నమ్మకంవల్లే హేబెలు✽ కయీను అర్పించినదానికంటే మంచి బలి అర్పించాడు. ఆ నమ్మకాన్ని బట్టి అతడు న్యాయవంతుడనే✽ సాక్ష్యం పొందాడు, అతని అర్పణలను గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు, అతడు చనిపోయినా ఆ నమ్మకంద్వారా ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు.
5 ✽నమ్మకంవల్లే హనోకు చనిపోకుండా కొనిపోబడ్డాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనిపించకుండా పోయాడు. ఎందుకని? అతడంటే దేవునికి సంతోషమని అతడు కొనిపోబడకముందు అతని గురించిన సాక్ష్యం ఉన్నది.
6 నమ్మకం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం✽. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తి దేవుడు ఉన్నాడనీ ఆయనను మనసారా వెదికేవారికి✽ ప్రతిఫలమిస్తాడనీ నమ్మితీరాలి.
7 ✽నమ్మకంవల్లే నోవహు, అదివరకు కనిపించని సంగతులను గురించి దేవుని హెచ్చరిక విని భయభక్తులవల్ల✽ ప్రేరణ కలిగి తన ఇంటివారి✽ రక్షణకోసం ఒక ఓడ తయారు చేశాడు. దీని ద్వారా లోకం శిక్షకు తగినదని తీర్పుతీర్చాడు✽. నమ్మకం వల్ల కలిగే నీతిన్యాయాలకు✽ వారసుడు అయ్యాడు.
8 ✽✽ నమ్మకంవల్లే అబ్రాహాము తరువాత తనకు వారసత్వంగా కలిగే ప్రాంతానికి వెళ్ళిపోయేందుకు దేవుని పిలుపు వచ్చినప్పుడు విధేయుడయ్యాడు. తానెక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియకుండానే బయలుదేరాడు. 9 ✽ నమ్మకం వల్లే అతడు వాగ్దత్త దేశంలో పరాయి దేశంలో ఉన్నట్టే విదేశీయుడుగా నివసించాడు. అలాగే అతడు ఆ వాగ్దానానికి సాటి వారసులైన ఇస్సాకు, యాకోబులతో డేరాలలో కాపురమున్నాడు. 10 ఎందుకంటే, దేవుడు ఏ నగరానికి వాస్తు శిల్పి, నిర్మాత అయి ఉన్నాడో పునాదులున్న ఆ నగరంకోసం అతడు ఎదురు చూస్తూ ఉండేవాడు.
11 ✽ నమ్మకంవల్లే శారా కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైనవాడని భావించుకొని తనకు వయస్సు ఉడిగినా గర్భవతి కావడానికి బలం పొంది శిశువును కన్నది. 12 అందుచేత మృత తుల్యుడైన ఒకే పురుషునికి లెక్కకు ఆకాశ నక్షత్రాలలాగా, సముద్ర తీరంలోని అగణ్యమైన ఇసుక రేణువులలాగా సంతానం కలిగారు.
13 ✽వీరంతా నమ్మకంతో ఉండి చనిపోయారు. వాగ్దానాల నెరవేర్పు అనుభవించకుండానే వాటిని దూరంనుంచి చూస్తూ వాటి గురించిన నిశ్చయత కలిగి స్వాగతం చెప్పారు. తాము భూమిమీద పరాయివారం✽, యాత్రికులం అని ఒప్పుకొన్నారు. 14 ఈ విధంగా చెప్పేవారు తమది అంటూ ఒక దేశాన్ని వెదకుతున్నామని తేటతెల్లం చేస్తున్నారు. 15 వారు ఏ దేశాన్ని విడిచి వచ్చారో దాన్ని గురించి ఆలోచించుకొనేవారైతే అక్కడికి తిరిగి వెళ్ళే అవకాశం వారికి దొరికి ఉండేది. 16 కానీ వారు కోరినది దానికంటే శ్రేష్ఠమైన దేశం, పరలోక దేశం. వారి కోసం దేవుడు ఒక నగరం తయారు చేశాడు గనుక తాను వారి దేవుణ్ణనిపించుకోవడానికి ఏమీ సిగ్గుపడడు.
17 ✽ నమ్మకంవల్లే అబ్రాహాము, పరీక్షకు గురి అయినప్పుడు, ఇస్సాకును సమర్పించాడు – వాగ్దానాలు అందినవాడు తన ఏకైక కుమారుణ్ణి సమర్పిస్తూ ఉన్నాడు. 18 అతని విషయంలో “ఇస్సాకుమూలంగా కలిగే సంతానమే నీ సంతానం అనిపించుకొంటారు” అని చెప్పబడింది. 19 దేవుడు అతణ్ణి చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపగలడని అబ్రాహాము ఎంచాడు. అలంకార రూపంలో చెప్పాలంటే మరణంలోనుంచి సజీవంగా ఇస్సాకును అతడు మళ్ళీ తీసుకొన్నాడు కూడా.
20 ✽ నమ్మకంవల్లే ఇస్సాకు రాబోయే వాటిని గురించి యాకోబును, ఏశావును దీవించాడు.
