10
1 ధర్మశాస్త్రం సంభవించబోయే మంచి విషయాలకు నీడ✽ గలది గాని ఆ విషయాల స్వరూపం దానికి లేదు. అందుచేత ధర్మశాస్త్రం, వారు ఏటేట నిత్యం అర్పించిన ఒకే రకం ఆ బలులచేత సమీపించేవారికి పరిపూర్ణత✽ ఎన్నడూ కలిగించలేకపోయేది. 2 ✽ ఒకవేళ కలిగించగలిగి ఉంటే ఆ బలులు ఇంకా అర్పించడం మానివేయడం జరిగి ఉండదా? ఆరాధించేవారు పూర్తిగా శుద్ధులైన తరువాత పాపాలను గురించి గద్దించే అంతర్వాణి వారికింకా ఉండి ఉండదు గదా. 3 గానీ ఆ బలులు ఏటేటా పాపాలను గురించి జ్ఞాపకం చేస్తాయి. 4 ఎందుకంటే ఎద్దుల, మేకల రక్తం పాపాలను తీసివేయడం అసాధ్యం✽.5 ✽ అందుచేత ఆయన లోకంలోకి వచ్చినప్పుడు దేవునితో అన్నాడు: “బలినీ యజ్ఞాన్నీ✽ నీవు కోరలేదు. అయితే నా కోసం శరీరాన్ని తయారు చేశావు. 6 హోమాలు, పాపాల కోసమైన అర్పణలు అంటే నీకు సంతోషం కలగలేదు. 7 ✝అప్పుడు నేనిలా చెప్పాను: ‘ఇదిగో నేను వచ్చాను. గ్రంథం చుట్టలో నన్ను గురించి వ్రాసి ఉంది. ఓ దేవా, నీ చిత్తమే సాధించడానికి వచ్చాను.’”
8 బలినీ యజ్ఞాన్నీ హోమాలను పాపాలకోసమైన అర్పణలను “నీవు కోరలేదు”, వాటిలో “నీకు సంతోషం కలగలేదు” అని ముందు చెప్పాడు – ధర్మశాస్త్రం ప్రకారం✽ ఇవి అర్పించినవి. 9 అప్పుడాయన “ఇదిగో ఓ దేవా, నీ చిత్తమే సాధించడానికి వచ్చాను” అన్నాడు. ఇలా ఆయన ఆ రెండో దానిని✽ స్థాపించడానికి ఆ మొదటిదానిని రద్దు చేశాడు. 10 ✽ఆ చిత్తంవల్ల, యేసు క్రీస్తు శరీరం బలి కావడం ద్వారా మనం ఎప్పటికీ ఒకే సారి పవిత్రమయ్యాం.
11 ప్రతి యాజీ రోజు రోజు నిలిచి✽ సేవ చేస్తూ ఒకే రకం బలులు పదే పదే అర్పిస్తూ ఉన్నాడు. ఇవి పాపాలను ఎన్నడూ తీసివేయలేవు✽. 12 ఈ మానవుడైతే పాపాలకోసం ఎప్పటికీ నిలిచి ఉండే✽ ఒకే బలి ఇచ్చిన తరువాత దేవుని కుడివైపున✽ కూర్చున్నాడు✽. 13 అప్పటినుంచి ఆయన తన శత్రువులు తన పాదాల క్రింద పీట✽గా అయ్యేవరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 14 ✽ఎందుకంటే ఒకే యజ్ఞంచేత ఈయన పవిత్రపరచబడుతున్నవారిని✽ శాశ్వతంగా✽ పరిపూర్ణులను చేశాడు.
15 ఈ విషయంలో పవిత్రాత్మ కూడా మనకు సాక్ష్యం✽ ఇస్తున్నాడు. 16 ✽ ఆయన “ఆ రోజులైన తరువాత నేను ఇస్రాయేల్ వారితో చేయబోయే ఒడంబడిక ఇదే: ఇది ప్రభు వాక్కు – నేను నా శాసనాలు వారి హృదయాలలో ఉంచుతాను, వాటిని వారి మనసులమీద వ్రాస్తాను” అని చెప్పిన తరువాత 17 ✽“వారి అపరాధాలనూ ధర్మవిరుద్ధ చర్యలను అప్పటినుంచి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు. 18 వీటికి క్షమాపణ ఉన్న పక్షంలో పాపాలకోసం బలి ఇంకెన్నడూ✽ ఉండదు.
