8
1 మేము చెపుతున్న సంగతులలో ముఖ్యాంశమిదే: ఇలాంటి ప్రముఖయాజి ఒకడు మనకున్నాడు. ఆయన పరలోకంలో ఉన్న మహా ఘనపూర్ణుని సింహాసనం కుడిప్రక్కన కూర్చుని ఉన్నాడు. 2 పవిత్ర గర్భాలయంలో, అంటే నిజమైన ఆరాధన గుడారంలో ఆయన సేవ చేస్తున్నవాడు. ఈ ఆరాధన గుడారాన్ని వేసినది మనుషులు కాదు గాని ప్రభువే.
3 ప్రతి ప్రముఖయాజీ అర్పణలూ బలులూ అర్పించడానికి నియమితమైనవాడు. అందుచేత ఈ ప్రముఖయాజికి కూడా అర్పించడానికి ఒకటి ఉండాలి. 4 ఈయన భూమిమీద ఉంటే యాజిగా ఉండనే ఉండడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారమైన అర్పణలు అర్పించేవారు ఉన్నారు. 5 అయితే వారు సేవ చేసేది పరలోక విషయాలకు సూచనగా, నీడగా ఉన్న దాన్ని మాత్రమే. మోషే ఆరాధన గుడారం నిర్మించబోయినప్పుడు దేవుడు అతణ్ణి హెచ్చరిస్తూ ఇలా అన్నాడు: “ఈ పర్వతం మీద నీకు చూపెట్టిన నమూనా ప్రకారమే అన్నీ చేయాలి సుమా.”
6 ఈయనకైతే దానికంటే మరీ శ్రేష్ఠమైన సేవ లభించింది. అంతేకాకుండా ఆయన పాత ఒడంబడిక కంటే శ్రేష్ఠమైన ఒడంబడికకు మధ్యవర్తి. ఇది పాత వాగ్దానాలకంటే శ్రేష్ఠమైన వాగ్దానాల మీద స్థాపితమైనది. 7 ఒకవేళ ఆ మొదటి ఒడంబడిక లోపం లేనిదైతే రెండో దానికి అవకాశం కోసం వెతికి ఉండేది కాదు. 8 కానీ దేవుడు వారి విషయం తప్పు మోపి ఇలా అన్నాడు:
“ఇదిగో విను, ప్రభువు చెప్పేదేమంటే, ఒక కాలం రాబోతుంది. అప్పుడు నేను ఇస్రాయేల్‌వారితోనూ యూదా వారితోనూ కొత్త ఒడంబడిక చేస్తాను. 9 నేను ఈజిప్ట్‌లోనుంచి వారి పూర్వీకులను చేయి పట్టుకొని నడిపించాను. ఈ కొత్తది నేను ఆ కాలంలో వారితో చేసిన ఒడంబడికలాగా ఉండదు. ఎందుకంటే వారు నా ఒడంబడికలో నిలకడగా ఉండిపోలేదు, గనుక నేను వారిని లెక్క చేయలేదని ప్రభువు చెపుతున్నాడు. 10 ఆ రోజులైన తరువాత నేను ఇస్రాయేల్‌వారితో చేయబోయే ఒడంబడిక ఇదే: ఇది ప్రభువు చెపుతున్నాడు – నేను నా శాసనాలు వారి మనసులలో ఉంచుతాను, వాటిని వారి హృదయాల మీద వ్రాస్తాను. నేను వారికి దేవుడనై ఉంటాను. వారు నాకు ప్రజలై ఉంటారు. 11 వారంతా అల్పులైనా ఘనులైనా నన్ను తెలుసుకొంటారు గనుక ‘యెహోవాతో పరిచయం చేసుకో’ అంటూ వారు తమ తమ సాటి పౌరులకూ సోదరులకూ బోధించరు. 12  నేను వారి అన్యాయాన్ని గురించి కరుణ చూపుతాను, వారి పాపాలనూ ధర్మవిరుద్ధ చర్యలనూ ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను.”
13 ఆయన “క్రొత్త ఒడంబడిక” అన్నప్పుడు మొదటి దాన్ని పాతదిగా చేశాడు. ఏదైతే పాతగిలి ఉడిగిపోతుందో అది అంతర్థానమైపోవడానికి సిద్ధంగా ఉంటుంది.