6
1 అందుచేత, క్రీస్తును గురించిన ప్రాథమికమైనవి మాని సంపూర్ణతకు సాగిపోదాం. అంటే, నిర్జీవ క్రియల విషయం పశ్చాత్తాపపడడమూ, దేవుని మీద నమ్మకం ఉంచడమూ, 2 బాప్తిసాలను గురించిన ఉపదేశమూ, చేతులుంచడమూ, చనిపోయినవారు లేవడమూ, శాశ్వతమైన తీర్పూవీటికి పునాది మళ్ళీ వేయకుండా ముందుకు సాగిపోదాం. 3 దేవుడు అనుమతి ఇస్తే అలా చేస్తాం.
4 ఎందుకంటే, ఒకసారి మనోనేత్రాలు వెలుగొంది, ఉచితమైన పరలోక వరాన్ని రుచి చూచి, పవిత్రాత్మలో పాల్గొని, 5 దేవుని హిత వాక్కునూ వచ్చే యుగ ప్రభావాలనూ రుచి చూచినవారు 6 ఆ తరువాత దారి ప్రక్కన పతనం అయ్యారు అంటే, వారిని మళ్ళీ పశ్చాత్తాపపడేలా చేయడం అసాధ్యం. ఎందుకని? వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువ వేసి ఆయనను బట్టబయలుగా అవమానానికి గురి చేస్తారు.
7 భూమి తరచుగా కురిసిన వాన పీల్చుకొని, ఎవరికోసం వ్యవసాయం జరుగుతున్నదో వారికి తగిన పంట ఇస్తూ దేవుని దీవెనలో పాలు పొందుతుంది. 8 కానీ ముండ్ల తుప్పలూ గచ్చతీగెలూ దానిలో పెరిగితే అది తిరస్కారమై శాపానికి గురి కాబోతున్నది. చివరికి దానిని కాల్చివేయడం జరుగుతుంది.
9 అయితే, ప్రియ సోదరులారా, మేమిలా మాట్లాడుతూ ఉన్నా, ఇంతకంటే మీ పరిస్థితులు మంచివనీ విముక్తి, రక్షణ గలదనీ మాకు గట్టి నమ్మకం ఉంది. 10 ఎందుకంటే దేవుడు అన్యాయస్థుడు కాడు – మీరు చేసిన పనిని ఆయన మరవడు. పవిత్రులకు మీరు ప్రయాసతో సేవ చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. అందులో తన పేరుపట్ల మీరు చూపిన ప్రేమను ఆయనేమీ మరవడు. 11 మీలో ప్రతి ఒక్కరూ పూర్తి నిశ్చయతతో ఆశాభావం అనుభవించడానికి అలాంటి శ్రద్ధాసక్తులు చివరిదాకా చూపాలనీ, 12 మీరు మందబుద్ధులు కాక, నమ్మకం ద్వారా ఓర్పు ద్వారా దేవుని వాగ్దానాలకు వారసులైనవారిని అనుకరించాలనీ మా ఆశ.
13 దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవానితోడని శపథం చేయలేక తన తోడని శపథం చేస్తూ ఇలా అన్నాడు: 14 “నేను నిన్ను తప్పనిసరిగా దీవిస్తాను. నీ సంతానాన్ని తప్పక వృద్ధి చేస్తాను.” 15 ఈ విధంగా అబ్రాహాము కొంత కాలం ఓపికతో ఎదురు చూచిన తరువాత అతనికి వాగ్దానం నెరవేరింది.
16 మనుషులు తమకంటే గొప్పవానితోడని శపథం చేస్తారు. అలా పలికినదానిని శపథం బలపరచి ప్రతి వివాదాన్ని అంతం చేస్తుంది. 17 అలాగే దేవుడు కూడా తాను ఉద్దేశించినది మార్పులేనిదని తన వాగ్దాన వారసులకు చూపాలని కోరి శపథం చేశాడు. 18 మార్పు చెందని ఈ రెండు ఉన్నాయి. వాటి విషయంలో దేవుడు అబద్ధమాడడం అసాధ్యం. వాటినిబట్టి, మన ముందు ఉంచిన ఆశాభావం చేజిక్కించుకోవడానికి శరణాగతులైన మనకు గట్టి ప్రోత్సాహం ఉండాలని ఆయన కోరిక. 19 ఆశాభావం మన ఆత్మకు “లంగరు” లాంటిది, భద్రమైనది, సుస్థిరమైనది, తెర లోపల ఉన్నదానిలోకి ప్రవేశిస్తూ ఉండేది. 20 యేసు మనకోసం మనకు ముందుగా అందులో ప్రవేశించాడు. ఆయన మెల్కీసెదెక్ వరుస ప్రకారం సదాకాలం ప్రముఖయాజి అయ్యాడు.