9
1 ✽మొదటి ఒడంబడికకు కూడా దైవసంబంధమైన సేవకోసం న్యాయ నియమాలు, భూసంబంధమైన పవిత్రాలయం✽ ఉన్నాయి. 2 ✽ ఒక ఆరాధన గుడారాన్ని తయారు చేశారు. దాని ముందు భాగంలో దీపస్తంభం✽, బల్ల✽, సన్నిధి రొట్టెలు ఉన్నాయి. ఈ భాగాన్ని పవిత్ర స్థలం అంటారు. 3 రెండో తెర✽ వెనుక అతి పవిత్ర స్థలమనే భాగం ఉంది. 4 అందులో బంగారు ధూపార్తి✽, పూర్తిగా బంగారు తొడుగు చేసిన ఒడంబడిక పెట్టె✽ ఉన్నాయి. ఆ పెట్టెలో మన్నా✽ ఉన్న బంగారు పాత్ర, చిగిర్చిన అహరోను దండం✽, ఒడంబడిక పలకలు✽ ఉన్నాయి. 5 పెట్టెకు పైగా మహిమ✽కు చెందిన కెరూబులు✽ కరుణాపీఠాన్ని కమ్ముకొని ఉన్నాయి. ఈ విషయాల గురించి ఇప్పుడు వివరించి చెప్పలేము.6 ✽ఈ విధంగా ఇవన్నీ తయారైనప్పుడు యాజులు ఆరాధన గుడారంలోని ఆ ముందు భాగంలో ఎప్పుడూ ప్రవేశిస్తూ దైవిక సేవ✽ జరిగిస్తూ ఉండేవారు. 7 ✽అయితే ఆ రెండో భాగంలోకి సంవత్సరానికి ఒక్క సారే ప్రముఖయాజి ఒకడే ప్రవేశించేవాడు. రక్తం లేకుండా ప్రవేశించలేదు. అతడా రక్తం తన కోసం, ప్రజలు తెలియక చేసిన పాపాల✽ కోసం అర్పించాడు.
8 ఈ ప్రకారం, ఆ మొదటి ఆరాధన గుడారం నిలిచి ఉన్నప్పుడు అతి పవిత్ర స్థలంలోకి మార్గమేదో వెల్లడి కాలేదని పవిత్రాత్మ✽ సూచిస్తున్నాడు. 9 ✽అదంతా ప్రస్తుత కాలానికి ఉదాహరణ లాంటిది. అర్పించిన ఆ అర్పణలూ బలులూ ఆ ఆరాధకులను అంతర్వాణి విషయంలో పరిపూర్ణులుగా చేయలేవు. 10 ✽అవి అన్నపానాలూ నానా విధాల జల సంస్కారాలూ దేహ సంబంధమైన విధులకు సంబంధించినవీ మాత్రమే. అవి దిద్దుబాటు కాలం వరకే విధించబడేవి.
11 ✽✝అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలను గురించి ప్రముఖ యాజిగా పాత ఆరాధన గుడారం కంటే మరింత ఘనంగా, పరిపూర్ణంగా ఉన్నదాని ద్వారా వచ్చాడు. ఇది చేతులతో చేసినది కాదు. ఈ సృష్టికి సంబంధమైనది కాదన్నమాట. 12 ఆయన మనుషుల కోసం శాశ్వత విముక్తి✽ సంపాదించి మేకల రక్తంతో, ఎద్దుల✽ రక్తంతో కాక తన సొంత రక్తం✽తోనే ఒక్క సారే అతి పవిత్ర స్థలంలో ప్రవేశించాడు. 13 మేకల రక్తం, ఎద్దుల రక్తం, ఆవుదూడ✽ బూడిద అశుద్ధమైన వారిమీద చల్లడం శరీర శుద్ధి విషయంలో పవిత్రపరచేది. 14 ఇలాగైతే క్రీస్తు రక్తం మీ అంతర్వాణిని✽ జీవం గల దేవుని సేవకోసం నిర్జీవ క్రియలనుంచి మరీ ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆయన శాశ్వతుడైన ఆత్మద్వారా తనను తానే నిష్కళంకుడుగా✽ దేవునికి సమర్పించుకొన్నాడు.