21 ✽ నమ్మకంవల్లే యాకోబు మరణావస్థలో ఉన్నప్పుడు యోసేపు కొడుకులను ఒక్కొక్కరిని దీవించాడు. తన చేతికర్ర మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించాడు.
22 నమ్మకంవల్లే యోసేపు మరణావస్థలో ఉన్నప్పుడు ఇస్రాయేల్ సంతతివారు వెళ్ళిపోవడం గురించి మాట్లాడి తన ఎముకలను గురించి ఆదేశించాడు.
23 ✽ నమ్మకంవల్లే మోషే తల్లిదండ్రులు, అతడు పుట్టినప్పుడు సుందరుడని చూచి, అతణ్ణి మూడు నెలలు దాచిపెట్టారు. రాజాజ్ఞ అంటే వారికి భయం లేదు.
24 ✽ ✽నమ్మకంవల్లే మోషే, పెద్దవాడయిన తరువాత ఈజిప్ట్ చక్రవర్తి కూతురి కుమారుడని అనిపించుకోవడానికి నిరాకరించాడు. 25 కొద్ది కాలం పాపంలోని సుఖభోగాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడానికే అతడు కోరుకొన్నాడు. 26 దేవుడిచ్చే ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఈజిప్ట్‌లోని నిధులకంటే క్రీస్తును గురించిన నింద మహా ఐశ్వర్యమని ఎంచుకొన్నాడు. 27 నమ్మకంవల్లే అతడు చక్రవర్తి కోపానికి భయపడక✽ ఈజిప్ట్ విడిచి వెళ్ళిపోయాడు. కంటికి కనబడని దేవుణ్ణి చూస్తూ ఉన్నట్టే అంతా ఓర్చుకొన్నాడు.
28 ✽ నమ్మకంవల్లే అతడు పస్కానూ రక్త ప్రోక్షణనూ ఆచరించాడు. జ్యేష్ఠులను సంహరించినవాడు ఇస్రాయేల్ ప్రజలను ముట్టకుండా చేయడానికి అలా జరిగించాడు.
29 ✽ నమ్మకంవల్లే వారు ఎర్ర సముద్రం గుండా ఆరిన నేలమీద నడిచినట్టే వెళ్ళిపోయారు. ఈజిప్ట్‌వారు అలా చేయడానికి పూనుకొని మునిగి చచ్చారు.
30 ✽ నమ్మకంవల్లే వారు ఏడు రోజులు యెరికో పట్టణం చుట్టూ తిరిగిన తరువాత దాని గోడలు కూలిపోయాయి.
31 ✽ నమ్మకంవల్లే వేశ్య అయిన రాహాబు గూఢచారులను శాంతితో స్వాగతం చెప్పినందుచేత అవిశ్వాసులతో కూడా నాశనం కాలేదు.
32 ✽ఇక ఏం చెప్పను? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు కూడా – వీరిని గురించీ ప్రవక్తలను గురించీ వివరంగా చెప్పడానికి నాకు సమయం చాలదు. 33 ✽నమ్మకంవల్లే వీరు రాజ్యాలను✽ జయించారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహాల✽ నోళ్ళు మూశారు, 34 మంటల✽ తీవ్రత ఆర్పివేశారు, కత్తివాత పడకుండా తప్పించుకొన్నారు, బలహీనతలో నుంచి బలవంతులయ్యారు✽, యుద్ధంలో వీరులయ్యారు, విదేశీ సైన్యాలను పరుగులెత్తించారు.
35 స్త్రీలు చనిపోయిన✽ తమవారు సజీవంగా లేవడం ద్వారా వారిని స్వీకరించారు. మరి కొందరైతే ఇంకా శ్రేష్ఠమైన పునర్జీవితం✽ పొందాలని చిత్ర హింసలకు గురి అయి విడుదల నిరాకరించారు✽. 36 మరి కొందరు వెక్కిరింపులూ కొరడాదెబ్బలూ, అవును, సంకెళ్ళూ ఖైదులూ✽ కూడా అనుభవించారు. 37 వారు రాళ్ళ దెబ్బలు✽ తిన్నారు, రంపాలతో రెండుగా కోయబడ్డారు✽, విషమ పరీక్షలకు గురి అయ్యారు, కత్తివాతకు గురై హతమయ్యారు, నిరుపేదలై✽ బాధలకూ చిత్ర హింసలకూ గురి అయి గొర్రె చర్మమో మేక చర్మమో వేసుకొని తిరుగాడారు, 38 ✽ఎడారులలోనూ కొండలలోనూ భూమిలోని గుహలలోనూ గుంటలలోనూ సంచరించారు. అలాంటివారికి ఈ లోకం యోగ్యమైనది కాదు.
39 ✽వీరందరిగురించి నమ్మకాన్ని బట్టి మంచి సాక్ష్యం ఇవ్వడం జరిగింది గాని వారు వాగ్దానం✽ నెరవేర్పు అనుభవించలేదు. 40 ఎందుకంటే, మనం లేకుండా వారు సంపూర్ణసిద్ధి పొందకూడదని దేవుడు మనకోసం మరీ శ్రేష్ఠమైన✽దానిని సిద్ధం చేశాడు.