7
1 ✽ఈ మెల్కీసెదెక్ షాలేం పట్టణం రాజు, సర్వాతీతుడైన దేవుని యాజి. రాజులను వధించి తిరిగి వస్తూ ఉన్న అబ్రాహామును అతడు కలుసుకొని అతణ్ణి దీవించినవాడు. 2 అబ్రాహాము అతనికి అన్నిట్లో పదో భాగం ఇచ్చాడు. మొదట, అతని పేరుకు అర్థం “నీతి న్యాయాలకు రాజు”, తరువాత “షాలేం రాజు” అంటే “శాంతికి రాజు”. 3 అతడు తల్లి, తండ్రి, వంశవృక్షం లేనివాడు. అతని రోజులకు ఆది జీవితానికి అంతం అంటూ లేవు గాని దేవుని కుమారునిలాగా చేయబడి అతడు ఎప్పటికీ యాజి అయి ఉన్నాడు.4 ✽✝అతడెంత గొప్పవాడో చూడండి. వంశకర్త అబ్రాహాము కొల్లగొట్టిన శ్రేష్ఠమైన వాటిలో పదో భాగం అతనికిచ్చాడు. 5 లేవీ✽ సంతానంలో యాజి పదవి పొందినవారు తమ సోదరుల దగ్గర, అంటే అబ్రాహాము వంశంలో జన్మించిన ప్రజల దగ్గర పదో భాగం✽ పుచ్చుకోవాలని ధర్మశాస్త్రంలో ఆదేశం ఉంది. 6 అయితే వారి వంశానికి చెందనివాడైన మెల్కీసెదెక్ దేవుని వాగ్దానాలు గల అబ్రాహామునుంచి పదో భాగం పుచ్చుకొని అతణ్ణి దీవించాడు✽. 7 దీవించేవాడు అధికుడు, దీవెన అందుకొనేవాడు తక్కువవాడనే మాట ఎవరూ కాదనలేరు. 8 అంతేకాదు. ఇక్కడ చావుకు లోనయ్యే మనుషులు పదో భాగం పుచ్చుకొంటున్నారు. గాని అక్కడ ఎప్పటికీ బ్రతికేవాడని✽ చెప్పబడేవాడు పదో భాగం పుచ్చుకొన్నాడు. 9 ✽ఒక విధంగా చెప్పాలంటే పదో భాగం పుచ్చుకొన్న లేవీ, అబ్రాహాము ద్వారా పదో భాగం ఇచ్చాడు. 10 ఎలాగంటే, మెల్కీసెదెక్ అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవీ ఇంకా తన పూర్వీకుడి గర్భంలోనే ఉన్నాడు.
11 ✽లేవీ వారి యాజి ధర్మం అనే పునాది మీద ఇస్రాయేల్ ప్రజకు ధర్మశాస్త్రం✽ వచ్చింది. యాజిధర్మం ద్వారా సంపూర్ణత✽ కలిగేదైతే అహరోను✽ వరుసలో పిలుపు ప్రకారం కాక మెల్కీసెదెక్ వరుసప్రకారం మరో యాజి రావలసిన అవసరం ఏముంది?
12 ✽యాజి ధర్మం మారిందీ అంటే దాని ధర్మశాస్త్రం కూడా మారడం తప్పనిసరి. 13 ఈ సంగతులు ఎవరిని గురించి చెప్పబడ్డాయో ఆయన వేరే గోత్రానికి చెందినవాడు. ఆ గోత్రికులలో ఎవ్వరూ బలిపీఠం దగ్గర ఎన్నడూ సేవ చేయలేదు. 14 మన ప్రభువు యూదా✽ వంశంలో జన్మించాడని తేటతెల్లమే. ఈ గోత్రాన్ని ఉద్దేశించి మోషే యాజులను గురించి ఏమీ చెప్పలేదు.
15 ✽మెల్కీసెదెక్‌ను పోలిన మరో యాజి రావడం కారణంగా, మేము చెప్పినది ఇంకా తేటతెల్లమే. 16 ఎలాగంటే, ఈ యాజి ధర్మశాస్త్రంలోని దేహసంబంధమైన షరతు ప్రకారం కాక అంతం లేని జీవానికున్న బలప్రభావాల ప్రకారమే వచ్చాడు. 17 ✽ఇందుకు “నీవు మెల్కీసెదెక్ వరుసప్రకారం సదాకాలం యాజివి” అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు గదా.
18 ధర్మశాస్త్రం దేనినీ పరిపూర్ణమైనదిగా చేయలేదు. యాజులను గురించిన మొదటి విధి✽ బలహీనమైనది, పనికిమాలినది, గనుక దానిని రద్దు చేయడమూ 19 దానికంటే శ్రేష్ఠమైన ఆశాభావాన్ని✽ తెచ్చిపెట్టడమూ జరిగింది. దీనినిబట్టి మనం దేవుణ్ణి సమీపిస్తున్నాం.
20 ✽ మరో విషయం – శపథం లేకుండా ఇదంతా జరగలేదు. 21 వారేమో శపథం లేకుండా యాజులు అయ్యారు. యేసైతే శపథంతోనే “నీవు మెల్కీసెదెక్ వరుస ప్రకారం సదాకాలం యాజివి. ప్రభువు ప్రమాణం చేశాడు. ఆయన మాటకు తిరుగు లేదు” అని ఆయనతో చెప్పినవాని ద్వారానే యాజి అయ్యాడు. 22 ఈ విధంగా, పాతదానికంటే మరీ శ్రేష్ఠమైన ఒడంబడికకు✽ యేసు పూచీదారుగా ఉన్నాడు.
23 ✽మరొకటి, అప్పటి యాజులు అనేకులు. ఎందుకంటే మరణం కారణంగా వారు సేవలో సాగిపోలేకపోయారు. 24 ఈయన అయితే శాశ్వతంగా సేవలో సాగిపోతూ ఉన్నాడు గనుక ఆయన యాజి ధర్మం మారనిది. 25 ఈ కారణంచేత తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చినవారిని శాశ్వతంగా✽ రక్షించగలవాడు. ఎందుకంటే✽ వారి పక్షంగా విన్నవించడానికి ఆయన ఎప్పటికీ జీవిస్తూ ఉన్నాడు.
26 ✽ ఇలాంటి ప్రముఖయాజి మనకు తగినవాడే. ఆయన పవిత్రుడు, నిర్దోషి, కళంకమేమీ లేనివాడు, పాపులలో చేరని ప్రత్యేకమైనవాడు,✽ ఆకాశాలకంటే ఉన్నతుడైనవాడు. 27 మునుపటి ప్రముఖయాజుల లాగా ఆయన మొదట తన పాపాలకోసం బలులు సమర్పించనక్కరలేదు. తరువాత ప్రజల కోసం రోజు రోజూ బలులు సమర్పించనక్కరలేదు. తనను తాను సమర్పించుకొన్నప్పుడు ఒక్క సారే ఇది చేసి ముగించాడు. 28 ధర్మశాస్త్రం బలహీనతగల మనుషులను యాజులుగా నియమించేది గాని ధర్మశాస్త్రం తరువాత✽ ప్రమాణం✽తో వచ్చిన మాట దేవుని కుమారుణ్ణి యాజిగా నియమించింది. ఈయన శాశ్వతంగా పరిపూర్ణసిద్ధి✽ పొందినవాడు.