15 ఈ కారణంవల్ల✽ ఆయన తన మరణం ద్వారా మొదటి ఒడంబడిక క్రింది అతిక్రమణల విముక్తి✽కోసం, క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి✽ అయి ఉన్నాడు. దేవుని పిలుపు అందినవారికి శాశ్వతమైన వారసత్వాన్ని✽ గురించిన వాగ్దానం లభించాలని ఆయన ఉద్దేశం.
16 మరణ శాసనం✽ ఉంటే దానిని రాసినవాని మరణం తప్పనిసరి. 17 అంటే, మరణ శాసనం రాసినవాడు బ్రతికి ఉన్నంతవరకు అది చెల్లనే చెల్లదు. అతడు చనిపోతేనే అది అమల్లోకి వస్తుంది. 18 ✽ అందుచేతే ఆ మొదటి ఒడంబడికను కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠించడం జరగలేదు. 19 ధర్మశాస్త్రం ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞనూ ప్రజలందరికీ చెప్పిన తరువాత కోడెదూడల, మేకల రక్తం తీసుకొని నీళ్ళతో, ఎర్రని గొర్రెబొచ్చుతో, హిస్సోపు రెమ్మతో ధర్మశాస్త్ర గ్రంథంమీద, ప్రజలందరిమీదా దాన్ని చిలకరించాడు, 20 ఇది దేవుడు మీకు ఆజ్ఞాపించిన ఒడంబడిక రక్తమని చెప్పాడు. 21 ✽ఆ విధంగానే అతడు ఆరాధన గుడారముమీద, సేవా పాత్రలన్నిటిమీదా రక్తం చల్లాడు. 22 ధర్మశాస్త్రం ప్రకారం సుమారు వస్తువులన్నీ✽ రక్తంతో శుద్ధి అయ్యేవి. రక్తం చిందనిదే అపరాధాలకు క్షమాపణ✽ లేదు.
23 పరలోకంలో ఉన్నవాటికి సూచనగా ఉన్నవి✽ వాటిచేత శుద్ధి కావడం అవసరమే, గానీ ఆ పరలోక సంబంధమైనవి✽ వాటి కంటే శ్రేష్ఠమైన యజ్ఞాలచేత శుద్ధి కావాలి. 24 చేతులతో చేసిన పవిత్రస్థలాల్లో క్రీస్తు ప్రవేశించలేదు. ఆ స్థలాలు నిజమైన✽వాటికి మాదిరి మాత్రమే. ఇప్పుడు దేవుని సముఖంలో మనకోసం✽ కనబడడానికి ఆయన పరలోకంలోనే ప్రవేశించాడు. 25 ✝అంతే కాదు, ప్రముఖయాజి ఏటేటా తనది కాని రక్తంతో అతి పవిత్ర స్థలంలో ప్రవేశించే ప్రకారం క్రీస్తు తరచుగా తనను తాను అర్పించుకోవాలని కాదు. 26 అలా చేయాలంటే జగత్తుకు పునాది వేసినప్పటినుంచి ఆయన అనేక సార్లు బాధ అనుభవించవలసి వచ్చేది. గానీ ఇప్పుడు యుగాల అంతంలో ఒకే సారి✽ తనను తాను బలిగా అర్పించుకోవడంవల్ల పాపం లేకుండా చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు.
27 మనుషులు ఒకే సారి చనిపోవాలనే✽ నియమం ఉంది. ఆ తరువాత తీర్పు✽ జరుగుతుంది. 28 అలాగే క్రీస్తు కూడా ఒకే సారి అనేకుల✽ అపరాధాలను భరిస్తూ బలి అయ్యాడు. అపరాధానికి విడిగా తనకోసం ఎదురు చూచేవారికి✽ ముక్తి ప్రసాదించడానికే రెండో సారి✽ కనిపిస్తాడు.