4
1 అందుచేత, ఆయన విశ్రాంతిలో ప్రవేశించడంకోసం వాగ్దానం ఇంకా నిలిచి ఉన్నప్పుడు మీలో ఎవరైనా దానిని అందుకోకుండా ఉన్నారేమో అని భయంతో ఉందాం. 2 శుభవార్తను మనకూ వారికీ ప్రకటించడం జరిగింది. అయితే విన్నవాక్కు వల్ల వారికి ప్రయోజనమేమీ కలగలేదు. ఎందుకంటే, విన్నవారిలో వాక్కుతో నమ్మకం కలిసినది కాదు. 3 నమ్మిన మనమైతే విశ్రాంతిలో ప్రవేశిస్తూ ఉన్నాం. జగత్తుకు పునాది ఏర్పడినప్పటినుంచీ ఆ కార్యకలాపాలన్నీ ముగిసి ఉన్నా, “నేను ఆగ్రహంతో ‘వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు’ అని శపథం చేశాను” అన్నాడు. 4 అంతే కాదు, ఆయన ఏడో రోజు గురించి “దేవుడు తన పనులన్నీ సంపూర్తి చేసి ఏడో రోజున పని మానుకొన్నాడు” అని ఒక చోట అన్నాడు. 5 మళ్ళీ ఈ చోట “వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అన్నాడు.
6 ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించాలని ఉందన్నమాటే గాని మొదట శుభ సందేశ ప్రకటన విన్నవారు అవిధేయత కారణంగా ప్రవేశించకపోవటం వల్ల 7 ఆయన మళ్ళీ “ఈ రోజు” అనే మరో సమయాన్ని నియమించాడు. ముందు చెప్పినట్టు “ఈ రోజు మీరు ఆయన స్వరం వింటే మీ గుండె బండబారిపోయేలా చేసుకోకండి” అంటే చాలా కాలానికి దావీదుచేత పలికించాడు. 8 ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి కలిగించాడూ అంటే ఆ తరువాత మరో రోజును ఉద్దేశించి దేవుడు చెప్పి ఉండడు.
9 అందుచేత దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. 10 ఎందుకంటే, దేవుడు తన పనులు మానుకొన్నట్టే, ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవారు కూడా తమ పనులు మానుకొన్నారు. 11  అందుచేత ఆ అవిధేయుల పోకడ ప్రకారంగా ఎవరైనా పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి శ్రద్ధ వహించుకొందాం. 12 ఎందుకంటే, దేవుని వాక్కు జీవం గలది, బలప్రభావాలు గలది, రెండంచుల ఎలాంటి ఖడ్గంకంటే కూడా వాడిగలది. అది లోపలికి దూసుకుపోతూ, ప్రాణాన్నీ ఆత్మనూ విభాగిస్తుంది, కీళ్ళనూ మూలుగనూ వేరు చేస్తుంది, తలంపులకూ హృదయభావాలకూ తీర్పు చేస్తుంది. 13 సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు. ఆయన కంటికి సమస్తమూ తేటతెల్లంగా, బట్టబయలుగా కనిపిస్తుంది. అలాంటి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి.
14 అయితే మనకు గొప్ప ప్రముఖయాజి ఒకడు ఉన్నాడు. ఆయన ఆకాశాల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. అందుచేత మనం ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టుదాం. 15 ఎందుకంటే, మనకు ఉన్న ప్రముఖయాజి మన బలహీనతల విషయంలో సానుభూతి లేనివాడు కాడు. ఆయన మనలాగే అన్నిటిలో విషమపరీక్షలకు గురి అయ్యాడు గాని ఆయన పాపం లేనివాడు. 16 కనుక మనకు కరుణ లభించేలా, సమయానుకూలమైన సహాయంకోసం కృప కలిగేలా ధైర్యంతో కృప సింహాసనం దగ్గరికి చేరుదాం.