19 ✽సోదరులారా, యేసు తెర✽ద్వారా అంటే తన శరీరం ద్వారా మనకు సజీవమైన కొత్త మార్గం✽ అంకితం చేశాడు. 20 కాబట్టి దాని గుండా యేసు రక్తంచేత అతి పవిత్రస్థలంలో ప్రవేశించడానికి✽ మనకు ధైర్యం ఉంది. 21 దేవుని ఇంటిమీద✽ గొప్ప ప్రముఖ యాజి✽ కూడా మనకున్నాడు. 22 గనుక సంపూర్ణ విశ్వాస నిశ్చయత✽తో, యథార్థ హృదయం✽తో, మన శరీరం శుద్ధ జలం✽తో కడగబడి, అంతర్వాణి నేరారోపణ చేయకుండా ప్రోక్షించబడ్డ హృదయాలు కలిగి దేవుణ్ణి సమీపిద్దాం✽.
23 ✝వాగ్దానం చేసినవాడు విశ్వసనీయుడు✽ గనుక నిలకడగా ఉండి మనం ఒప్పుకొన్న ఆశాభావాన్ని గట్టిగా చేపట్టి ఉందాం. 24 ✽అంతే కాకుండా, ప్రేమనూ మంచి పనులనూ పురికొలపడానికి ఒకరి విషయం ఒకరం ఆలోచిద్దాం✽. 25 ✽సమాజంగా సమకూడి రావడం మానకుండా ఉందాం. అలా మానడం కొందరికి అలవాటు. మనమైతే ఒకరినొకరం ప్రోత్సాహపరచుకొంటూ, ఆ దినం✽ దగ్గరపడడం చూచేకొలది మరి ఎక్కువగా అలా చేస్తూ ఉందాం.
26 ✽ఎందుకంటే, సత్యాన్ని గురించి తెలుసుకొన్న తరువాత మనం బుద్ధి పూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే✽ ఇకమీదట పాపాలకోసం బలి ఉండదు✽. 27 అప్పుడు మిగిలినదేమంటే, న్యాయమైన తీర్పు✽ గురించీ దేవుని విరోధులను✽ దహించివేసే అగ్నిజ్వాలల్లాంటి✽ ఆగ్రహాన్ని గురించీ భయంతో ఎదురు చూడడమే. 28 ✽ ఎవరైనా సరే మోషే ధర్మశాస్త్రం నిరాకరిస్తే ఇద్దరి, ముగ్గురి సాక్ష్యాన్ని బట్టి నిర్దాక్షిణ్యంగా చావవలసి వచ్చేది. 29 ✽అలాంటప్పుడు తన పాదాలక్రింద దేవుని కుమారుణ్ణి త్రొక్కివేసి తనను పవిత్రపరచిన ఒడంబడిక రక్తం అపవిత్రమని భావించి కృపాభరితమైన దేవుని ఆత్మను దూషించినవాడికింకా ఎంత ఎక్కువ కఠినమైన దండనకు తగినవాడని ఎంచబడతాడో! ఏమనుకొంటారు? 30 ✝“పగ తీర్చే పని నాదే, నేనే ప్రతిక్రియ చేస్తాను” అని ప్రభువు చెపుతున్నాడు; “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అని పలికినవాడు మనకు తెలుసు గదా! 31 ✽జీవం గల దేవుని చేతికి చిక్కడం భయంకరమైన విషయం!
32 ✽✽మునుపటి రోజులు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీ మనోనేత్రాలు వెలుగొందిన తరువాత మీరు బాధలతో కూడిన పెద్ద పోరాటం ఓర్చుకొన్నారు. 33 దానిలో కొంత మీరు నిందలకూ కడగండ్లకూ గురి అయి బహిరంగంగా వింత దృశ్యం కావడంవల్ల కలిగింది. మరి కొంత మీరు అలాంటివాటికి గురి అయినవారితో సహవాసం చేసినందువల్ల కలిగింది. 34 ఎలాగంటే, మీరు ఖైదీనైన నా మీద జాలి చూపారు. మీ ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగినా సంతోషంతో అంగీకరించారు. ఎందుకంటే, దానికంటే స్థిరమైన శాశ్వతమైన ఆస్తి పరలోకంలో మీకుందని తెలుసుకొన్నారు.
35 అందుచేత మీ ధైర్యాన్ని వదలిపెట్టకండి. దానికి గొప్ప బహుమతి దొరుకుతుంది✽. 36 మీరు దేవుని చిత్తాన్ని సాధించిన తరువాత వాగ్దానం చేసినది మీకు లభించాలంటే ఓర్పు✽ అవసరం. 37 ✽ “ఇంకా కొద్ది కాలంలో రాబోయేవాడు వస్తాడు, ఆలస్యం చేయడు. 38 గానీ న్యాయవంతుడు దేవునిమీది తన నమ్మకంవల్లే జీవిస్తాడు. ఎవడైనా వెనక్కు తీస్తే✽ అతని విషయంలో నాకు సంతోషం ఉండదు.”
39 అయితే మనం✽ నాశనానికి వెనక్కు తీసేవారం కాము గాని ఆత్మ రక్షణకు నమ్మేవారమే.