5
1 ✽మనుషులలో నుంచి ఎంపిక చేయబడ్డ ప్రతి ప్రముఖ యాజిని✽ నియమించినది దేవుని విషయాలలో మనుషుల తరఫున ఉండి పాపాలకోసం యజ్ఞాలూ బలులూ అర్పించడానికే. 2 అతడు కూడా బలహీనతకు గురి అయినవాడు గనుక తెలివి లేక త్రోవ తప్పినవారిపట్ల✽ మృదుభావంతో వ్యవహరించగలడు. 3 అందుచేత అతడు ప్రజల నిమిత్తం✽ పాపాలకోసం బలులు అర్పించవలసి ఉన్నట్టే తన నిమిత్తం✽ కూడా అర్పించవలసి ఉంది.4 ✝ఈ ఘనత ఎవ్వడూ తనకు తానే తీసుకొన్నది కాదు. అది పొందేవాడు అహరోనులాగే దేవుని పిలుపు అందినవాడు.
5 ✝అలాగే క్రీస్తు కూడా ప్రముఖయాజి కావడానికి తనను తానే గౌరవించుకోలేదు. “నీవు నా కుమారుడవు. ఈ రోజు నిన్ను కన్నాను” అని ఆయనతో చెప్పినవాడే అలా ఆయనను గౌరవించాడు. 6 ✽✽దీనికి అనుగుణంగానే మరో చోట దేవుడు ఇలా అన్నాడు: “నీవు మెల్కీసెదెక్✽ వరుస ప్రకారం సదాకాలం యాజివి.”
7 ✽క్రీస్తు భూమిమీద సశరీరంగా ఉన్న రోజులలో తనను చావు✽లోనుంచి రక్షించగలవానికి గట్టి ఏడుపులతో, కన్నీళ్ళతో ప్రార్థనలూ విన్నపాలూ✽ అర్పించాడు. ఆయనకున్న భయభక్తులను బట్టి దేవుడు విన్నాడు. 8 ఆయన కుమారుడై ఉండీ కూడా తాను అనుభవించిన బాధల వల్ల విధేయత అంటే ఏమిటో నేర్చుకొన్నాడు✽. 9 అంతే కాక, ఆయన పరిపూర్ణుడై✽ తన మాట విన్నవారందరికీ✽ శాశ్వతమైన విముక్తికి మూలాధారమయ్యాడు. 10 దేవుడు ఆయనను మెల్కీసెదెక్ వరుసప్రకారం ప్రముఖ యాజిగా పిలిచి నియమించాడు.
11 ✽ఆయనను గురించి చెప్పడానికి మాకెన్నో సంగతులున్నాయి గాని వాటిని మీకు వివరించి చెప్పడం కష్టమే. ఎందుకంటే, వినడంలో మీరు మందబుద్ధులయ్యారు. 12 ✽కాలాన్ని బట్టి చూస్తే మీరిప్పుడు ఉపదేశకులై ఉండాలి గాని మరొకడు మీకు దేవోక్తులలో ఉన్న మొదటి పాఠాలు మళ్ళీ నేర్పవలసి ఉంది. మీకు అవసరమైనది బలమైన ఆహారం✽ కాదు గాని పాలే. అలా తయారయ్యారు. 13 పాలు మాత్రం తీసుకొనేవారంతా పసి పిల్లలే. అలాంటి వ్యక్తికి నీతిన్యాయాల సందేశం✽ విషయంలో అనుభవం లేదు. 14 బలమైన ఆహారం పెద్దలకే✽, అంటే మంచిచెడ్డలు గుర్తించడానికి వారి మనశ్శక్తులు వాడుకోవడంవల్ల వాటిని సాధనం చేసుకున్న వారికే.